నీరుగారుతున్న గృహ నిర్మాణం..

గుడిసెలులేని ఆంధ్రప్రదేశ్‌, పేదలకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ళు, 2022 నాటికి అందరికీ ఇళ్ళు అంటూ పాలకులు ఊదరగొడుతున్నారు. ప్రభుత్వాలు మారాయి. గృహనిర్మాణ పథకాల పేర్లు మారాయి. ఇందిరమ్మ, రాజీవ్‌ పథకాల స్థానంలో ఎన్‌టిఆర్‌ పథకాలొచ్చాయి. కానీ ప్రభుత్వాల తీరు మాత్రం మారలేదు. 22 నెలలు గడచినా తెలుగుదేశం, బిజెపి పాలనలో పేదలకు గూడు కల్పించడంలో వెనుకడుగే తప్ప ముందడుగు లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పేదలకు మూడు సెంట్ల ఇళ్ళ స్థలం, పక్కా ఇల్లు, మధ్యతరగతివారికి ప్రత్యేక గృహ పథకం పేరుతో వాగ్దానాల వర్షం కురిపించింది. ఈ కాలంలో ''గాలిమేడలే'' తప్ప ఇళ్ళ నిర్మాణం సాగలేదు. పెరిగిన ఇళ్ళ అద్దెలతో పేదలేకాదు మధ్యతరగతి వర్గాలు బెంబేలెత్తుతు న్నాయి. సొంత ఇల్లు కలగానే మిగిలిపోయింది. కుటుంబ ఆదాయంలో ఎక్కువభాగం అద్దెలకే సరిపోతోంది. ఏటా నాలుగు లక్షల ఇళ్ళంటూ పాలకులు మాటలతో కడుపు నింపుతున్నారు. చేతలు మాత్రం శూన్యం. రాజ్యాంగం 21వ ఆర్టికల్‌లో ''నివాస హక్కు'' ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది. ''నివాసహక్కు జీవించే హక్కు నుంచి విడదీయలేని భాగం'' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులలో ''జంతువుల నివాసం అనేది కేవలం శరీరానికి రక్షణ ఇచ్చేది మాత్రమే. కానీ మనిషికి మాత్రం భౌతికంగా, మానసికంగా, మేధోపరంగా ఇలా ప్రతి విషయంలో ఎదగడానికి ఉపయోగ పడటానికి తగిన ఆవాసమే నివాసమవుతుంది'' అని పేర్కొన్నారు. అంతేకాక ప్రజాస్వామ్యంలో ప్రతి కుటుంబానికీ శాశ్వత నివాసం ఉండాలనీ, ఇది కల్పించడం ప్రభుత్వ బాధ్యతని కోర్టులు స్పష్టం చేశాయి. ప్రభుత్వాలు మాత్రం రాజ్యాంగాన్ని, చట్టాలను, హామీలను లెక్కచేయడం లేదు.
మాటలు-చేతలు
అధికారిక లెక్కలు చూస్తే ''ఇళ్ళభాగోతం'' అర్థమవు తుంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఎన్‌టిఆర్‌ గృహ నిర్మాణ పథకంలో నిర్మిస్తామన్న రెండు లక్షల ఇళ్ళకు గాను 16,867 ఇళ్ళకు మాత్రమే పరిపాలన అనుమతులు ఇచ్చారు. పట్టణ ప్రాంతాలలో 1,93,147 ఇళ్ళను నిర్మించ డానికి పథకం రూపొందిస్తే ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా అనుమతి లభించలేదు. 1,50,000 ఇళ్ళు మరమతులు చేస్తామని చెప్పి 2,456 ఇళ్ళకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అనుమతులే లేకపోతే ఇళ్ళ నిర్మాణం పూర్తయ్యేదెక్కడీ ఎనిమిది జిల్లాల్లో లబ్ధిదారుల జాబితాలే ప్రభుత్వానికి చేరలేదు. తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి సభల్లో ఇళ్ళస్థలాల కోసం 7.26 లక్షల మంది, పక్కా ఇళ్ళ కోసం 14 లక్షల ఆరు వేల మంది దరఖాస్తులు చేసుకోగా కేవలం 46 వేల మందికి మాత్రమే ఇళ్ళు ఇస్తామని మాట ఇచ్చారు.
