ఆర్థిక విధానంపై ప్రతిష్టంభన..

ఆర్థిక విధానానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య విభేదాలున్నాయని వార్తా పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. గవర్నర్‌ అధికారాలను కుదించటానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంకు చట్టాన్ని సవరించాలని ప్రభు త్వం ఆలోచిస్తున్నంత తీవ్రంగా ఈ అభిప్రాయభేదాలున్నాయి. అయితే ఈ తేడాలు భారత ఆర్థిక వ్యవస్థలో లోతుగా పాతుకుపో యిన అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలే. ఇక్కడ ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అనేది కాదు. అసలు విషయం ఏమంటే ఏ విధానాన్ని అవలంబించినా ఆర్థిక వ్యవస్థ మరింత ఒడిదుడుకులకు లోనుకావటం తథ్యమనేది. ఒక సంక్షోభ రూపాన్ని అధిగమించే ప్రయత్నం చేసినప్పుడు అది విజయవంతంగా మరో రూపాన్ని సంతరించుకుంటున్న పరిస్థితిని సంక్షోభంగా నిర్వచించినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నదని ఎవరైనా చెప్పవచ్చు. అయితే ఈ సంక్షోభం ఎలా వ్యక్తీకరింపబడాలి అనే విషయం గురించే ప్రభుత్వానికి, రిజర్వ్‌బ్యాంకుకు మధ్య అభిప్రాయబేధాలున్నాయి.
పడిపోతున్న వృద్ధి రేటు
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు స్పష్టంగా మందగిస్తున్నది. ఇక్కడ తగ్గుతున్న ఎగుమతులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే 2015లోని మొదటి త్రైమాసికంలో ఎగుమతులను డాలర్లలో లెక్కించినప్పుడు 16.8 శాతం క్షీణించాయి? ఎగుమతులలో వచ్చిన ఈ క్షీణత వల్ల ఏర్పడిన గుణక ప్రభావం ఫలితంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తగ్గిపోయింది. దిగుమతులు కూడా డాలరు విలువలో గత సంవత్సరంతో పోల్చినప్పుడు మొదటి త్రైమాసికంలో 12.6 శాతం క్షీణించాయనేది నిజం(ఇది రూపాయలలో లెక్కించినప్పుడు 7.2 శాతంగా ఉన్నది). కానీ ఈ క్షీణత ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పడిపోవటం వల్ల జరిగింది. చమురు దిగుమతితో సంబంధంలేని ఇతర దిగుమతులను లెక్కలోకి తీసుకున్నప్పుడు అంతకుముందు సంవత్సరం కంటే 2015-16 మొదటి త్రైమాసికంలో 2.6 శాతం పెరిగాయి. అయితే చమురు ధరలు పడిపోయినప్పటికీ మొదటి త్రైమాసికంలో 3,220 కోట్ల డాలర్ల వ్యాపార లోటు ఉన్నది. (ఇది గత సంవత్సర లోటు 3,300 కోట్ల డాలర్లకు దాదాపు సమానం). 2015 జులై 10 నాటికి భారత విదేశీ ద్రవ్య నిల్వల మొత్తం 33,400 కోట్ల డాలర్లు. దీనితో ఇలాంటి వ్యాపార లోటుతో ఏర్పడే కరెంటు ఖాతా లోటును అందుబాటులోవున్న విదేశీ మారకపు నిల్వలతో మేనేజ్‌ చెయ్యవచ్చనే భావన ఏర్పడుతుంది. అయితే ఈ విదేశీ మారకపు నిల్వలలో చాలా వరకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్‌ఐఐలు) ద్వారా వచ్చినవి. 
