శివారెడ్డి స్పూర్తితో ప్రజా ఉద్యమాలు

'గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మా తల్లో ఒకరు, సిపిఎం సీనియర్‌ నాయకులు సింహాద్రి శివారెడ్డి తన జీవితాన్ని ప్రజల కోసం అర్పించారు. ఆయన జీవిత ప్రస్థానం ఎంతో ఉత్తేజభరితమైంది. ఆయన వంటివారు అనేకమంది చేసిన త్యాగాల నుంచే భవిష్యత్తు ఉద్యమ మొలకలు వస్తాయి. వామ పక్షాలు ఐక్యంగా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడమే శివారెడ్డికి ఇచ్చే ఘన నివాళి అవుతుంది' అని వక్తలు పేర్కొన్నారు. సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ మంగళగిరి మండలం కాజలో ఆదివారం నిర్వహించారు.
సభలో పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ.. శివారెడ్డి 90 ఏళ్ల జీవిత ప్రస్థానంలో 70 సంవత్సరాలు కమ్యూనిస్టు ఉద్యమంతో ఆయన జీవితం పెనవేసుకు పోయిందన్నారు. ప్రజా ఉద్యమాలు, అక్టోబరు సోషలిస్టు మహా విప్లవం జయప్రదమైన ఉత్సాహపూరిత వాతావరణంలోనూ, అక్టోబరు విప్లవం దెబ్బతిని సోషలిజానికి ఎదురు దెబ్బలు తగలి, ప్రజా ఉద్యమాలు వెనుకపట్టుపట్టిన నిరుత్సాహపూరిత వాతావరణంలోనూ శివారెడ్డి అదరక.. నిరుత్సాపడకుండా ఉద్యమంలో పనిచేశా రని వివరించారు. సమాజంలో వస్తున్న తిరోగమన విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పోరాటాల్లోకి వస్తున్న ఆశావహ వాతా వరణం ప్రస్తుతం నెలకొందన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ శివారెడ్డి గొప్ప విప్లవకారుడన్నారు. ఆయన కుటుంబాన్ని, బంధు,మిత్రులందరినీ ఉద్యమ కార్యరంగలోకి దించారని తెలిపారు. జాతీయోద్యమ సాంప్రదాయాలతో నిరాడంబరంగా ప్రజాశ్రేయ స్సుకు అంకితమై పనిచేశారన్నారు. కమ్యూనిస్టు పార్టీలో ఊపిరున్నంత వరకూ పనిచేశారన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడారన్నారు. తెలంగాణా సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పిలుపునందుకుని శివారెడ్డి తన ఆస్తులమ్మి దళంలో చేరారని గుర్తుచేశారు. ఈ క్రమంలో అనేక నిర్బంధాలకు గురయ్యారని చెప్పారు. శివారెడ్డి ఆశయాలకోసం పునరంకితం కావడమే అందరికీ మార్గం కావాలన్నారు. కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ముఖ్యంకాదని, ప్రజా ఉద్యమాలే గీటురాయిగా ముందుకుసాగుతా రన్నారు. శివారెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు రాష్ట్ర కమిటీ తరుపున కార్యక్రమం చేపడతామని, అందరూ చేదోడువాదోడుగా నిలవాలన్నారు.
