CRDA కార్యాలయం ముట్టడి..

రాజధాని ప్రాంతంలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకోబోమని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్రిడా కార్యాలయాన్ని పేదలు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, ఏప్రిల్‌ నుండే పింఛన్లిస్తామని అక్కడక్కడా కొద్దిమందికే ఇచ్చి సరిపెట్టారని, ఉండవల్లిలో ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక్కడి రైతులు పూలింగ్‌కు భూములివ్వనందునే కక్షగట్టారా? అని ప్రశ్నించారు. పింఛన్ల పంపిణీపై నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య, రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు తక్షణమే పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం క్రిడా డిప్యూటీ తహశీల్దార్‌ ఎస్‌ఎంఎకె ఆజాద్‌కు వినతిపత్రం ఇచ్చారు.