రాజధాని ప్రాంతంలో రైతులను తప్ప పేదలను, దళితులను, వ్యవసాయ కార్మికులను, మైనార్టీలను, మహిళలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇకనైనా తీరుమార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాజధానిలోనే ప్రజలు ప్రభుత్వాన్ని పాతిపెడతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాజధానిలో పేదల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ రూ. 9 వేలు పరిహారమివ్వాలని, అసైన్డ్, సీలింగ్, చెరువుపోరంబోకు భూముల లబ్ధిదారులకు పరిహారం వెంటనే చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మికసంఘం, డ్వాక్రా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తుళ్లూరులో క్రిడా కార్యాలయం ముందు బైఠాయించారు.