2015

అన్ని విధాలా ఆదుకోవాలి..

గోరుచుట్టుపై రోకటి పోటులా నిన్నటివరకు అనావృష్టితో బాధపడిన రాష్ట్ర్ర ప్రజలకు నేడు అతివృష్టి దెబ్బతీసింది. అల్పపీడనం ప్రభావం వల్ల గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ఈ వర్షాలు ఆపార నష్టాన్ని కలిగించాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఊరు యేరూ ఏకమయ్యాయి. స్వర్ణముఖి, కాళంగి, కైవల్య, పంబలేరు కట్టలు తెంచుకు ప్రవహించడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వందలాది గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.

తమిళనాడుకి ఒడిశా 5 కోట్ల సాయం

భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడు రాష్ట్రానికి ఒడిశా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు రాష్ట్ర మంత్రి విక్రం అరుఖ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిన్న తమిళనాడు సీఎం జయలలితతో మాట్లాడినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత ప్రజలను ఆదుకునేందుకు, సహాయ చర్యల నిమిత్తం తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

ఖమ్మంMLCఅభ్యర్ధిగా పువ్వాడ

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాల అభ్యర్ధిగా సీపీఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వరరావును ఆ పార్టీ ప్రకటించింది. పువ్వాడ రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పువ్వాడ అభ్యర్ధిత్వానికి ఇతర ప్రతిపక్షాలు కూడా మద్దతు ప్రకటించే అవకాశముందని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు.

దళితులకి కేవలం 0.2% నిధులే..

దేశవ్యాప్తంగా సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్లుతున్నాయని, దళితుల సంక్షేమానికి ఖర్చు చేసేది కేవలం 0.2 శాతం నిధులేనని ఎస్‌సి జాతీయ కమిషన్‌ సభ్యురాలు పిఎం.కమలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ సబ్‌ప్లాన్‌ నిధులు ఎంత కేటాయించారు?, ఎంత ఖర్చు చేశారు?, ఎంత మిగిలిందనే లెక్కలు ఉండటం లేదన్నారు. ఈ విషయంపై రాష్ట్రపతికి నివేదిక అందజేసి, నిధులు సక్రమంగా వినియోగించేలా కమిషన్‌ తరుపున సూచిస్తామన్నారు. 

చింతమనేనిని బర్తరఫ్‌ చేయాలి..

 ఆంగన్‌వాడీ కార్యకర్తలను దూషించిన ప్రభుత్వ చీఫ్‌విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. గురువారం కడప పాతబస్టాండ్‌లోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కోశాధికారి శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి ఐ.ఎన్‌.సుబ్బమ్మ మాట్లాడుతూ ఏలూరులో చింతమనేనికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన అంగన్‌వాడీల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. గతంలో తహశీల్దార్‌ వనజాక్షి పట్లా ఇలాగే ప్రవర్తించారని గుర్తుచేశారు.

వరదబాధితులకు3లక్షల విరాళం:మధు

 వరద బాధితుల సహాయార్థం ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈనెల ఐదో తేదీన పార్టీ శాఖలన్నీ ప్రజల నుంచి విరాళాలు సేకరిం చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. తమిళనాడుతో పాటు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతా లలో బాధితుల సహాయార్థం సిపిఎం రాష్ట్ర కమిటీ రూ.3 లక్షలు విరాళాన్ని పంపుతున్నట్లు గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

మతోన్మాదానికి వ్యతిరేకంగా ర్యాలీ..

మతోన్మాదానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని సరస్వతీ పార్కు నుంచి దాబాగార్డెన్స్ మీదుగా గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. అయితే సెక్షన్-30, 31 అమలులో ఉన్నాయని, ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే పక్కనే సరస్వతీ పార్కు వద్ద టీడీపీ జన చైతన్యయాత్ర పేరిట ర్యాలీలు తీస్తున్నారు కదా అని వామపక్షాల నేతలు ప్రశ్నించగా పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

రాముడితో రాజకీయాలా? :నితీశ్‌

 బీహార్‌ ముఖ్యమత్రి నితీశ్‌ కుమార్‌ కుమార్‌ బీజేపీపై మండిపడ్డారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. బీజేపీ నేతలు రామాలయం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇందుకు సంబంధించి కోర్టు విచారణ తేదీలు కూడా వారికి గుర్తుండవు' అని నితీశ్‌ విమర్శించారు. రెండు వర్గాల మధ్య సమగ్ర చర్చలు జరిగినప్పుడు మాత్రమే అయోధ్యలో రామాలయ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

Pages

Subscribe to RSS - 2015