కొత్త ఇళ్ళ సంగతి సరే, 2007లో ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకే దిక్కులేదు. ఇళ్ళు మంజూరు చేస్తూ ఇచ్చిన పత్రాలకు స్థలం చూపలేదు. స్థలం ఇచ్చిన చోట నిర్మాణాలు ప్రారంభం కాలేదు. నిర్మాణం ప్రారంభించిన కొద్ది ప్రాంతాలలోనూ అర్ధంతరంగా ఆగిపోయాయి. బిల్లులు చెల్లించడం లేదు. గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో మూడు దశలలో నవ్యాంధ్ర 13 జిల్లాలలో 28.59 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్ళు 8.44 లక్షలు మాత్రమే. 16.64 లక్షల ఇళ్ళు స్లాబు దశలోనూ, 1.61 లక్షల ఇళ్ళు పునాదుల దశలోనూ నిలిచిపోయాయి. దాదాపు 23.5 లక్షల ఇళ్ళకు బిల్లులు చెల్లించలేదు. కుంటిసాకులతో బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్‌ ఇళ్ళు పూర్తికావడం లేదు. అక్కడక్కడ ఇళ్ళు పూర్తయినా మంచినీరు, ఇతర సదుపాయాలు లేక నివాస యోగ్యంగా లేవు. రాజీవ్‌ గృహకల్ప, స్వగృహ పథకాలలో ఇళ్ళకొరకు ఎదురు చూసిన మధ్యతరగతి వారికి నిరాశే మిగిలింది. వంద చదరపు గజాల లోపు ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో నివాసముంటున్న పేదలకు పట్టాలు ఇస్తామని జారీ చేసిన జీవో 296 వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదు. ఆ జీవోలో పట్టాలు ఇస్తామంటూనే పెట్టిన షరతుల వల్ల జీవో నిరుపయోగంగా మిగిలిపోయింది. లేఅవుట్‌ ఖాళీ స్థలాలు, చెరువులు, ఇరిగేషన్‌ స్థలాలు, ప్రభుత్వం విలువైన స్థలాలుగా భావించినవి తప్ప మిగిలిన వారికి పట్టాలు ఇస్తామని జీవోలో పేర్కొనడం పచ్చి మోసం. రాష్ట్రంలో 296 జీవో ప్రకారం 73,783 దరఖాస్తులు రాగా కేవలం 2,597 అర్జీలనే ఆమోదించారు. పేదలకు మొండిచెయ్యి చూపిన ప్రభుత్వం పెద్దలు ఆక్రమించిన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరిం చేందుకు తాజాగా జీవో జారీచేసే పనిలో ఉంది.