ఈ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను రాత్రికి రాత్రే ఉపసంహరించుకోవచ్చు. చెల్లింపుల సమతూకం అవసరాలకు అలా ఉపసంహరించుకోవటాన్ని నిరోధించవలసిన అవసరం ఉంటుంది. నిజానికి అలాంటి నిధులు సరిపడా ప్రవహిచేలా చూసుకోవటం అవసరం. అలా జరగాలంటే వడ్డీ రేటును పెంచివుంచటం ఒక మార్గం. వడ్డీ రేటును తగ్గిస్తే నిధులు బయటకు వెళ్ళటం మొదలవుతుంది. అలా నామమాత్రంగానే మొదలైనప్పటికీ ఆ తరువాత మారకపు రేటు పడిపోతుంది. దానితో అది మరింతగా పడిపోతుందని భావించి నిధులు బయటకు వెళ్ళటం ఒక ప్రవాహంగా మారుతుంది. అలాంటి పరిస్థితిలో నిల్వలు ఏ స్థాయిలో ఉన్నా అవి అచిరకాలంలో కరిగిపోయి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. రూపాయి మారకపు విలువ పడిపోవటంతో దిగుమతుల ధరలు పెరుగుతాయి. దానితో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా వడ్డీ రేటును పెంచివుంచవలసి ఉంటుంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పెంచాలంటే వడ్డీ రేటును తగ్గించాలి. వడ్డీ రేటును తగ్గిస్తే వాస్తవంలో వృద్ధి ఉత్తేజితమౌతుందా లేదా అనేది వేరే విషయం. అయితే ఇందుకోసం వడ్డీ రేటు దిశ తిరోగమనం వైపు ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆవిధంగా మనకు ఎగుమతులు పడిపోవటానికి కారణమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం కొనసాగుతున్న స్థితిలో చెల్లింపుల సమతూకం సాధించేందుకు వడ్డీ రేటును ఎక్కువగా ఉండేలా చూడవలసిన ఆవశ్యకత ఉన్నది. అదే సమయంలో వృద్ధిని సాధించాలంటే వడ్డీ రేటు తక్కువగా ఉండేలా చూడవలసిన అవసరం కూడా ఉన్నది. ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థను రెండు వేరువేరు విధాలుగా ప్రభావితం చేస్తున్నది. ఒకదానితో వడ్డీ రేటును పెంచవలసిన ఆవశ్యకత, మరో దానితో వడ్డీ రేటును తగ్గించవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వడ్డీ రేటును తగ్గించాలంటుంటే, రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వడ్డీ రేటును పెంచాలని కోరుతున్నారు. 
వడ్డీ రేటును పెంచి ఉంచినప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచటానికి మరో సాధనాన్ని ఉపయోగిస్తే ఈ తగవు సమసిపోతుంది. అయితే చిక్కంతా ఇక్కడే ఉన్నది. నయా ఉదారవాదం ఒక పద్ధతి ప్రకారం ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు ఉపయోగపడే మరింత సమర్థత గల మరో సాధనాన్ని ఉపయోగించకుండా చేసింది. దానిపేరే విత్త విధానం. ఆర్థిక లోటును ద్రవ్య పెట్టుబడి ఇష్టపడదు. 
అందుకే నయా ఉదారవాద విధానాలను అవలంబించే దేశాలు 'విత్త బాధ్యత' చట్టాలను చేసి స్థూల జాతీయోత్పత్తిలో లోటు మొత్తం ఎంత ఉండాలనే పరిమితిని (ఇది సాధారణంగా 3 శాతంగా ఉంటుంది) విధిస్తాయి. అదే సమయంలో విత్త బాధ్యత చట్టం విధించిన పరిధిలో ఆర్థిక వ్యవస్థను విత్తపరంగా ఉత్తేజితం చేసేందుకు సాధ్యపడే విధంగా పన్నులతో వచ్చే ఆదాయాన్ని విస్తృతపరచటం, ప్రభుత్వ వ్యయాన్ని పెంచటం వంటి చర్యలను చేపట్టటం జరగదు. సంపన్నులపై పన్నులను విధించి ఆ రెండింటినీ విస్తరిస్తే ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయవచ్చు. కానీ ధనికులపై పన్నులు విధించటాన్ని ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకిస్తుంది. దానితో విత్త విధానంతో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రత్యామ్నాయం నయా ఉదారవాదంలో తిరస్కరింపబడుతుంది. 