సిపిఐ (ఎంఎల్‌) రాష్ట్ర నాయకులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ.. శివారెడ్డి చివరి వరకూ మార్క్సిస్టుగా నిలిచి పనిచేశారన్నారు. నిర్భంధాలు ఎదురైనా లెక్కచేయలేదన్నారు. ఎంసిపిఐ (యు) రాష్ట్ర నాయకులు నాగభూషణం మాట్లాడుతూ.. శివారెడ్డి మరణం ప్రజాఉద్యమాలకు తీరని లోటన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు చౌదరి తేజేశ్వరరావు మాట్లాడుతూ.. శివారెడ్డి రైతాంగ పోరాటాల్లో పాల్గొన్నారని, ఉద్యమానికి ఎంతో సహాయపడ్డారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి రాష్ట్ర ఉద్యమానికి లోటన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముపాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు పోరాట ఫలితంగానే సమాజంలో అనేక మంచి మార్పులు జరిగాయన్నారు. ఎందరో మహానుభావులు కమ్యూనిస్టుగా ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడారనీ, పోరాట పటిమను ప్రదర్శించారనీ, వారిలో శివారెడ్డి ఒకరని కొనియాడారు. ఆదివారం కాజ గ్రామంలో సింహాద్రి శివారెడ్డి సంస్మరణసభను జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి సిపిఎం పొలిట్‌బ్యూరోసభ్యులు బివి.రాఘవులు రాష్ట్ర కార్యదర్శి పి మధు, ఇతర వామపక్షపార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా నలుమూలల నుండి పెత్త ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు సభకు హాజరయ్యారు.
కార్యక్రమంలో సిపిఐఎంఎల్‌ రాష్ట్ర నాయకులు సింహాద్రి ఝాన్సి, నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్‌, ఎంసిపిఐ (యు)నాయకులు కె.నాగభూషణం, సిపిఐఎంఎల్‌ రెడ్‌స్టార్‌ రాష్ట్ర కార్యదర్శి కొల్లిపర వెంకటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్‌ రాష్ట్ర నాయకులు గుర్రం విజయకుమార్‌, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌, మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జొన్నా శివశంకర్‌, వై నేతాజి, సిపిఎం తాడేపల్లి డివిజన్‌ కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడి,్డ సిపిఎం తాడేపల్లి నాయకులు కాట్రగడ్డ శివరామకృష్ణయ్య, కాజ గ్రామ మాజీ సర్పంచి, సీనియర్‌ నేత ఈదానాగేందర్‌రెడ్డి, సిపిఎంశాఖ కార్యదర్శి భీమిరెడ్డి కోటేశ్వరి, మంగళగిరి డివిజన్‌ సిపిఎం నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, వై.గంగాధరరావు, ఎస్‌ఎస్‌.చెంగయ్య, వల్లభనేని సాంబశివరావు, ఎన్‌.శివాజి, అప్పికట్ల ప్రకాశరావు, కుటుంబసభ్యులు కోటిరెడ్డి, సింహాద్రి వెంకటరామరెడ్డి, భక్తప్రియ, మార్క్సిస్టు సంపాదకులు అన్నపురెడ్డి కోటిరెడ్డి , టిడిపి నాయకులు పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
శివారెడ్డిపై ప్రత్యేక గేయాలు, కదంబం, లఘునాటికల ప్రదర్శన
సిపిఎం రాష్ట్ర కమిటీ ఆహ్వానితులు సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన గేయాలను ఆలపించారు. శివారెడ్డిపై రూపొందించిన 'ఎర్రజెండో.. ఎర్రజెం డో.. ఎర్రజెండా...నిన్నెత్తుకున్న శివారెడ్డేే..ఓ ఎర్రజెండా..' అంటూ ఆలపించిన గేయాలు అందరిలో ఉద్యమస్ఫూర్తిని నింపాయి. ఆత్మకూరు ప్రజానాట్యమండలి కళాకారులు ఆధ్వర్యంలో సుందరయ్య జీవితచరిత్రపై రూపొందించిన కదంబ ప్రదర్శన, జానపదా కళారూపాలు, శ్రీశ్రీ రచించిన మరో ప్రపంచంపై దృశ్యరూ పకం, గేయాలపై నృత్యరూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనల్లో పిఎన్‌ఎం కళాకారులు పివి.రమణ, రాజేష్‌, కవి, పెద్దిరాజు, లెనీనా, ప్రసన్న, పండల ప్రసాద్‌, ఐ.రాజేష్‌, శ్రీధర్‌, సుధాకర్‌, బుజ్జి పాల్గొన్నారు.