రుణ ఘోష..

                  ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విడుదల చేసిన ఎపి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు ఎంత ఘనంగా ఉన్నా ఆచరణపై అనుమానాలు కలుగుతున్నాయి. అందుక్కారణాలు లేకపోలేదు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు తొలి సిఎం అయిన చంద్రబాబు గత సంవత్సరం ఆవిష్కరించిన రుణ ప్రణాళిక టార్గెట్లు, సాధించిన ప్రగతిని పరిశీలిస్తే తాజా ప్లాన్‌కూ అదే గతి పడుతుందేమోనన్న సందేహం కలుగుతుంది. 2014-15 ప్రణాళిక లక్ష్యం రూ.91,459 కోట్లు కాగా బ్యాంకులు 85,345 కోట్లే ఇచ్చాయి. అందులో కూడా ప్రాధాన్యతా రంగాలకు బాగా తగ్గించేశాయి. ఈ విషయాన్ని ప్రజలు ఎలా విస్మరిస్తారు? ఎప్పుడో ఏడాది కింద ఇచ్చిన హామీ జనానికి గుర్తుండదని కాబోలు ముఖ్యమంత్రి 2015-16లో రూ.1,25,748 కోట్లతో మరోసారి వంచించే సాహసం చేశారు. రైతులు, నిరుద్యోగులు, సామాజికంగా వెనకబడ్డ వర్గాలు, మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక తోడ్పాటు కల్పిస్తామని, విరివిగా అప్పులిస్తామని ప్రభుత్వం ముందుకొస్తే ఎవరూ వద్దనరు. పైగా పరపతి సౌకర్యం కోసం ఆయా వర్గాల వారు కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం, బ్యాంకులు కలిసి ప్రణాళికలను కాగితాలు, పుస్తకాలకు పరిమితం చేసి ప్రజలను మోసగించడానికి అలవాటు పడ్డాయి. ప్రాధాన్యతారంగాలకు చిత్తశుద్ధితో రుణాలిప్పిస్తేనే చంద్రబాబు కలలు కంటున్న రెండంకెల వృద్ధి సాధ్యమవుతుంది. గత ఏడాదిలో బ్యాంకుల రుణ వితరణ తీరు చూస్తే సర్కారు చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతుంది. ప్రాధాన్యతా రంగాలకు గతేడాది రూ.77,894 కోట్లు ప్రతిపాదించగా రూ.59,654 కోట్లు ఇచ్చారు. లక్ష్యంలో రూ.18,240 కోట్లు (సుమారు 23 శాతం) పంపిణీ చేయలేదు. ఇస్తామన్న రుణాలకు ఎగనామం పెట్టి, 2015-16లో రూ.96,920 కోట్లు ఇస్తామంటే నమ్మేదెలా? టార్గెట్‌ సాధించామా, లేదా అని చర్చించేది మరో ఏడాదికి కదా, అప్పటికి చూసుకుందాంలే అనే ధోరణిని ప్రభుత్వం ఆశ్రయించడం దుర్మార్గం.
                  అప్పుల ఊబిలో దిగబడ్డ రైతుల రుణాలన్నీ మాఫీ చేసేస్తామని ఎన్నికల్లో తెలుగుదేశం హామీ ఇచ్చింది. పైగా తాము అన్నదాతలను రుణ విముక్తులను చేస్తామంటే ప్రతిపక్షాలు అడ్డు పడుతున్నాయని ఎదురుదాడి చేసింది. రుణ మాఫీపై తొలి సంతకం అని చెప్పి, అధికారంలోకొచ్చి ఏడాది దాటాక కూడా అతీగతీ లేకుండా పోయింది. నాలుగేళ్లలో రూ.24 వేల కోట్ల మాఫీ అని ఉపన్యాసాలు దంచుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటి వరకు ఎంత మాఫీ చేశారో చెప్పమంటే 'ఆ ఒక్కటీ అడక్కు' అని తప్పించుకు తిరుగుతున్నారు. రెండు విడతల మాఫీ అని అనేక షరతులు, నిబంధనలు పెట్టి అరకొరగా నిధులు విడుదల చేశారు. ఇంకా మూడవ విడతలో లక్షలాది దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. టిడిపి అధికారంలోకొచ్చాక రెండో ఖరీఫ్‌ మొదలైనా ఇప్పటికీ మొదటి సంవత్సర మాఫీ తేలకుండా ఉంటే, ఎప్పటికి రైతులకు పంట రుణాలిస్తారు? తొలి కిస్తీ ఇరవై శాతానికే రైతులను వంద చెరువుల నీళ్లు తాగించగా, తతిమ్మా 80 శాతం ఎప్పటికి ఇస్తారో, అసలు ఇస్తారో, లేదో, బాండ్ల సంగతేంటో అంతా అయోమయం. మాఫీ సమస్యను పరిష్కరించకుండా రుణాలు రెన్యువల్‌ చేయాలంటున్నారు

