రాజీలేని తీర్పు..

అత్యాచార కేసుల్లో ఎటువంటి మధ్యవర్తిత్వానికి, రాజీకి తావు ఉండరాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం హర్షణీయం. ఇవి అపరాధ రుసుముతో చెల్లిపోయేంత స్వల్ప నేరాలు కావనీ, ఏమాత్రం మెతక వైఖరి అవలంబించడానికి ఆస్కారం లేనివనీ కింది కోర్టులకు సుప్రీం స్పష్టం చేయడం అభినందనీయం. మైనర్‌ బాలిక రేప్‌ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సదరు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు చేసిన సంచలన తీర్పు అది. కన్నూ మిన్నూ కానక ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడిన నిందితుడు ఆమె తల్లిదండ్రులతో రాజీ కుదుర్చుకునేందుకు సిద్ధపడడంతో హైకోర్టు అతనికి శిక్ష తగ్గించి విడుదల చేసేందుకు సిద్ధం కావడంతో సుప్రీంకోర్టు కలగజేసుకొని న్యాయస్థానాలకు స్పష్టమైన సూచనలు చేయాల్సి వచ్చింది. బాధితురాలు మైనర్‌ కనక కోర్టు తీర్పు గురించిన మంచిచెడులను విశ్లేషించుకునేంత, నిర్ణయం తీసుకునేంత పరిణతి ఉండకపోవచ్చు. అయినప్పటికీ బాధిత కుటుంబ పెద్దలను వశపరచుకుని రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేయడం నేరంగానే పేర్కొనడాన్ని బట్టి చెన్నరు హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కూడా సుప్రీం దృష్టిలో ఉన్నట్టు భావించవచ్చు. 2008లో పదిహేనేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ మోహన్‌కు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది కడలూరు మహిళా న్యాయస్థానం. నేరస్థుడు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించి ఆమెను పెళ్లాడతానని వేడుకోవడంతో న్యాయమూర్తి కరిగిపోయారు. నిందితుడి కారణంగా ఓ బిడ్డకు తల్లయిన బాధితురాలి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేసును మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా రాజీ కుదర్చా లని జడ్జి సూచించారు. ఇన్నేళ్లూ లేనిది శిక్ష ఖరారయ్యాక అతని లో పరివర్తన రావడం వెనక దాగిన కుట్రను భారత శిక్షా స్మృతిని ఆమూలాగ్రం అవపోసన పట్టిన న్యాయమూర్తి పసిగట్టలేక పోయినా, తనపై అతను చేసిన దాష్టీకాన్నీ, గాయాన్నీ మర్చిపోలేని బాధితురాలు, నేరస్థుడిలోని మేక వన్నె పులిని సరిగానే గుర్తించింది. తనను ఏమాత్రం సంప్రదించకుండా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పైకోర్టుకు వెళ్లే అవకాశం కోసం ఎదురుచూస్తోందామె. న్యాయ నిపుణులు, విద్యాధికుల్లో సైతం మద్రాసు హైకోర్టు తీర్పు పట్ల తీవ్ర వ్యతిరేకత రావడం గమనార్హం. అత్యాచార కేసుల్లో మెతక వైఖరి వహించడమంటే మూడు ముళ్లతో కఠిన కారాగార జైలు శిక్షను తప్పించుకొని స్వేచ్ఛగా సంచరించే అవకాశాన్ని నేరస్తుడికి కల్పించడమేనని విమర్శకులు పేర్కొన్నారు. ఇలాంటి స్థితిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళల్లో న్యాయస్థానం పట్ల విశ్వాసాన్ని పెంపొందించిం దనుకోవాలి.
