
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 28 ఫిబ్రవరి, 2026.
సెకీ ద్వారా అదానీతో చేసుకున్న
విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి
అదానీ కంపెనీ నుండి విద్యుత్ కొనుగోలు చేసే అవినీతికర సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని, అందుకు బాధ్యులైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. యూనిట్‌కు రూ.2.49లు చొప్పున 300 మెగావాట్ల విద్యుత్‌ను సెకీ నుండి కొనుగోలు చేయడానికి అవసరమైన సరఫరా ఏర్పాట్లకోసం గురువారం నాడు ఇంధన శాఖ జివో ఎంఎస్ నెంబర్ 8 జారీ చేయడం ద్వారా ప్రభుత్వ దగాకోరుతనం వెల్లడయింది. ఇప్పటికైనా ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఆ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
వినాశకర విద్యుత్ సంస్కరణల అమలులోను, రాష్ట్ర సంపదను అదానీలాంటి కార్పొరేట్‌లకు దోచిపెట్టడంలో గత వైసిపి ప్రభుత్వం దారిలోనే ఇప్పటి టిడిపి కూటమి ప్రభుత్వం నడుస్తున్నట్లు మరోసారి రుజువైంది. సౌర, పవన విద్యుత్ అంతకంతకు చౌకగా లభిస్తున్న సమయంలో అదానీ కంపెనీ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను 25 సంవత్సరాల పాటు 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడం జనాన్ని మోసం చేయడమే. ఈ విషయంలో వేలకోట్ల రూపాయలు చేతులు మారాయని ఇప్పటికీ అమెరికా కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. అవినీతికి పాల్పడిన అప్పటి ప్రభుత్వ పెద్దలను ఉన్నతాధికారులను బోనులో నిలబెట్టవలసింది పోయి టిడిపి కూటమి ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా జివో జారీ చేయడం కార్పొరేట్లకు, కేంద్ర బిజెపికి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు దాసోహం అవుతున్నాయని స్పష్టమవుతోంది. అంతేకాదు గడువు ప్రకారం విద్యుత్ సరఫరా చేయకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించిన అదానీ కంపెనీ నుండి పరిహారం రాబట్టాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
