2016

పునరావాస ప్యాకేజీ అమలుచేయాలి..

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సంఘం ఆధ్వర్యాన ముంపు గ్రామాల్లో జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. 18 ఏళ్ళల నిండిన నిర్వాసిత యువతీ యువకులకు పునరావాస ప్యాకేజీ అమలు చేయాలన్నారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. బాధితుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే రూ.5లక్షలు అదనంగా చెల్లించాలన్నారు.

ప్రభుత్వ తీరే కారణం:మధు

కాపు గర్జన సభ సందర్భంగా జరిగిన ఘటనలు దురదృష్ట కరం, ప్రజలు భద్రత కోరుకుంటారు, రైలు బోగీలు తగలబడడాన్ని ఎవరూ హర్షించరని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి పి మధు పేర్కొన్నారు. ప్రభుత్వం వాగ్దానాలు చేసి ఒక తరగతి ప్రజల్లో ఆశలు రేపడం, దీర్ఘకాలం నాన్చడమే ఈ పరిస్థితి రావడానికి కారణమన్నారు. వాగ్దానాలు అమలు పరచాలని ప్రజలు కోరిన నేపథ్యంలో వారితో సంప్రదింపులు జరిపి పరిస్థితి చేజారిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. అయితే, అది ఆ పనిచేయకపోడం వల్లే ఇటువంటి ఘటనలకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు.

రోహిత్‌ మృతికి నిరసనగా విద్యాసంస్థల బంద్‌..

హెచ్‌సియు విద్యార్థి వేముల రోహిత్‌ మృతికి కారకులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆందోళనలు ఉధృతం చేస్తోంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది..

తుని ఘటనపై చంద్రబాబు..

రాజకీయ ప్రయోజనం కోసమే వైసిపి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముందస్తు పథకంతోనే తూర్పుగోదావరి జిల్లా తునిలో భయానక వాతావరణాన్ని సృష్టించారని సిఎం చంద్రబాబు విమర్శించారు. అనుకోకుండా జరిగిన ఘటన మాత్రం కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. తునిలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రజలు ఆలోచించి, చర్చ జరపాలని విజ్ఞప్తి చేశారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ ఘటనతో కాపులకు ఎంతమాత్రం సంబంధం లేదని, కొన్ని విద్రోహశక్తులే ఇందుకు కారణమని అన్నారు.

కాపుగ‌ర్జ‌న ఉద్రిక్తం..

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం చేపట్టిన కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిసిలుగా గుర్తించే వరకూ చావోరేవో తేల్చుకుందామంటూ ముద్రగడ పిలుపునిచ్చారు. పావుగంట కూడా ప్రసంగించకుండానే ఆయన అనూహ్యంగా రైలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. దీంతో లక్షలాదిగా వచ్చిన ఆందోళనకారులు కొంతమంది రైలు పట్టాలపై బైఠాయించారు. మరికొందరు ముద్రగడతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో14 రైలు బోగీలకు నిప్పంటించారు. 8 పోలీసు జీపులను తగులబెట్టారు. తుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించారు.

సీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

వచ్చే వార్షిక బడ్జెట్‌లో వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రోహిగా మిగిలిపోతారని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సీమ సమగ్రాభివృద్ధికి చంద్రబాబే ఆటంకమని విమర్శించారు. మదనపల్లి బిటి కళాశాల ఆవరణలో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సుకు ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధి పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు.

Pages

Subscribe to RSS - 2016