
హాలీవుడ్ సినిమాల్లో గొరిల్లాల మాదిరి కరోనా తమ ముంగిటికి వచ్చినప్పటికీ గుర్తించలేని మతి తప్పిన స్థితిలో కొందరు ఉన్నారు. వారిలో ట్రంప్ ఒకరు. మన దేశంలో కొందరు మడి కట్టుకున్న మాదిరే ప్రపంచంలో తమను ఏ వైరస్‌లు అంటుకోవు అనే దురహంకారులు ప్రపంచమంతటా ఉన్నారు. చైనాలో దాన్ని అరికట్టినా అక్కడ వెలువడుతున్న కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారిలో తప్ప స్థానికుల్లో కొత్త కేసులు లేవు. అనేక మంది ఈ వార్తలను నమ్మటం లేదు. 'స్వయం కృతం అని, తన గోతిలో తానే పడిందని, తయారు చేసి ప్రపంచం మీదకు వదలింద'ని ఇలా చైనా గురించి తప్పుడు ప్రచారాలన్నీ చేసిన వారు, బుర్రకు పని పెట్టకుండా వాటిని గుడ్డిగా నమ్మినవారు చైనాలో వైరస్‌ను అరికట్టటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది కరోనా కంటే ప్రమాదకరమైన జబ్బు. దానికైనా వ్యాక్సిన్ కనుగొనగలరేమో గానీ, దీనికి అసాధ్యం. కరోనా పీడితుల్లో ఇప్పుడు అమెరికా అగ్రస్థానానికి చేరింది. పెరుగుదల రేటు వారంలో రెట్టింపైంది. దీనికి ట్రంప్ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, దురహంకారం తప్ప మరొకటి కారణం కాదు. గూఢచార సంస్థలు, అధికారులు నెత్తీనోరూ బాదుకొని చెప్పినా వినిపించుకోలేదు. చైనా వైరస్‌ను తయారు చేసి వదిలిందని, దాని గురించి ప్రపంచానికి వెల్లడించకుండా దాచిపెట్టి తన గోతిలో తానే పడిందని అనేక మంది నోరు పారేసుకున్నారు. తామొక రాక్షసితో పోరాడుతున్నామని చైనా అధ్యక్షుడు సి.జిన్‌పింగ్ జనవరిలోనే ప్రకటించారు. వెంటనే వ్యాధి ఉన్న ప్రాంతంలో జనబందీ (లాక్‌డౌన్) పాటించింది.
తీరా ఇప్పుడు కేసుల్లో చైనాను మించిపోయిన అమెరికాలో దేశమంతటా జనబందీని ఎందుకు అమలు జరపటం లేదు. కొంత మంది చెప్పినట్లు చైనా తన జనాన్ని గోతిలోంచి సురక్షితంగా బయటకు తెచ్చింది. మిగతా దేశాల పాలకులందరూ ఇప్పుడు తమ జనం మొత్తాన్ని గోతుల్లో పడవేశారు. ప్రాణాలు తీస్తున్నారు. ఈ దుర్మార్గానికి ఎందుకు పాల్పడ్డారని వారిని అడగాల్సిందిపోయి ఇంకా కొందరు చైనా మీద ప్రశ్నలను సంధిస్తున్నారు. వారిలో రెండు రకాలు, ఒకటి కావాలని చేయటం, రెండవది అమాయకంగా వారి ప్రచారాన్ని గుడ్డిగా నమ్మి వాట్సప్‌లో అందరికీ పంచేవారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు, ఆలోచన కోసం మరికొన్ని ప్రశ్నలను ఇక్కడ చూద్దాం.అమెరికన్ల దగ్గర అంతులేని సంఖ్యలో అణు, ఇతర ఆయుధాలున్నాయి. యుద్ధ విమానాలకు, ఓడలకు కొదవలేదు. అలాంటి దేశంలో తుడుచుకొనే కాగితపు ఉండలకు కొరత ఎందుకు ఏర్పడింది? శత్రు దేశాల మీద క్షణాల్లో బాంబులు వేసి విధ్వంసం సృష్టించే ఎఫ్-35 బాంబర్లను క్షణాల్లో తయారు చేసి ప్రపంచంలో ఏమూలకైనా సరఫరా చేయగల అమెరికా తన పౌరుల ప్రాణాలను రక్షించే వెంటిలేటర్లను వెంటనే ఎందుకు తయారు చేసుకోలేక పోతోంది? వైద్య సిబ్బందికి