
కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, మెజారిటీ ప్రయోజనాలకు తలొగ్గిన అయోధ్య తీర్పు, జెఎన్‌యు హాస్టల్ ఫీజు పెంపు, క్యాంపస్‌లో విద్యార్థులపై ఆర్‌ఎస్‌ఎస్ గూండాల పాశవిక దాడి, ఢిల్లీ అల్లర్ల మధ్య తీసుకొచ్చిన సిఎఎ-2019 చట్టం...వంటి అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా జెఎన్‌యు తన అసమ్మతిని వ్యక్తం చేసింది. విద్యార్థులు అనేకానేక నిరసన ప్రదర్శనలు, అధికారిక విజ్ఞప్తులు చేశారు. పార్లమెంటు వరకు పాదయాత్రలు చేశారు. విచక్షణా రహితంగా సాగిన పోలీసు లాఠీచార్జి, నీటి ఫిరంగుల ప్రయోగం, నిర్బంధాల నడుమ...మండుటెండలను, వణికించే చలినీ లెక్కచేయక...మిట్టమధ్యాహ్నాలు, అర్థరాత్రుళ్లన్న బేధం లేకుండా...క్యాంపస్ లోపల వెలుపల విద్యార్థులు చేసిన నినాదాలు ప్రతిధ్వనించాయి. విభిన్న రాజకీయ అభిప్రాయాలకు, మేధో చర్చలకు, పరిశోధనలకు కేంద్రమైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు)...కరోనా కారణంగా ఇప్పుడున్నంత నిశ్శబ్దంగా ఏనాడూ లేదు. బహుశా ఇదే మొదటిసారేమో!జెఎన్‌యు క్యాంపస్‌లో ప్రస్తుతం సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నారు. సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించాలన్నది సందీప్ (అసలు పేర్లు కావు) ఆకాంక్ష. ఎంఏ చదువుతున్న తను యుపిఎస్‌సి పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా హాస్టల్ లోనే ఉండిపోయాడు. అమృత పిహెచ్‌డి ఆఖరి సంవత్సరం విద్యార్థి. ఎటువంటి ఆటంకాలు లేకుండా తన థీసిస్ రాసుకునేందుకు గాను హాస్టల్ లోనే ఉండాలని నిర్ణయించుకుంది. అర్జున్ పిహెచ్‌డి మొదటి సంవత్సరం విద్యార్థి. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాడు. కోవిడ్-19 మహమ్మారి అన్ని ప్రాంతాలనూ కమ్ముకుంటున్న వేళ క్యాంపస్ లోనే ఉండిపోవాలని అనుకున్నాడు. ఎందుకంటే సుదూరంగా వున్న సొంత గ్రామానికి ప్రయాణించేటప్పుడు ఆ వైరస్ సోకితే...తన డయాబెటిక్ తల్లికి, చిన్నారి మేనకోడలికి అంటించగలడు. అందుకే ముందు జాగ్రత్తగా ఆ నిర్ణయం తీసుకున్నాడు. రైళ్లు రద్దు కావడం, ప్రయాణ ఛార్జీలు పెరిగిపోవడం, పేదరికం వల్ల మరికొందరు క్యాంపస్‌లో వుండిపోయారు. వీరికి తగు ఏర్పాట్లు చేసేందుకుగాను, జెఎన్‌యు విద్యార్థి సంఘం (ఎస్.యు), అధ్యాపక అసోసియేషన్ (టి.ఎ) కలిసి పాలక మండలితో చిన్నపాటి పోరాటమే చేయాల్సి వచ్చింది.కోవిడ్-19 మహమ్మారిగా మారనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) మార్చి 11, 2020 తరువాత ప్రకటించింది. దాంతో విద్యా సంబంధ కార్యకలాపాలను నిలిపివేయాల్సిందిగా విశ్వవిద్యాలయాలు, సంస్థలకు ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. జెఎన్‌యు పాలకమండలి తన మతపరమైన ఎజెండాను, ప్రస్తుత బిజెపి ప్రభుత్వం పట్ల విధేయతను ప్రదర్శించే అవకాశాన్ని ఎన్నడూ చేజార్చుకోలేదు. ఆఖరికి కరోనా వేళ కూడా. జెఎన్‌యు రోడ్లలో ఒకదానికి 'వి.డి.