వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పిట్టగోడ కూలి ఐదుగురు కార్మికులకు సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. సిపిఎం క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్ సిహెచ్ బాబూరావు, రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి తదితరులు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రామ్‌చంద్, ధర్మేంద్ర, కిరణ్‌ఛౌదరి, జయరామ్‌లతోపాటు మరో వ్యక్తికీ గాయాలయ్యాయి. వీరిలో రామ్‌చంద్‌కు వెన్నుముక విరిగిపోగా ధర్మేంద్రకు తలకు, ఛాతికి, కాలికి తీవ్రగాయాలయ్యాయి.