March

ఉద్యోగఖాళీల భర్తీపై మంత్రి యనమల..

 ఆంధ్రప్రదేశ్‌లో 20వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వయో పరిమితి సడలింపు అంశాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాలువ శ్రీనివాసులు ఈ ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగుల వయో పరిమితిని 45 ఏళ్ల వరకు సడలించాలని విన్నవించారు. 

ప్రజాసంక్షేమ కూటమిలో ఆప్‌చేరే సూచనలు

డీఎండీకే చేరికతో బలపడిన ప్రజాసంక్షేమ కూటమిలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా చేరే సూచనలు కన్పిస్తున్నాయి. పొత్తు విషయమై కూటమి సమన్వయకర్త, ఎండీఎంకే నేత వైగో మరో రెండ్రోజుల్లో ఆప్‌ నేతలతో సమావేశం కానున్నారు. ఈ చర్చల్లో భాగంగానే ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూటమి సీఎం అభ్యర్ధి కెప్టెన్ విజయకాంత్‌ను కలుసుకుం టారని పార్టీ వర్గాలు తెలిపాయి.

జగన్‌ కేసులో ఈడీ కొత్త ఛార్జిషీట్‌

జగన్‌ ఆస్తుల కేసు విషయంలో ఇప్పటి వరకు సీబిఐ ఇచ్చిన ఆధారాలతో ఈడీ దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా రాంకీ ఫార్మాపై విచారిస్తోన్న ఈడీ జగతి పబ్లికేషన్‌లో రాంకీ పెట్టిన పెట్టుబడులపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ సంస్థ దాదాపు రూ. 10 కోట్లను జగతి పబ్లికేషన్‌లో పెట్టుబడి పెట్టింది. దీనిద్వారా రూ. 144 కోట్ల లబ్ధి పొందినట్లు ఈడీ ఆరోపణలు చేస్తోంది. దీంతో రాంకీ ఫార్మాకు చెందిన 346 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 

మూజువాణి ఓటుతో ద్రవ్య వినిమయ బిల్లు..

AP 2016-17కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. వైకాపా సభ్యులు తమ సీట్లలో నుంచి లేచి నిరసన తెలుపుతూ, బడ్జెట్‌ ప్రతులను చించి ఎగరవేస్తున్న సమయంలోనే సభ ఆమోదం తెలిపింది.రాజ్యాంగంలోని 203, 204 నిబంధనల ప్రకారం ద్రవ్యవినిమయ బిల్లుకు సవరణకు కూడా అవకాశం లేదని, 158 (1) ప్రకారం దీన్ని ఆలస్యం చేయడానికి కూడా లేదని స్పీకర్‌ పేర్కొంటూ మూజువాణి ఓటుతోనే సభ దీనిని ఆమోదిస్తుందని ప్రకటించారు. 

నకిలీ మద్యం విక్రయిస్తే మరణశిక్షేనట..

నకిలీ మద్యం తయారు చేసినా.. అమ్మినా మరణశిక్షను విధించడానికి ఉద్దేశించిన బిల్లును బిహార్‌ శాసనసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభ్యులు మద్యాన్ని సేవించకూడదనే తీర్మానాన్ని కూడా ఉభయ సభల్లోని సభ్యులు ఏకగ్రీవంగా అంగీకరించారు. శాసనాలు చేస్తున్న ప్రజాప్రతినిధులే ముందుగా మద్యానికి దూరంగా ఉండి.. ప్రజలను కూడా ఆ వైపు నడిపించాలని బిహార్‌ ఎక్సైజ్‌(సవరణ) బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

మాపొట్టలు కొట్టి ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుతారా?

రాష్ట్రంలోని సుమారు 40 వేల మంది జీవనాధారాన్ని దెబ్బతీసే జీవో 279కి వ్యతిరేకంగా మున్సిపల్‌ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక రాజధాని విజయవాడ నడిబొడ్డున వేలాది మంది కార్మికులు గొంతెత్తి 'మాపొట్టలుగొట్టొద్దు' అంటూ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినదించారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఈ ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కార్మికులకు బదులు పనినే కాంట్రాక్ట్‌కు ఇచ్చేందుకు వీలుగా జారీ అయిన 279 జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్‌ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ జీవో 279పై బహిరంగ చర్చ కు టిడిపి సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు.

13 డిమాండ్లుతో సెప్టెంబర్‌2 జాతీయ సమ్మె

దేశం వ్యాప్తంగా ఏళ్ల తరబడి పేరుకుపోయిన కార్మిక సమస్యల పరిష్కారికై సెప్టెంబర్‌ 2 జాతీయ సమ్మెతో కార్మిక శక్తిని చాటాలని 11 కేంద్ర కార్మిక సంఘాల జాతీయ సదస్సు పిలుపునిచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన 12 డిమాండ్లతో పాటు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సదస్సు పేర్కొంది. మొత్తం 13 డిమాండ్ల పరిష్కారం కోసం కార్మిక సమ్మె చేయాలని సదస్సు నిర్ణయించింది.

మోడీ గడ్డపై హెచ్‌సియు నిరసన..

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ(హెచ్‌సియు) ఘటనపై ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. దేశ, అంతర్జాతీయ విద్యా వర్గం ఈ ఘటనపై మండిపడింది. మోడీ సొంత రాష్ట్రం(గుజరాత్‌)లో హెచ్‌సియు విద్యార్థులకు మద్ధతుగా సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ గుజరాత్‌ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్లూ, నల్సర్‌ యూనివర్శిటీల్లో కూడా హెచ్‌సియుకి మద్ధతుగా వివిధ రూపాల్లో సంఘీభావం తెలిపారు. 

విమర్శల నేపథ్యంలో బరిలోకి అమిత్‌షా

 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా రెండు రోజుల క్రితం తొలిసారిగా బెంగాల్‌ వెళ్లిన ప్రధాని నరేంద్రమోడి అక్కడి అధికారపక్షాన్ని (తృణమూల్‌)ను మాటమాత్రం అనకుండా వామపక్ష కూటమిపై దాడి ఎక్కుపెట్టారు.ఈ విషయం బెంగాల్‌లో చర్చనీయాంశంగా మారడంతో  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ధైర్యముంటే నారదా స్టింగ్‌ ఆపరేషన్‌లో లంచాలు తీసుకుంటూ పట్టుబడిన తృణమూల ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని బిజెపి అధ్యక్షులు అమిత్‌షా మంగళవారం సవాల్‌ విసిరారు. మమత అధికారంలోకి వచ్చిన తరువాత బాంబుల మోత తప్ప సంగీతం వినిపించడం లేదని ఆయన అన్నారు.

ముగిసిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ సమావేశాలు ఆరంభంనుంచి గందరగోళ పరిస్థితుల మధ్యే జరిగాయి. పలుమార్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమావేశాలనుంచి వాకౌట్‌ చేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాజకీయ డ్రామాలే తప్ప ప్రజా సమస్యలు, శాసన సభ నియమ నిబంధనలు అవసరం లేకుండా పోయాయని విమర్శలు వెల్లువెత్తాయి. 

Pages

Subscribe to RSS - March