నవ్యాంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై బిజెపి, టిడిపిలు చేస్తున్న విన్యాసాలు జుగుప్స కలిగిస్తున్నాయి. అధికారంలోకొచ్చి సంవత్సరం దాటినా హోదాపై స్పష్టం చేయకుండా ప్రజలను డోలాయమానంలో పడేసేందుకు రెండు పార్టీలు నాలుగు నాల్కలతో మాట్లాడుతున్నాయి. ప్రత్యేక హోదా సహా పునర్విభజన చట్టంలో పొందుపర్చిన, ఆ సందర్భంగా పార్లమెంటు చర్చలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని బిజెపి, టిడిపి సంయుక్తంగా ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని గద్దెనెక్కాయి. వాగ్దానాల అమలులో రెండు పార్టీలూ కప్పదాట్లకు దిగడం జనానికి వెన్నుపోటు పొడవడమే.