అవసరమైన కనీస మాస్కులు, గ్లౌజులు, గౌన్లు ఎందుకు సరఫరా చేయలేకపోతోంది? రోగులను పరీక్షించే కిట్లకు ఎందుకు కటకటలాడుతోంది? ఇతర దేశాలను అమెరికా ఎందుకు ఆదుకోలేకపోతోంది? వుహాన్ నగరం నుంచి జర్మనీ లోని డూయిస్‌బర్గ్‌కు వైద్య సరఫరాలతో కూడిన రైలు ఈనెల 28న బయలుదేరింది. జనబందీ ఎత్తివేసిన తరువాత ప్రారంభమైన తొలి సరఫరా ఇది. చైనా నుంచి మరికొన్ని ఆసియా దేశాలకు ఇప్పటికే విమానాల్లో సరఫరా చేశారు? అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఏమి చేస్తున్నట్లు? ఇవా ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నలు? లేక చైనా గురించా? ఇప్పటికీ చైనా గురించి అడుగుతున్నారంటే వారి కడుపులో దుష్ట బుద్ధి ఇంకా ఉన్నట్లే!
వుహాన్, పరిసరాల్లో తప్ప చైనా లోని మిగతా ప్రాంతాల్లో ఎందుకు వ్యాప్తి చెందలేదు అని చైనాను ప్రశ్నిస్తున్నవారు దానికి సమాధానం తెలుసుకోవటంతో పాటు అమెరికా, ఐరోపా, మన దేశంతో సహా అనేక చోట్ల తొలి కేసులు బయట పడగానే వ్యాపించకుండా ఎందుకు కట్టడి చేయలేదు అని అడగాలా లేదా? ఇక కరోనా గురించి చైనా చెప్పేదానిని నమ్మరు. అలాంటి వారు మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా కట్టడి చేశారంటే నమ్ముతారనే హామీ ఏముంది? సంతృప్తి చెందుతారా? వారు నమ్మాలంటే ఏ అమెరికా వాడో మరొకరో చెప్పాలి. చైనా చెప్పిందాన్ని నమ్మకుండా తమ జనం ప్రాణాల మీదకు తెచ్చిన వారు చైనా గురించి ఏమి చెబుతారు? వారేమి చెప్పినా చెప్పకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 2002-03లో కరోనా జాతికి చెందిన సార్స్ బాధిత దేశం చైనా. ఆ అనుభవం ఉంది కనుకనే వుహాన్‌లో బయటపడిన వెంటనే అక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలకు రాకపోకలను బంద్ చేసింది, తదుపరి చర్యగా హుబెయి, పరిసర రాష్ట్రాలలో దాదాపు పది కోట్ల మంది జనాన్ని జనవరి 23 నుంచి దాదాపు రెండు నెలలపాటు ఇళ్లకే పరిమితం చేసింది (లాక్‌డౌన్). చైనా ఇతర ప్రాంతాలలో కూడా కేసులు ఉన్నాయి తప్ప చెదురుమదురు, వాటిని కూడా సకాలంలో ఎదుర్కొన్నారు. చైనా వారు ప్రపంచానికి అంటించారన్నది ఒక తప్పుడు ప్రచారం. వుహాన్ నుంచి షాంఘై 839 కిలోమీటర్లు, వుహాన్ నుంచి బీజింగ్ 1152 కిలోమీటర్లే ఉన్నా వాటికి సోకని కరోనా పదిహేను వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాకు ఎలా పాకిందని తెలివితేటలు ఎక్కువగా ఉన్న కొందరు ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఇది రాస్తున్న సమయానికి ఉన్న 1,23,750 కేసులలో ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 53,455 ఉన్నాయి, దాని పక్కనే పెద్ద సరిహద్దు ఉన్న పెన్సిల్వేనియాలో 2,751 మాత్రమే ఉండగా పక్కనే మరో చిన్న సరిహద్దు ఉన్న న్యూజెర్సీలో 11,124 కేసులు ఎందుకు నమోదయ్యాయో చైనా గురించి అడిగేవారు చెప్పగలరా?
చైనాలో తొలిసారి వైరస్ గురించి చెప్పిన ఒక వైద్యుడు, దాన్ని బయట పెట్టిన ఒక జర్నలిస్టు నోరును అక్కడి ప్రభుత్వం మూయించిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఒక కొత్త జబ్బు నిర్ధారణ కాకుండా ఒక వైద్యుడు లేదా జర్నలిస్టు ఇలాంటి విషయాలను బహిర్గతం చేయటాన్ని ఏ ప్రభుత్వమైనా అంగీకరిస్తుందా? నిర్ధారణ అయిన తరువాత చైనా తగు జాగ్రత్తలు తీసుకుంది. వైరస్ తీవ్రత గురించి అమెరికా అధినేత ట్రంప్‌కు వివరించి హెచ్చరించామని, అయినా పట్టించుకోలేదని గూఢచారి వర్గాలు చెప్పిన అంశాన్ని పత్రికలు బయటపెట్టాయి. మరి దీనికి జవాబు ఏంటి? ఇక సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిని లోబరుచుకున్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అబద్దాలాడిందని ఆధారాలు లేని ప్రశ్నలకు సమాధానాలు చెప్పమంటున్నారు. అన్నీ అధికారికంగా ఆయా వెబ్‌సైట్లలో ఉన్నాయి. నమ్మకం లేని వారు తీరికగా మంచి కళ్లద్దాలు పెట్టుకొని చూడవచ్చు.
వైరస్ సోకిన సమయం లోనే చైనా నూతన సంవత్సరాది ఉత్సవాలు వచ్చాయి. ఆ సమయంలో ప్రతి ఏడాది కోట్ల మంది చైనీయులు సెలవుల మీద స్వదేశంలో వివిధ ప్రాంతాలకు, విదేశాలకు ప్రయాణిస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం ఆ ఉత్సవాలను రద్దు చేసింది. వుహాన్ నుంచి స్వదేశీ, విదేశీ విమానాలను రద్దు చేయటం బహిరంగ రహస్యం. వుహాన్ నుంచి 50 లక్షల మందిని ప్రపంచం లోని వివిధ ప్రాంతాలకు ఎందుకు పంపారన్నది మరొక ప్రశ్న. వుహాన్ జనాభా కోటి చిల్లర. అందులో సగం మందిని ఆకస్మికంగా విదేశాలకు పంపుతూ ఉంటే ఆ దేశాలు ఎందుకు వీసాలు ఇచ్చినట్లు? వైరస్ సోకిన తరువాత వుహాన్ నుంచి ఏ దేశం ఎంత మందికి వీసాలు ఇచ్చిందో, ఎన్ని విమానాల్లో వారు ప్రయాణించారో ఈ ప్రశ్న వేసిన వారే వివరాలు చెప్పాలి. ఇక సంక్షోభ సమయంలో భారత్ ప్రపంచ నేతగా ముందుకు వచ్చింది అని ఒక ముక్తాయింపు. ఇది కాషాయ దళాల ప్రచారం తప్ప వాస్తవం కాదు. వైరస్ నుంచి తాను తేరుకొని ఇతర దేశాలకు అవసరమైన సాయం చేస్తున్నది చైనా తప్ప మరొక దేశం కాదు.
