వొట్టి మాటలకే పరిమితమా?

 ముఖ్యమంత్రులతో గురువారంనాడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ లాక్‌డౌన్‌ సందర్భంగా రాష్ట్రాలు చేపట్టిన చర్యలను ప్రశంసిస్తూనే ఉపసంహరణ చర్యలు ఒకే విధంగా వుండాలని కోరడం, మరోవైపు చాలామంది సి.ఎం లు ఆర్థిక కష్టాలను ఏకరువు పెట్టి అదనపు నిధుల కోసం విజ్ఞప్తి చేయడం నేడున్న క్లిష్ట పరిస్థితులకు, గత పది రోజుల పరిణామాలకూ ప్రతిబింబమే! ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని ఏకపక్షంగా జనతా కర్ఫ్యూను, అనంతరం లాక్‌డౌన్‌ను ప్రకటించినా దాన్ని దేశ ప్రజలంతా మంచి స్ఫూర్తితో ఆచరించారు. అయితే ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలనడమేగాక రాష్ట్ర, జిల్లా సరిహద్దులు మూసివేయడంతో కోట్లాదిమంది వలస జీవులకు తీవ్ర ఇక్కట్లు ఎదురు కాగా, నిత్యావసర సరుకుల సరఫరాకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇటువంటి ప్రతికూల పరిణామాల నేపథ్యం లోనే ఉపసంహరణ చర్యలు ఒకేలా వుండాలని ముఖ్యమంత్రులను ప్రధాని కోరినట్టు భావించవచ్చు. కానీ ఆర్థికంగా ఆదుకునేందుకు తగిన చర్యలు ప్రధాని ప్రకటించకపోవడం దారుణం. ఏడాది మొత్తంలో ఇచ్చే విపత్తు సహాయ నిధుల నుండి రూ.11 వేల కోట్లను ఈ నెలలో (వెంటనే కాదు!) మంజూరు చేస్తామనీ, వైద్య సేవలందించేవారికి వ్యక్తిగత రక్షణ సామగ్రి (ప్రొటెక్టివ్‌ గేర్‌) నిమిత్తం ఇస్తామని గతంలో ప్రకటించిన రూ.15 వేల కోట్లను గురించి మరోసారి చెప్పారుతప్ప ఇంకేమీ లేకపోవడం ఘోరం.
కరోనా బాధితులకు వైద్య సేవలందించడం మొదలు ఆయా రాష్ట్రాల ప్రజలను ఆదుకోవడంతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వలస జీవుల ఆలనా పాలనా చూడడంతోసహా అన్ని బరువు బాధ్యతల్నీ రాష్ట్ర ప్రభుత్వాలు మోయవలసి వస్తోంది. ఇప్పటికే వనరులు క్షీణించి, ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనాతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందమైంది. జిఎస్‌టి పేరిట మోడీ సర్కారు రాష్ట్రాలకు సొంత వనరులేవీ లేకుండా చేయడమేగాక అందులోనూ నెలల తరబడి బకాయిలు పెడుతోంది. సొంత నిధులు చాలకపోతే అప్పు చేసుకోవడానికి కూడా రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు పెద్ద ఆటంకంగా వున్నాయి. 'అమ్మ పెట్టదు- అడుక్కోనివ్వదు' అన్నట్టుంది పరిస్థితి. అయినా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంతోబాటు నిత్యావసర సరకులు అందించడం, పరిశుభ్రతకు సంబంధించిన చర్యలు చేపట్టడం వంటివి రాష్ట్రమంతటా ఒక్కసారిగా చెయ్యడం అంత తేలిక కాదు. కరోనా అదుపునకు దేశంలోనే తొట్టతొలుత చర్యలు చేపట్టిన కేరళ ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకోవడంలోనూ ఆదర్శంగా నిలిచింది. వారిని 'అతిథి కార్మికులు'గా పేర్కొనడంలోనే ఆ ప్రభుత్వ దృష్టి ద్యోతకమవుతోంది. సహాయ చర్యలు మేటిగా చేసే అలాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనపు నిధులివ్వాలి.
కేంద్ర ప్రభుత్వం వనరులను తన గుప్పెట పట్టడమేగాక ఇష్టానుసారం ప్రజలపై సెస్సులు విధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఎన్నడూ లేనంతగా పడిపోయినా దేశంలో మాత్రం రోజురోజుకూ పెట్రోలు డీజిల్‌ ధరలు పెరగడం సర్కార్ల చలవే కదా! ప్రస్తుతమున్నది చాలనట్టు అదనపు సుంకాలు విధించుకునేందుకు ఇటీవల కేంద్రం చట్ట సవరణ కూడా చేయడం వారి దుష్టత్వానికి పరాకాష్ట. మార్కెట్టే అన్నీ నిర్ణయిస్తుందని చెప్పే నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల తగ్గుదలవల్ల కలిగే ప్రయోజనాన్ని వినియోగదారుకు ఇవ్వకపోవడం దాని దుర్నీతికి మరో దృష్టాంతం. ఎస్‌డిఆర్‌ఎఫ్‌ నిధులు, పిఎం కళ్యాణ్‌ యోజన నుండి జన్‌ధన్‌ ఖాతాలకు బదిలీ వంటివన్నీ విదిలింపులు మాత్రమే! కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజి లోని రైతులకు ఇస్తామంటున్న పిఎంకిసాన్‌ సమ్మాన్‌ కిస్తీతో సహా అత్యధిక భాగం బడ్జెట్‌ కేటాయింపుల్లోవే కావడం గమనార్హం. కాగా కరోనా సహాయ ప్యాకేజిగా అనేక దేశాలు ప్రైవేటు రంగం లోని కార్మికులకు చెల్లించే వేతనాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వమే భరించేంత ఉదారంగా ప్రకటించాయి. భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యక్ష నగదు బదిలీ మొత్తం రూ.35 వేల కోట్లు ప్రపంచంలోనే అతి తక్కువ కావడం సిగ్గుచేటు.
ఆరోగ్యం భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితా లోని అంశం. అంతేగాక రాజ్యాంగ ఫెడరల్‌ స్ఫూర్తితో ఆరోగ్య సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో, సంఘీభావంతో ఉమ్మడిగా ఎదుర్కోవాలి. కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో రాష్ట్రాలకు తగిన వాటా ఇవ్వాలి. బిజెపి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 'సహకార ఫెడరలిజం', గురువారం నాటి ప్రధాని ప్రసంగంలో చెప్పిన 'ప్రతి భారతీయుడినీ రక్షించడం మనందరి ఉమ్మడి లక్ష్యం' అన్నవాటిని కేంద్రం ఆచరణలో చూపాలి. లేకపోతే ఇది వొట్టి మాటల ప్రభుత్వంగా మిగిలిపోతుంది.