సావర్కర్ మార్గ్' అని పేరు పెట్టింది (మార్చి 15). విద్యార్థులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని, లైబ్రరీ-జిమ్-ధాబా లను మూసివేస్తున్నామని పేర్కొంటూ మార్చి 16న నోటీసు జారీ చేసింది. కోవిడ్-19 కారణంగా విద్యార్థులలో ఆవరించిన భయాందోళనలను ఉపయోగించుకుని జెఎన్‌యు పాలకమండలి...సి.సి టీవీని ఏర్పాటు చేయాలని చూసింది. అందుకు, కరోనా కేసులు ఏవైనా ఉంటే సులభంగా గుర్తించవచ్చన్న సాకును చూపించింది. క్యాంపస్ లోని నివాస ప్రాంతాల్లో సి.సి టీవీ లను ఏర్పాటు చేయడాన్ని నిషేధించిన 2017 ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించింది. విద్యార్థుల వ్యక్తిగత ప్రదేశాలలో (చట్టబద్ధమైనా కాకపోయినా!) చొరబడడమంటే...విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ లేవనెత్తిన గొంతుకలను నొక్కివేసే ప్రయత్నంలో భాగంగానే భావించవచ్చు. విశ్వవిద్యాలయం మార్చి 31 వరకు మూసి వుంటుందని, మార్చి 22 నుండి మెస్ కూడా మూత పడుతుందని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని... మార్చి 19న నోటీసు వెలువడింది. విద్యార్థులను క్యాంపస్ విడిచి వెళ్లిపొమ్మని ఒత్తిడి చేసింది. సరిగ్గా అప్పుడు, ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన కేసులు 7 ఉన్నాయి. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ (12622-ఎస్7), ఎ1425 (ఢిల్లీ-కన్నూర్) విమానంలో ప్రయాణించిన వారికి కోవిడ్ పాజిటివ్ అని తేలిందని, దాంతో తోటి ప్రయాణీకులు పరీక్షలు చేయించుకోవాలని మెసేజ్‌లు వచ్చాయి. ఈ భయాందోళనల మధ్య, విశ్వవిద్యాలయ పాలక మండలి ప్రయాణాలను నియంత్రించడానికి బదులుగా, విద్యార్థులు క్యాంపస్ విడిచిపెట్టాలని సూచించింది.
మార్చి 24 నుండి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటన వెలువడడంతో దేశీయ విమానాలను సైతం అదేరోజు అర్థరాత్రి నుంచి నిలిపివేశారు. నాకు బాగా పరిచయం వున్న ఎంఏ విద్యార్థిని సుజిత ఆరోజు ఉదయం కేరళకు టికెట్ బుక్ చేసుకుంది. లాక్‌డౌన్ కావడంతో స్థానికంగా ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. అయితే, సీనియర్ల పరిచయాలను ఉపయోగించి బ్లాక్‌లో మూడు రెట్లు ఎక్కువ బాడుగతో విమానాశ్రయానికి క్యాబ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కేరళలో అప్పటికే లాక్‌డౌన్ ఉన్నందున, 'కొచ్చి' విమానాశ్రయం నుండి ఇంటికి చేరుకోవడం ఎలాగనే సమస్య ఎదురైంది. ఎందుకంటే కెఎస్‌ఆర్‌టిసి బస్సులను కూడా అప్పటికే నిలిపివేశారు. కేరళ యువజన సంఘం (డివైఎఫ్‌ఐ) బాధ్యత తీసుకుని ఆమెను ఇంటికి సురక్షితంగా చేర్చింది. అయితే ఆమె 14 రోజుల పాటు ఐసొలేషన్‌లో వుండాలి. ఇక్కడ అర్థం చేసుకోవలసిన సున్నితమైన విషయం ఒకటుంది. ఇళ్లకు వెళ్లిపోగా మిగిలిపోయిన 2000 మందిలో అప్పటికప్పుడు పెరిగిపోయిన ప్రయాణ ఖర్చులను భరించగల వారు చాలా తక్కువగా వున్నారు. పైగా ఆ సమయంలో బీహార్, యు.పి కి ప్రయాణించే రైళ్లు కూడా రద్దు అయ్యాయి. ఇంట్లో రోజుకు మూడు పూటలా భోజనం ఖచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకం లేనివారు...వృద్ధులు, డయాబెటిస్, గుండె జబ్బులున్న కుటుంబీకులకు ప్రయాణాల ద్వారా వైరస్‌ను చేరవేసే ప్రమాదం వున్నందున యూనివర్సిటీ క్యాంపస్ లోనే వుండాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో, జెఎన్‌యు టి.