అంధకారంలో చిక్కుకున్న ప్రపంచానికి క్యూబా ఓ కాంతిరేఖ. భయోత్పాతంలో ఉన్న మానవాళికి ఓ ధైర్యం. ఆపదలో ఉన్న దేశాలకు కొండంత అండ! ప్రపంచ పటంలో కష్టపడి వెతికితేకాని కనిపించని ఓ చిన్న దేశం క్లిష్ట సమయంలో నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా, అమెరికా వంటి అగ్రదేశం కాడి పడేసి, కరోనా (కోవిడ్-19) కాటుకు దిక్కుతోచక విలవిలలాడుతున్న వేళ ఆ రక్కసితో ధైర్యంగా పోరాడటమే కాకుండా అనేక దేశాలకు వైద్య బృందాలను పంపడం, ఔషధాలను సరఫరా చేయడం క్యూబాను వర్తమాన ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది.