నిర్లిప్తత వీడండి !

కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం అస్త్ర విన్యాసమెరుగక బరిలోకి దూకిన సైనికుడిని తలపిస్తోంది. లాక్‌డౌన్‌ కష్టాలతో ఆర్థికంగా చితికిపోయిన కష్టజీవులను ఆదుకోవడం మొదలుకొని కరోనా పోరులో కీలకమైన వైద్య సిబ్బందికి అండగా నిలవడం వరకూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కోవిడ్‌పై పోరు సల్పుతూ ప్రజల దృష్టిలో దేవుళ్లుగా మారిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, పోలీసుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సబబుగా లేదు. వైద్యులకు, పారా మెడికల్‌ సిబ్బందికి కనీస రక్షణ కిట్లను కూడా సరిపడ అందించకపోవడం ఆందోళనకరం. సోదర రాష్ట్రమైన తెలంగాణలో వీరి సేవలను ప్రశంసిస్తూ పూర్తి వేతనాన్ని ఇవ్వడంతో పాటు, అదనపు పారితోషికం ఇచ్చి గౌరవించాలని కెసిఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మన ప్రభుత్వం మాత్రం సాధారణ ఉద్యోగులకు వేతన కోత విధించినట్లే 'వైద్య' సేవకులకూ కోత విధించి అమానవీయతను చాటింది.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముందుకొచ్చిన అతి పెద్ద సమస్య వలస కార్మికులు. పొట్ట చేత పట్టుకొని పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన లక్షలాది మంది కార్మికులు చేసే చోట పని లేక, పొట్ట నిండే దారి లేక వెళ్లేందుకు వాహనాలు రాక బతుకు జీవుడా అంటూ కాలి నడకనే సొంతూళ్లకు పయనమయ్యారు. కర్ఫ్యూ ఆంక్షల కారణంగా రాష్ట్రాల, జిల్లాల సరిహద్దుల్లో ఎక్కడివారు అక్కడే ఆకలితో అలమటిస్తున్న దుస్థితి చూస్తున్నాం. ఈ దశలో ప్రభుత్వాలు చేయాల్సిందేమిటి? కనీసం వారికి ఆశ్రయం కల్పించి ఆహారం అందించి ఊపిరి పోయాలి. వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా మహమ్మారి విస్తరించకుండా జాగ్రత్త వహించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలేవీ కనిపించడం లేదు. కేరళ ప్రభుత్వం వలస కార్మికులను 'అతిథి' కార్మికులుగా గౌరవిస్తూ ప్రత్యేక శిబిరాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించి ఆకలి తీర్చడమే గాక వైద్య సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రేషన్‌ కార్డుతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ బియ్యం, సరకులు ఉచితంగా అందజేస్తోంది. మన రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికి మాత్రమే బియ్యం, పప్పు ఇస్తోందే కానీ కార్డు లేని వారి పొట్ట నిండే మార్గమేంటో చెప్పడం లేదు. అర్ధాకలితో రోగ నిరోధక శక్తి నీరుగారిపోతే కరోనా నుంచి కాపాడేదెవరు? 

కేరళలో జనవరి నెలాఖరు నుంచే జాగ్రత్త పడ్డారు. పైగా వాళ్లకి మనకంటే మెరుగైన ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ఉంది. మన ప్రభుత్వం టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసిందే మార్చి 24న. ఇక యంత్రాంగం కదిలేందుకు, అవసరమైన ఏర్పాట్లుకు వ్యవధి ఏముంది? కరోనా తర్వాత కూడా రాజధాని మార్పు, ఇళ్ల పట్టాల పంపిణీ గురించి పాలకులు మాట్లాడుతుండటం ఏ ప్రాధాన్యతకు సంకేతం? కరోనాను ఎదుర్కోవడమే ఇప్పుడు ప్రభుత్వ ఏకైక ప్రధాన ఎజెండాగా ఉండాలి. ప్రజా సంక్షేమం కోరుకునే పాలకులు ముందు ప్రజలు ప్రాణాలతో ఉండాలన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. తక్కువ అంచనా వేయకుండా ఇప్పటికైనా సమగ్ర కార్యచరణతో ప్రజలను ఆదుకోవాలి. కేంద్రం మాదిరిగా ప్రకటనలకు పరిమితం కారాదు. యావత్తు రాష్ట్రం ఒక వ్యక్తిలాగా కదిలే విశ్వాసాన్ని కలిగించాలి.<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(0, 0, 0); font-family: Prajasakti, sans-serif; font-size: 22px; text-align: justify;">