March

రైతుల వాణి వినిపించనున్నఏచూరి..

వ్యవసాయసంబంధ సమస్యలైన రుణాలు, ఉచిత విద్యుత్‌ బిల్లులు, స్వామినాథన్‌ కమిటీ సూచనల మేరకు గిట్టుబాటు, మద్దతుధర లాంటి అంశాలపై నాసిక్‌లో సోమవారం నిర్వహించనున్న రైతు ర్యాలీలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. అఖిల భారత కిసాన్‌ సభ(ఎఐకెఎస్‌) అనుబంధ సంస్థ మహారాష్ట్ర రాజ్య కిసాన్‌ సభ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎఐకెఎస్‌ జాతీయ సంయుక్త కార్యదర్శి అశోక్‌ ధవాలె వెల్లడించారు. సుమారు లక్షమంది కార్యకర్తలు, రైతులు హాజరవ్వబోయే ఈ ర్యాలీలో అటవీ హక్కుల చట్టం పునరుద్ధరణకు డిమాండ్‌ చేస్తామని ఆయన తెలిపారు.

పార్టీ మారితే TDP వాళ్ళు 20కోట్లు ఇస్తామన్నారు..

పార్టీ మారితే 20 కోట్లు ఇస్తామని టిడిపి తనను ప్రలోభాలకు గురిచేసిందని వైసిపి ఎమ్మెల్యే రాజకుమారి తెలిపారు. ఎప్పటికీ వైఎస్‌ జగన్‌ అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కొన్ని ఛానళ్లు అవాస్తవాలతో తనపై లేనిపోని కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'నేనెవరితోనైనా టిడిపి వాళ్లతో మాట్లాడా'నని చెప్పానా? అని ప్రశ్నించారు. 

అవినీతి నిర్మూలనకే జీతాలు పెంచారంట..

అవినీతిని నిర్మూలించేందుకే తెలంగాణలో శాసనసభ, శాసనమండలి సభ్యుల వేతనాలు పెంచుతున్నట్టు ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి చెప్పారు. పైగా వేతనాలు పెంచాల్సిందిగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని కోరారని వెల్లడించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ, ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీమ హామీలు నెరవేర్చకపోతే బంద్ చేపడతాం..

విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ త్వరలో రాయలసీమ బంద్‌ చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ శాఖ ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉరవకొండ పట్టణంలో బహిరంగ సభ జరిగింది. అంతకుముందు ఆర్‌టిసి బస్టాండ్‌ నుంచి టవర్‌క్లాక్‌ సర్కిల్‌ వరకు ఎర్రజెండాలను చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గాలిమరల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని తెలిపారు.

మోడీ తృణమూల్‌తో కుమ్మక్కయ్యారా..?

శారదా కుంభకోణంపై సీబీఐ విచారణ, ఖాగ్రఘర్‌(బుర్ద్వాన్‌) పేలుళ్లపై ఎన్‌ఐఏ దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడంలేదంటూ ప్రధాని మోడీని సీపీఐ(ఎం) నేత సూర్యకాంత మిశ్రా ప్రశ్నించారు. నారదా ఛానల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో పట్టుబడ్డ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలను కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని మిశ్రా విమర్శించారు. వారిపై రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ విచారణ జరపకుండా ప్రధాని అడ్డుపడుతున్నారని మిశ్రా అన్నారు. తృణమూల్‌ నేతల అవినీతి కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో బెంగాల్‌ ప్రజలకు స్పష్టం చేయాలని మిశ్రా డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ కళాశాలల్లో 10.9%, ప్రైవేట్‌లో 81.1%

 ప్రభుత్వ కళాశాలలను ప్రభుత్వాలే భ్రష్టు పట్టించాయని పీడీఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ వి బాలసు బ్రహ్మణ్యం విమర్శించారు. శాసనమండలిలో సోమవారం ఉన్నత విద్యపై జరిగిన లఘు చర్చలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని, విద్యార్థులు మాత్రం తక్కువగా ఉన్నారని తెలిపారు. ప్రైవేట్‌ కళాశాలల్లో 81.1శాతం, ఎయిడెడ్‌లో 8.8 శాతం, ప్రభుత్వ కళాశాలల్లో 10.9 శాతం మంది చదువుతున్నారన్నారు. వివిధ దేశాల్లోని ఉన్నత విద్యా విధానాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నా, అలా పేరొందిన యూనివర్సిటీలు మనదేశంలో ఎందుకు లేవో ఆలోచించాలని సూచించారు. 

అఫ్జల్‌గురుపై బిజెపి వైఖరి..?

 'జమ్మూ-కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడటాన్ని సంతోషంగా ఆహ్వానిస్తాం. కానీ, అఫ్జల్‌గురు పట్ల బీజేపీ-పీడీపీ వైఖరిని ఇప్పుడు బీజేపీ వెల్లడించగలదా' అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ప్రశ్నించారు. 

యనమలతో వైకాపా ఎమ్మెల్యేల భేటీ

రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలిద్దరూ ఆదివారం ఇక్కడ యనమలను ఆయన నివాసంలో కలిశారు. వారి భేటీలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తెదేపా ఎమ్మెల్యే వర్మ కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, తెదేపాలోకి చేరికలు వంటి అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

HCU విద్యార్థులకు 352 మంది విద్యావేత్తల మద్దతు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ(హెచ్‌సియు) ఘటనపై మేధావులు, విద్యావేత్తలు, రచయితలు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు స్పందించారు. తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. హెచ్‌సియులో జరుగుతున్న చట్ట వ్యతిరేక చర్యలను ఖండించారు. ఈ మేరకు వీరంతా కలిసి ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రకటనపై సంతకం చేసిన వారిలో నోమ్‌ చామ్‌స్కీ, డా|| గాయత్రి చక్రవర్తి, స్పివాక్‌, డా|| బార్బరా హారిస్‌ వైట్‌, డా||గిలియన్‌ హార్ట్‌, డా|| మైఖేల్‌ డేవిస్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన 352 మంది ప్రొఫెసర్లు కూడా ప్రకటనపై సంతకాలు చేశారు. 

Pages

Subscribe to RSS - March