వ్యాపంపై 9న విచారణ

మధ్యప్రదేశ్‌లోని వ్యాపం కుంభకోణంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు కోరుతూ కాంగ్రెస్‌ నేత దిగ్విజరు సింగ్‌, ముగ్గురు ఆర్‌టిఐ కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 9న విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు మంగళవారం అంగీకరించింది. ''అన్ని అంశాలు కలిపి ఒకేసారి విచారించాలని నిర్ణయించాం. జులై 9న విచారిస్తా''మని ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు, జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ అమితవ రారులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐ దర్యాప్తు చేయాలనీ, అది కూడా సుప్రీం పర్యవేక్షణలోనే సాగాలనీ దిగ్విజరుసింగ్‌, ఆర్‌టిఐ కార్యకర్తలు అశీష్‌ చతుర్వేది, డా||ఆనంద్‌ రారు, ప్రశాంత్‌ పాండే పిటిషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు ఈ కేసులో దర్యాప్తు ముగించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి నాలుగు మాసాల సమయాన్ని సుప్రీం కోర్టు మంజూరు చేసింది. కాగా, వ్యాపమ్‌ కుంభకోణంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు లేఖ రాస్తామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మంగళవారం తెలిపారు. ఈ విషయం సుప్రీం కోర్టులో విచారణకు వస్తే తాము కూడా సిబిఐ దర్యాప్తును కోరతామని తెలిపారు. ప్రజాస్వా మ్యంలో పాలకుడు అన్ని అనుమానాలకు, సందే హాలకు అతీతంగా ఉండాలన్నారు. 'ప్రజల మన స్సుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు. అందువల్ల ముందుగా ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంద'న్నారు. ప్రజల ఆకాంక్షలకు తాను తలవంచుతున్నానన్నారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తునకు అనుమతిస్తూ హైకోర్టుకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. భోపాల్‌లో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుంభకోణానికి సంబంధించిన మరణాల గురించి మాట్లాడుతూ, ప్రతి ఒక్క మరణం కూడా దురదృష్టకరమైనదని, అవి తనను చాలా కలిచివేస్తున్నాయని అన్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని అన్నారు. కాంగ్రెస్‌కు కుంభకోణం గురించి పట్టడం లేదని, కేవలం తనను లక్ష్యంగా చేసుకోవడం కోసమే ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు.