గుడిసెలులేని ఆంధ్రప్రదేశ్, పేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళు, 2022 నాటికి అందరికీ ఇళ్ళు అంటూ పాలకులు ఊదరగొడుతున్నారు. ప్రభుత్వాలు మారాయి. గృహనిర్మాణ పథకాల పేర్లు మారాయి. ఇందిరమ్మ, రాజీవ్ పథకాల స్థానంలో ఎన్‌టిఆర్ పథకాలొచ్చాయి. కానీ ప్రభుత్వాల తీరు మాత్రం మారలేదు. 22 నెలలు గడచినా తెలుగుదేశం, బిజెపి పాలనలో పేదలకు గూడు కల్పించడంలో వెనుకడుగే తప్ప ముందడుగు లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పేదలకు మూడు సెంట్ల ఇళ్ళ స్థలం, పక్కా ఇల్లు, మధ్యతరగతివారికి ప్రత్యేక గృహ పథకం పేరుతో వాగ్దానాల వర్షం కురిపించింది. ఈ కాలంలో ''గాలిమేడలే'' తప్ప ఇళ్ళ నిర్మాణం సాగలేదు.