పాలకుల పాపమే
ఇళ్ళ అద్దెలు పెరిగిపోతున్నాయంటూ ముఖ్యమంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారు. పేదలకు ఇళ్ళు కట్టాలంటే స్థలాలు దొరకడం లేదని నమ్మబలుకుతున్నారు. స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదు. కార్పొరేట్‌ కంపెనీలకు ఉదారంగా స్థలాలు కట్టబెడుతున్న ప్రభుత్వం పేదలకు ఇవ్వడానికి స్థలాలు లేవనడం మోసపూరితం. విశాఖపట్నంలోని మధురవాడలో 54 ఎకరాల విలువైన స్థలాన్ని ప్రభుత్వం కారుచౌకగా చినబాబు(లోకేష్‌) మిత్రుడైన పారిశ్రామికవేత్తకు కారుచౌకగా కట్టబెట్టింది. దేవాదాయ, వక్ఫ్‌, మునిసిపల్‌ ఇతర ప్రభుత్వ భూములను పెద్దల కబ్జాల చెర నుంచి విడిపించకుండా కాపాడుతున్న ప్రభుత్వం, తలదాచుకోవడానికి ఇల్లు వేసుకున్న పేదలను ఆక్రమణదారులుగా ముద్ర వేస్తోంది. పెద్దల వద్ద సీలింగ్‌కు మించిన ఉన్న భూములను స్వాధీనం చేసుకుని ప్రజాప్రయోజనాలకు వినియోగించడానికి పెట్టిన పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం రద్దు చేసే వరకు పాలకులు నిద్రపోలేదు. నేడు వారే ప్రభుత్వ స్థలాలు లేవంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్రంలో చౌక ఇళ్ళ నిర్మాణం కొరకు బడాపారిశ్రామికవేత్తలతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేసి తన ప్రభుభక్తి చాటుకున్నారు. మురికివాడలలో పేదల ఇళ్ళను కూల్చి, ఆ స్థలాలను ప్రయి వేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసి, కొద్ది స్థలంలో అపార్ట్‌ మెంట్‌లు కట్టి పేదలకు ఇస్తామనడం సిగ్గుచేటు. ప్రభుత్వ భూములను విదేశీ, స్వదేశీ కంపెనీలకు 99 ఏళ్ళపాటు లీజుకిచ్చే విధంగా చట్ట సవరణ చేసి చంద్రబాబు తన ''ఘనత'' చాటుకున్నారు. దశాబ్దాలుగా జీవిస్తున్న పేదలకు వంద గజాలకు పట్టాలు ఇవ్వడానికి వంద మెలికలు పెడుతున్నారు. పాలకులు చెప్పిన విధంగా ఈ సంవత్సరంలో నాలుగు లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం రూ.8 వేల కోట్లు కావాలి. పెండింగ్‌ ఇందిరమ్మ ఇళ్ళు పూర్తిచేయ డానికి మరో రూ.10 వేల కోట్లు అవసరం. కానీ బడ్జెట్‌లో 2016-17 సంవత్సరానికి గృహ నిర్మాణ రంగానికి రూ.1,100 కోట్లు మాత్రమే కేటాయించారు. మరోవైపు ఇళ్ళిస్తామన్న ప్రభుత్వం పేదల కొంపలు కూలుస్తోంది. అనివార్యమైతే పేదలకు ప్రత్యామ్నా యం చూపించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. కానీ కనీస నోటీసు కూడా లేకుండా అన్యాయంగా, అర్ధంతరంగా ఇళ్ళు తొలగిస్తున్నారు.
పోరాటమే శరణ్యం
ఆశతో ఎదురు చూసిన పేదలకు నిరాశే మిగులు తోంది. ప్రజలు ఆశ, నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో అధికార పార్టీ నేతలు సాధారణ ప్రజలను, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను అణచివేస్తున్నారు. పేదల ఇళ్ళ కోసం పోరాడే వామపక్ష పార్టీలపై దుష్ప్రచారం చేస్తున్నారు. పోరాటాల ద్వారా ఇళ్ళు వస్తాయా అంటూ ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో నిర్వహించిన భూ పోరాటాల ఫలితంగానే ఎన్నికల్లో వివిధ పార్టీలు ఇళ్ళు, పట్టాల ప్రస్తావన ప్రణాళికలలోనూ, హామీలలోనూ చేర్చక తప్పలేదు. గృహనిర్మాణ పథకాలు ప్రకటించక తప్పలేదు. పేదలు నిర్మించుకున్న కాలనీలు, గుడిసెలు పోరాటాల ఫలితంగా కడప, విజయనగరం, గుంటూరు, తదితర జిల్లాల్లో నిలబడ్డాయి. మరికొన్ని ప్రాంతాలలో తొలగించిన ఇళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇళ్ళు లభించాయి. అందుకే హామీల అమలుకై మరో పోరాటం అనివార్యం. ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు, పట్టాలకై ఈ నెల 22న జరిగే చలో విజయవాడ కార్యక్రమంలో భాగస్వాములు కండి. పాలకులను నిలదీయండి.
- సిహెచ్‌ బాబూరావు
(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)