అత్యాచారం వంటి నేరాల్లో న్యాయ పట్టభద్రులే రాజీకి ప్రయత్నించడం ఘోరమైన నేరం. దేవాలయం లాంటి మహిళ శరీరం మీద దాడి చేసి అపవిత్రం చేయడమంటే ఆమె జీవితంపై, వెలకట్టలేని ఆత్మగౌరవంపై దాడి చేయడమే. అటువంటి కేసుల్లో బాధితకు, నేరస్థుడికి మధ్య సయోధ్య కుదర్చడమంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా గాయపడిన మహిళ వ్యక్తిత్వాన్ని కించపరచడమే. నేరస్థుడు కఠిన శిక్షార్హుడు. అలాంటి వాడికి చట్టపరంగా మధ్యవర్తిత్వం వహించడమంటే అత్యాచారాన్ని నేరంగా పరిగణించక పోవడమే కాక తానేం చేసినా చెల్లుతుందనుకునే పురుషాధిక్య భావజాలపు మృగాళ్ల తరపున నిలబడడమే అవుతుంది.
            రాజకీయ నాయకులు, పోలీసులు, పెద్దమనుషులుగా చలామణి అయ్యేవారిది కూడా ఇదే ధోరణి. జరుగుతున్న అత్యాచారాలకు కారణం మహిళలేనని, ప్రేరేపించే వస్త్రధారణ, అసాధారణ సమయాల్లో సంచరించడమే కారణమని అడపా దడపా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకటిస్తూనే ఉన్నారు. ఇంతకు మించి అత్యాచారానికి పాల్పడిన వారి పశుప్రవృత్తిని వేలెత్తి చూపే ప్రయత్నమే చేయలేదు. బుర్రనిండా బూజుపట్టిపోయిన ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారమే కాక ములాయం సింగ్‌ యాదవ్‌ వంటి తల పండిన రాజకీయవేత్తలు సైతం 'తప్పు' చేసిన రేపిస్టులను నిర్దోషులుగా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయడాన్ని జీర్ణించుకోలేం. ప్రపంచం యావత్తూ వైవాహిక బలాత్కారాలను నేరాలుగా పరిగణించాలని పోరాడుతున్న వేళ పట్టపగలు, అర్ధరాత్రి, నగరాలు, గ్రామాలు అన్న భేదం లేకుండా జరుగుతున్న అత్యాచారాలపై మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉండడం దారుణం. బిజెపి నాయకత్వంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వం ఈ విషయమై చేతులెత్తేయడం చూస్తూనే ఉన్నాం. ఈ మాటల వెనక, మద్దతు వెనక పితృస్వామ్య సమాజపు భావజాలం కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మహిళల హక్కులకు ఎలాంటి విలువ ఉండదు. మహిళలను చిన్నచూపు చూసే వాతావరణంలో పెరిగిపెద్దయిన మగపిల్లలూ అదే రీతిలో ఆలోచిస్తారు. ఆడవారిని ఒక వస్తువులా, ఆస్తిలాగే భావిస్తారు. వారు వంట గదికే పరిమితమై, తాము చెప్పిన దానికి డూడూ బసవన్నల్లా తలాడించాలనే కోరుకుంటారు. పురుషాధిక్య భావజాలం నుంచి పుట్టినవే లైంగిక దాడులు కూడా. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన రాజీపూరిత తీర్పు సైతం ఆ కోవకు చెందినదే అనుకోవాలా? తనపై అంతటి దుర్మార్గానికి పాల్పడిన వాడితో జీవితాంతం కాపురం చేయమని సాక్షాత్తూ న్యాయస్థానమే చెప్పడమంటే నేరాన్ని విస్మరించి, మహిళ ఆత్మ గౌరవాన్ని కించపరచడమే కాక నేరస్థుడిని విజేతగా ప్రకటించడమే. జీవితాన్ని నరకప్రాయం చేసిన వాడు రౌడీ అయినా, దుర్మార్గుడైనా కలసి మెలసి బతకమనడమంటే ఆ మహిళ వ్యక్తిత్వాన్ని అవమానించడమే. సరిగ్గా ఈ సమయంలో సుప్రీం కలగచేసుకొని సదరు తీర్పులపై కొరడా ఝుళిపించడం ఆహ్వానించదగిన పరిణామం.