ఎ (టీచర్స్ అసోసియేషన్), విద్యార్థుల ప్రయాణ ఖర్చులను భరించడానికి సిద్ధపడింది. అయితే ప్రయాణంలో వ్యాధి సంక్రమించే సమస్యను దృష్టిలో వుంచుకొని విద్యార్థులు యూనివర్సిటీ లోనే వుండేందుకు కావాల్సిన ఏర్పాట్ల విషయమై నిర్వాహకులతో చర్చలలో పాల్గొంది. వీరితోపాటుగా హాస్టల్ ప్రెసిడెంట్లతో పలు దఫాలుగా జరిగిన సమావేశాల అనంతరం, హాస్టల్ మామూలుగానే పని చేస్తుందని పేర్కొంది. భారత రైల్వే మార్చి 31 వరకు అన్ని ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేయడంతో, యూనివర్సిటీలలో వుండాలనుకునే విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డి) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లోని యూనివర్సిటీలను (మార్చి 21) కోరింది. ఎంహెచ్‌ఆర్‌డి విడుదల చేసిన కరోనా నివారణ మార్గదర్శకాలలో భాగంగానే ఈ సూచన కూడా వెలువడింది. మార్చి 23 నుండి మూడేసి హాస్టళ్లను కలిపి ఒకే హాస్టల్‌లో ఆహారాన్ని అందించాలని జెఎన్‌యు పాలక మండలి నిర్ణయించింది. కోవిడ్-19 వైరస్ చుట్టూ అల్లుకున్న భయాందోళనల మధ్య...షహీన్ బాగ్ వంటి నిరసన ప్రదేశాలను...ఢిల్లీ అల్లర్ల బాధితుల సంఘీభావ శిబిరాలను ఢిల్లీ పోలీసులు ఖాళీ చేయించారు. ఢిల్లీలో చిక్కుకుపోయిన వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు కాలినడకన వెళుతుండగా పోలీసులు వారిపై లాఠీలను ఝుళిపించారు! అంతేకాదు, లాక్‌డౌన్ కారణంగా వేలాది మంది వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకుగాను మార్చి 28న ఆనంద్ విహార్ బస్ స్టాప్ దగ్గరకు చేరుకున్నారు.
కోవిడ్ మహమ్మారి ఆవహిస్తున్న సమయంలో క్యాంపస్‌ను విడిచి వెళ్లాల్సిందిగా జెఎన్‌యు పాలక మండలి విద్యార్థులకు పంపిన నోటీసులు...చేయడానికి పనులు లేక, తినడానికి తిండి లేక లాక్‌డౌన్ మధ్యలో సొంత ప్రాంతాలకు వెళ్తున్న వలస కార్మికులపై లాఠీ విసిరిన పోలీసుల (ఢిల్లీలో కేంద్రం నియంత్రణలో ఉంటారు) చేతలకు భిన్నంగా ఏమీ లేవు. జెఎన్‌యు పాలక మండలి ఆర్‌ఎస్‌ఎస్ మార్గంలో ఏవిధంగా నడుస్తోందనడానికిది ఒక ఉదాహరణ మాత్రమే. విద్యార్థులు క్యాంపస్ లోపల వుండేందుకు జెఎన్‌యు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలు అనుమతించాయి. అక్కడ ఎన్నికైన విద్యార్థి సంఘ ప్రతినిధులు చేసిన పోరాట ఫలితంగానే ఇది సాధ్యమైంది. అన్నం, పప్పు, కూరతో రోజుకు రెండు సార్లు భోజనం అందుతోంది. క్యాంపస్‌లో మెడికల్, కిరాణా దుకాణాలు, ఎటిఎంలు, డెయిరీలు తెరిచి ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలో కూడా 'భౌతిక దూరం' పాటిస్తూ క్యాంపస్‌లో సంచరిస్తున్నాం. ఐసొలేషన్‌లో సైతం 'జూమ్', 'డిస్కార్డ్', 'స్కైప్' ద్వారా జయతీ ఘోష్, వెంకటేష్ ఆత్రేయ, విజరు ప్రసాద్ వంటి నిపుణులతో కలిసి రాజకీయ పరిణామాలపై చర్చల్లో పాల్గొంటూ స్ఫూర్తి పొందుతున్నాం.
<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="">- కొమ్మాలపాటి చరిత
వ్యాసకర్త జెఎన్‌యు పిహెచ్‌డి విద్యార్థి )