అన్ని విధాలా ఆదుకోవాలి..

గోరుచుట్టుపై రోకటి పోటులా నిన్నటివరకు అనావృష్టితో బాధపడిన రాష్ట్ర్ర ప్రజలకు నేడు అతివృష్టి దెబ్బతీసింది. అల్పపీడనం ప్రభావం వల్ల గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ఈ వర్షాలు ఆపార నష్టాన్ని కలిగించాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఊరు యేరూ ఏకమయ్యాయి. స్వర్ణముఖి, కాళంగి, కైవల్య, పంబలేరు కట్టలు తెంచుకు ప్రవహించడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వందలాది గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. చెరువులకు గండ్లు, రోడ్లు, రైలు మార్గాలు కోతకు గురికావడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వర్ష బీభత్సాలకి ఇంతవరకు 13 మంది చనిపోయారు. నాలుగు లక్షలకుపైగా హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మొన్నటివరకు అనావృష్టి, ఇప్పుడీ అతి వృష్టి రాయలసీమ రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వేలాది ఎకరాల్లో వరి, మొక్క జోన్న, పత్తి, పెసర, టమాటో, ఉల్లి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉభయగోదావది జిల్లాల్లోనూ వరి పంట నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు కూడు, గూడు కరువై నానా అవస్థలు పడుతున్నారు. ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. పరిస్థితి తీవ్రతకు తగినట్టుగా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లేదు. అల్ప పీడనం తీవ్రత గురించి వాతావరణ పరిశోధన కేంద్రం ముందుగానే హెచ్చరించినా నష్ట నివారణ చర్యలు సరిగా చేపట్టలేదు. ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి వుంటే నష్టం ఇంతగా వుండేది కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ప్రభుత్వానికి అలవాటైపోయింది. వరదలు పోటెత్తిన మూడు రోజులకు గానీ జాతీయ విపత్తు సహాయక బృందాలు (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) ముందుకు రాలేదు. ఈ దళాలను ముందుగానే రప్పించి సిద్ధంగా వుంచితే పరిస్థితి మరోలా వుండేది. వరద తీవ్రత పెరిగిన తరువాత ఏరియల్‌ సర్వేలు, జిల్లా కలెక్టర్లతో సమీక్షలు, పరిహారం ప్రకటించడం వంటివి రొటీన్‌గా జరిగే తంతు. వీటినే చూపి ప్రభుత్వం చాలా చురుగ్గా కదులుతున్నట్లు చెబుతున్నారు. ఇటువంటి ప్రచార కార్యక్రమాలకే ప్రభుత్వం పరిమితమవడం వల్ల బాధితులకు పెద్దగా ఒరిగేదేమీ వుండదు. ఏం చెబుతున్నారన్నది కాదు, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందన్నది ముఖ్యం. హుదూద్‌ తుపాను బాధితులు పరిహారం కోసం ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినంతనే బాధితులకు సహాయం అందినట్లు భావించలేము. వరద సహాయక చర్యలను అమలు చేయడంలో స్థానిక సంస్థల పాత్ర చాలా కీలకం. ప్రపంచబ్యాంకు విధానాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో వీటిని ఒక పథకం ప్రకారం ప్రభుత్వాలు నిర్వీర్యం చేసిన ఫలితంగా ఏ చిన్న విపత్తు వచ్చినా స్థానిక సంస్థలు అచేతనంగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రతి చిన్నదానికి రాష్ట్ర కేంద్రం వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో కదిలిక వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇదొక వ్యవస్థాగతలోపం. దీనిని సరిదిద్దకుండా విపత్తులను సమర్థంగా ఎదుర్కోలేము. ముఖ్యమంత్రి మంగళవారం నాడు ప్రకటించిన పరిహారం కూడా పాక్షికంగానే వుంది. మృతులకు, దెబ్బ తిన్న ఇళ్లకు పరిహారం ప్రకటించారే తప్ప పంట నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకునేది చెప్పలేదు. ఉపాధి కోల్పోయిన కూలీల ఊసు అసలే లేదు. బాధితులు కోరుకుంటున్నది ఇటువంటి కంటి తుడుపు చర్యలు కాదు. ఈ ప్రకృతి విపత్తు కలిగించిన నష్టం నుంచి తమను బయటపడేసే మార్గం చూపమని అడుగుతున్నారు.. చెరువులు, రోడ్లకు పడిన గండ్లు పూడ్చాలని, దెబ్బ తిన్న పంటలకు తగు పరిహారం ఇవ్వాలని, పొలాల్లో వేసిన ఇసుక మేటలను తొలగించాలని కోరుకుంటున్నారు. ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నారు. వర్ష బీభత్సంలో బాధితులను అదుకునేందుకు ప్రభుత్వం ఉదారంగా ముందుకు రావాలి. ఈ విషయంలో రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సం స్థల సహకారాన్ని తీసుకోవాలి. వరద ముంపు ప్రాంతాల్లో తాగు నీరు, మందులు వంటి అత్యవసరాలతోబాటు నిత్యావసర సరుకులను అందుబాటులో వుంచేందుకు తక్షణమే తగు చర్యలు చేపట్టాలి. సందట్లో సడేమియాలాగా ఉల్లి, టమాటో వంటి పంటలకు వాటిల్లిన నష్టాన్ని ఆసరాగా చేసుకుని దళారీలు వీటి రేట్లను విపరీతంగా పెంచేస్తున్నారు. ఇటువంటి దళారీలపై విజిలెన్స్‌ దాడులు నిర్వహించాలి. దీనినొక గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన మార్గదర్శక ప్రణాళికలను రూపొందించాలి. కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని రాబట్టి వరద బాధితులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబల కుండా గట్టి చర్యలు తీసుకోవాలి.