ఉదాహరణకు ఆర్థిక వ్యవస్థ విస్తృతికి అనుగుణంగా వడ్డీ రేటు విధానం ఉండాలని రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌తో తగవుపడే ఇదే అరుణ్‌ జైట్లీ ద్రవ్య లోటును తగ్గించటంలో తలమునకలై ఉన్నారు. ఆర్థిక వ్యవస్థను మందగింపజేసే అవకాశం ఉన్నప్ప టికీ ఉపాధి హామీ వంటి పథకాలకు కేటాయించే నిధులను తగ్గిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగించే మరో విధాన సాధనం పేరు మారకపు రేటు విధా నం(ఇది దేశ నికర ఎగుమతులను పెంచుతుంది). 
రెండు స్పష్టమైన కారణాలచేత దీనిని కూడా తిరస్కరించటం జరుగుతోంది. చమురు దిగుమతులపై ఆధారపడే మనలాంటి ఆర్థిక వ్యవస్థలో రూపాయి మారకపు విలువ రేటు తగ్గటంవల్ల దిగుమతి చేసుకుంటున్న ముడి సరుకుల ధర పెరిగితే దాని ప్రభావంతో అంతిమంగా మార్కెట్‌లోకి ప్రవేశించే సరుకుల ధర పెరుగుతుంది. రెండవ కారణమేమంటే ఒక్కసారి మారకపు రేటు తగ్గటం అంటూ జరిగితే అది మరింతగా తగ్గుతుందనే భావన ఏర్పడి పెట్టుబడులు దేశం విడిచి వెళతాయి. మారకపు విలువలో వాస్తవ కుదింపు కరెన్సీ పతనానికి సూచికగా ఉండే అవకాశం ఉంటుంది.
తీవ్రతరమయ్యే ఘర్షణ
కాబట్టి ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్‌ బ్యాంకుల మధ్య జరుగుతున్న ఘర్షణ మూలాలు నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో ఏక కాలంలో అనేక లక్ష్యాలను సాధించటానికి అందుబాటులో ఉన్న ఏకైక సాధనంగా వడ్డీ రేటు విధానం ఉన్నదనే వాస్తవంలో ఉన్నాయి. స్థూల జాతీయోత్పత్తి, చెల్లింపుల సమతౌల్య నిర్వహణ, ద్రవ్యోల్బణ నియంత్రణ మొదలగునవి ఈ లక్ష్యాలలో ప్రధానమైనవి. ప్రస్తుతం కేవలం ఒకే ఒక సాధనంతో బహుళ లక్ష్యాలను సాధించగలగటం తార్కికంగా దుస్సాధ్యం. ఈ లక్ష్యాలను సాధించే అవకాశం ఏమైనా ఉండాలంటే అవి ఎంత సంఖ్యలో ఉన్నాయో కనీసం అదే సంఖ్యలో విధాన సంబంధిత సాధనాలుండాలి. వేరేవిధంగా చెప్పాలంటే 'ఒకే రాయితో అనేక పక్షులను కొట్టటం' అనేది అదృష్టం మీదనే ఆధారపడివుంటుంది. సాధారణీకరించాలంటే పక్షులెన్ని ఉన్నాయో కనీసం అదే సంఖ్యలో రాళ్ళు ఉంటేనే వాటిని కొట్టగలుగుతాం. ఒక దేశం అనేక లక్ష్యాలను సాధించటానికి దానికి కేవలం ఒకే ఒక సాధనాన్ని నయా ఉదారవాదం అందుబాటులో ఉంచటంవల్ల ఆ సాధనాన్ని ఎలా వాడాలనే విషయం గురించి ఘర్షణ జరగటం అనివార్యం. కొందరు ఈ సాధనాన్ని ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సాధించటానికి వాడాలనుకుంటే ఇతరులు మరొక లక్ష్యాన్ని సాధించటానికి వాడాలనుకుంటారు. భారత్‌లో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఇప్పటివరకూ జరిగిన దానికంటే మరింతగా ఎన్‌డిఎ ఆర్థిక మంత్రి నయా ఉదారవాద నిర్దేశాలను పాటిస్తున్నారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచటానికి ద్రవ్య విధానాన్ని తప్ప