మే 3వ తేదీన విశాఖలో అదానీ పుత్రరత్నాల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు డేటా సెంటర్లకు శంకుస్థాపన చేశారు. వీటి వల్ల 40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో లక్ష మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. రూ.21,844 కోట్ల పెట్టుబడితో 7 సంవత్సరాల్లో 5 దశలుగా సాగే ఈ డేటా సెంటర్లు ఎప్పటికి వాస్తవ రూపం దాల్చుతాయనేది సందేహాస్పదమే. వాస్తవానికి ఈ డేటా సెంటర్లపై 2019 జనవరి లోనే నాటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అదానీతో ఎంవోయూ (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) జరిగింది. ఆ తరువాత ప్రభుత్వం మారిపోవడంతో భూసేకరణ వగైరా ఆలస్యమై ఇప్పటికి వాస్తవ రూపం ధరించిందని జగన్ ప్రభుత్వం చెబుతోంది.