               ముఖ్యమంత్రి. బ్యాంకులు సైతం సర్కారు ఇచ్చిన సొమ్ము వడ్డీకి సరిపోకపోయినా, ఎలాగోలా జమ వేసుకొని, ఓవర్‌ డ్యూస్‌, ఎన్‌పిఎల నుంచి బయట పడటానికి తహతహలాడుతున్నాయి. అందుకే సర్కారు, బ్యాంకులు రైతులకు ఒక్క రూపాయి అదనంగా అప్పు ఇవ్వకుండా పాత అప్పులను కొత్త అప్పులుగా మార్చేస్తున్నాయి. రైతు పేరు మీద అప్పు కొండలా పేరుకుపోతోంది. ఒక్క రూపాయి రుణం రాదు. ఇదీ రుణ మాఫీ కర్షకులకు తెచ్చి పెట్టిన విపరీత పరిస్థితి.
ప్రభుత్వమే రైతులను దగా చేస్తుంటే బ్యాంకులు ఊరుకుంటాయా? వ్యవసాయానికి అప్పుల్లేవు పొమ్మంటున్నాయి. గతేడాది పంట రుణాల లక్ష్యం రూ.41,978 కోట్లు కాగా రూ.29,658 కోట్లు ఇచ్చాయి. ఇవన్నీ రెన్యువల్సే. అనుబంధ రుణాల టార్గెట్‌లో సగం ఖాళీ. మొత్తంగా సాగుకు రూ.56,019 కోట్లని చివరికి రూ.39,938 కోట్లు పంపిణీ చేశాయి. కౌలు రైతుల దీనావస్థ గురించి చెప్పనవసరం లేదు. లక్షల్లో ఉన్న వారికి ఇచ్చింది రూ.63 కోట్లు. గత సంవత్సరం సాగు రుణాలు అధోగతిలో ఉండగా, ఈ సంవత్సరం రూ.65 వేల కోట్లు ఇస్తాం, ఇంకా ఎక్కువ ఊడబొడుస్తాం అంటే ఏం ఉపయోగం? సరళీకరణ ఆర్థిక విధానాలొచ్చాక వ్యవసాయానికి బ్యాంకు రుణాలు అంతకంతకూ తగ్గుతున్నాయి.

            ఒక్క సంవత్సరంలోనే వ్యవసాయ రుణాలను ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంక్‌, ఆప్కాబ్‌తో సహా దాదాపు అన్ని బ్యాంకులూ తగ్గించుకోవడం ఆందోళనకరం. రియల్‌ ఎస్టేట్‌, భారీ పరిశ్రమలు, మైక్రోఫైనాన్స్‌లు, కార్పొరేట్లు, స్పెక్యులేవిట్‌ మనీ లెండింగ్‌ల వంటి ప్రాధాన్యేతర రంగాలకు విరివిగా లోన్లు ఇస్తున్నాయి. గతేడాది ప్రాధాన్యేతరాలకు రూ.13,565 కోట్లు కేటాయించగా రూ.25,691 కోట్లు ఇవ్వడం గమనార్హం. మహిళా గ్రూపులు (ఎస్‌హెచ్‌జి), సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ), ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వృత్తిదారులు, స్వయం ఉపాధి పథకాలు, ప్రభుత్వ స్పాన్సర్‌ స్కీంలకు బ్యాంకులు మొండిచెయ్యి ఇచ్చాయి. ఒకవేళ ఇచ్చినా అరకొరే. బ్యాంకుల సహాయ నిరాకరణకు ప్రభుత్వ విధానాలు, నిర్లక్ష్యం తోడై ఆయా వర్గాలకు పరపతి సౌకర్యం అందకుండా చేస్తున్నాయి. గతేడాది ఇదే సమయానికి అన్ని బ్యాంకుల్లో కలిపి రూ.1,65,242 కోట్లుగా ఉన్న డిపాజిట్లు రూ.1,93,753 కోట్లకు పెరిగాయి. రుణ ప్రణాళిక ఆ స్థాయిలో పెరగలేదు. డిపాజిట్లలో ఎక్కువ భాగాన్ని 'ఇతర' మార్గాలకు తరలిస్తున్నారు. వ్యవసాయం సహా ప్రాధాన్యతా రంగాల్లో సంస్థాగత పరపతి పెరిగితేనే చంద్రబాబు విజన్‌ రెండంకెల వృద్ధి సాకారమవుతుంది. లేదంటే ఆ కలలు కల్లలే అవుతాయి.