మరే ఇతర సాధనాన్ని వాడటానికి ఆయన సుముఖంగా లేరు. ఆయన ప్రభుత్వ ప్రతిష్టంతా అలా ఉత్తేజింపజేయటంపైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే 'వృద్ధి' జరుగుతుందని, దానితో మంచిరోజులు(అచ్చేదిన్‌) వస్తాయనే నినాదంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గనుక. మరోవైపు విదేశీ మారకాన్ని నిర్వహించే, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే సంస్థగా ఉన్న రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేటు తగ్గితే చెల్లింపుల సమతౌల్యం, ధరల స్థితి అస్థిరమౌతుందనే స్థిర అభిప్రాయంతో ఉన్నది. ఆ విధంగా నయా ఉదారవాద నిర్దేశాలను ఆచరిస్తూ ప్రభుత్వం తన చేతులను తానే కట్టేసుకోవటాన్ని ఈ రెండింటి మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన ప్రతిబింబిస్తున్నది. అనేక లక్ష్యాలను సాధించటానికి దానికి అందుబాటులో ఉన్నది ఒకే ఒక సాధనం. నిజానికి వడ్డీ రేటు సాధనం వృద్ధి సాధించటానికి అంత ప్రభావశీలమైనది కాదు. ఒకవేళ అది ప్రభావశీలమైనదేనని అనుకున్నా దానితో చేసే ప్రయత్నం ఒక తార్కిక దుస్సాధ్యత అని చెప్పకతప్పదు.అంతేకాకుండా ఈ ఘర్షణ రాబోయే రోజుల్లో మరింతగా ముదురుతుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. ఉదాహరణకు ఈ ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సాధారణ సూచిక వృద్ధి గత సంవత్సరం ఇదే కాలంలో 4.7 శాతంగా ఉన్న వృద్ధితో పోల్చినప్పుడు అది 3.0 శాతంగా ఉన్నది. యూరో జోన్‌ దేశాలు 'పొదుపు' విధానాన్ని మరింత తీవ్రంగా ఆచరిస్తున్న స్థితిలో చైనా వృద్ధి రేటు మందగించింది. 
ఈ మధ్య కాలంలో చైనాలో సంభవించిన స్టాక్‌ మార్కెట్‌ పతనం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది. దీని ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగిస్తుంది. ఇలా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించటం ఎన్‌డిఎ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. దానితోపాటు తమకు ఓటువేసిన పట్టణ యువతలో ఉద్యోగిత కొరవడుతుంది. తత్ఫలితంగా వడ్డీ రేటు తగ్గించాలని ప్రభుత్వం ఒత్తిడితెస్తుంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించటం, దానితో గణనీయంగా ఎగుమతులు తగ్గిపోవటం వల్ల విదేశీ పెట్టుబడుల ప్రవాహం దేశంలోకి రావటంపై చెల్లింపుల సమతౌల్యం మరింతగా ఆధారపడుతుంది. ఇందుకోసం రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేటు ఎక్కువగా ఉండాలంటుంది. కాబట్టి రెండింటి మధ్య స్పర్థ మరింతగా పెరుగుతుంది. అయితే వడ్డీ రేటును పెంచినా లేదా తగ్గించినా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండటం అనే వాస్తవ జీవిత వైరుధ్యాన్ని ఈ స్పర్థ ప్రతిబింబిస్తుంది.
- ప్రభాత్‌ పట్నాయ