సీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

వచ్చే వార్షిక బడ్జెట్‌లో వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రోహిగా మిగిలిపోతారని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సీమ సమగ్రాభివృద్ధికి చంద్రబాబే ఆటంకమని విమర్శించారు. మదనపల్లి బిటి కళాశాల ఆవరణలో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సుకు ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధి పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. సీమ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు ఆలోచనలు, ప్రభుత్వ విధానాలే ప్రధాన ఆటంకంగా ఉన్నాయన్నారు. హంద్రీనీవా కాల్వ గట్లుపై నిద్రపోవడం కాదనీ, ప్రాజెక్టుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించాలనీ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ గుర్తింపునిచ్చి గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు ఎందుకు గుర్తింపునివ్వలేదని ప్రశ్నించారు.