చైనా తన శత్రు దేశాలకు మాత్రమే వైరస్‌ను ఎగుమతి చేసింది. మిత్ర దేశాలను మినహాయించింది అన్నది మరొక ప్రచారం. జపాన్ అమెరికా మిత్ర దేశం, చైనాకు శత్రు దేశం, దాన్ని ఆక్రమించుకొని నానా బాధలు పెట్టటమే కాదు, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు చైనా నగరాలపై ప్లేగు బాంబులను ప్రయోగించి లక్షల మంది జనాన్ని బలిగొన్న చరిత్ర జపాన్‌ది. వుహాన్ జపాన్ మధ్య దూరం కేవలం 2,300 కిలోమీటర్లే. మరి జపాన్‌లో వైరస్‌ను ఎందుకు వ్యాప్తి చేయలేదో ఎవరైనా చెబుతారా? చైనా మిత్ర దేశం ఇరాన్, రెండు దేశాల మధ్య దూరం 5,600 కిలోమీటర్లు. ఇరాన్ ఇప్పుడు కరోనా బాధిత దేశాల్లో ఒకటి, మరి మిత్ర దేశం అయినపుడు ఇరాన్‌కు ఎందుకు పంపినట్లు? తప్పుడు సమాచారాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించే అమెరికన్ అలెక్స్ జోన్స్ తయారు చేయించిన 'ఇన్ఫోవార్స్' అనే ఒక యాప్‌ను తాజాగా గూగుల్ నిషేధించింది. ఇంతకాలం దాని సమాచారాన్ని తలకెక్కించుకొని ఇతరుల మెదళ్లు తిన్నవారి గురించి జాలిపడటం తప్ప మరేమీ చేయలేం. గూగుల్ కూడా తప్పుడు సమాచారాన్ని సొమ్ము చేసుకోవటంలో ఏమాత్రం తీసిపోలేదు. 2018 లోనే యాపిల్ కంపెనీ శాశ్వతంగా నిషేధించినప్పటికీ ఇంతవరకు గూగుల్ కొనసాగించిందంటే డబ్బు తప్ప దానికి మరొక కారణం లేదు. అలెక్స్‌జోన్స్ ప్రతిదానిని కుట్ర కోణంలో వండివారుస్తాడు కనుక 'కుట్ర సిద్ధాంతవేత్త' అని పేరు వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించాలని, ఒక దగ్గర ఉండిపోవాలని, స్వీయ దిగ్బంధనం పాటించాలనటం వెనుక కుట్ర ఉందని అతగాడు తన యాప్ ద్వారా ప్రచారంలో పెట్టాడు. బహుశా ట్రంప్ వంటి వారందరూ నిర్లక్ష్యం చేయటానికి ఇలాంటి వాటిని ప్రమాణంగా తీసుకోవటం కావచ్చు. కరోనా మీద తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకోవాలన్న గూగుల్ నిర్ణయానికి ఈ యాప్‌ను కొనసాగించటం పొసగదు కనుక ఆ పని చేసింది. ఈ యాప్ ద్వారా వైరస్ నివారణ ఔషధాలంటూ ఆ ప్రబుద్ధుడు ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అలాంటి ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని గతవారంలో న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటియా జేమ్స్ ఉత్తర్వు జారీ చేశారు. అవి ప్రజారోగ్యానికి భంగకరమని పేర్కొన్నారు. కనుక ఇలాంటి ప్రబుద్ధుడి నోరు ఒకదాన్ని మూయించినా లక్షల కొలదీ వాగుతూనే ఉన్నాయి. అందుకే వినేవాడుంటే చెప్పేవాడు చెత్తంతా నింపుతాడు! కాస్త వివేచనతో ఆలోచించినపుడు వాస్తవాలేమిటో తెలుస్తాయి!!
<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="">- ఎం.కోటేశ్వరరావు