కార్మిక వ్యతిరేకతే చంద్రబాబు అజెండా!

జూన్‌ 19న రాష్ట్రవ్యాప్త కార్మిక ఐక్య ర్యాలీ

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కార్మికులకు ఎటువంటి లబ్ధీ చేకూర్చలేదని, కార్మిక వ్యతిరేకతే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎంఎ గఫూర్‌ తెలిపారు. సోమవారం విశాఖలోని ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వసూళ్ల మంత్రిగా, యాజమాన్యాల తొత్తుగా ఉన్నారే తప్ప, కార్మిక సమస్యలపై ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని పేర్కొన్నారు. కార్మికులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిని అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇవ్వటం లేదని మండిపడ్డారు. యూనియన్లు వద్దంటూనే ముఖ్యమంత్రి ఆ పార్టీ తరపున అంగన్‌వాడీల యూనియన్‌ పెట్టి దాంట్లో చేరండంటూ 'తన బొమ్మతో పోస్టర్‌'ను విడుదల చేయడం చూస్తే యూనియన్లంటే చంద్రబాబు జేబు సంస్థ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అభివృద్ధి జపం చేస్తూ కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కోటి 50లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని తెలిపారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తామన్న ఎన్నికల వాగ్దానం నేటికీ అమలు కాలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలకు రూ.2లక్షలు జీతాలు పెంచుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైందని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.9వేలు ఇస్తే వారి కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. 
జీతాలు పెంచమని అడిగిన ఆశావర్కర్లను అరెస్టు చేయించారని, మధ్యాహ్నం భోజన మహిళలు విజయవాడ కనకదుర్గ గుడికి వెళితే వారేదో సాయుధపోరాటానికి వచ్చినట్లు అరెస్టులు చేశారని తెలిపారు. సిఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లిన 200 మంది అంగన్వాడీలను అరెస్టు చేసి వేధింపులకు గురిచేశారని తెలిపారు. కార్మికులపై రోజూ ఏదో ఒకరకంగా దాడి జరుగుతుందని, ఈ చర్యలను విడనాడకపోతే చంద్రబాబుకు 'రాజకీయ సమాధి' తప్పదని హెచ్చరించారు. కార్మిక సమస్యలపై జూన్‌ 19న విజయవాడలో భారీ కార్మిక ప్రదర్శన, సమ్మె చేపడతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి జగ్గునాయుడు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.