పోలవరం పునరావాస బాధితుడు అత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 మే, 2024.

 

 

ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద పోలవరం పునరావాస బాధితుడు అత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నది. తక్షణమే ఆ రైతుకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది. అతనికి మెరుగైన వైద్యం అందించాలి. ఆ వైద్యానికయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఆ రైతు కుటుంబం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మరిన్ని ఘటనలు జరగకముందే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 100% పునరావాస పరిహారం బాధితులకు ఇప్పించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తున్నది. 

2 ఎకరాల భూమి, ఇళ్లు తన మొత్తం ఆస్తిని ప్రాజెక్టు కోసం అర్పించిన దేవిపట్నంకు చెందిన రైతు సీతారామయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నజరానా ఇది. 73 ఏళ్ల వయసులో 8 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 80% ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని గత టిడిపి ప్రభుత్వం, నేటి వైసిపి ప్రభుత్వం డంభాలు పలుకుతున్నాయి. పునరావాస బాధితులకు 20% కూడా పరిహారం అందకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యాతారాహిత్యం. కానీ పునరావాస ప్యాకేజీతో సహా పోలవరం ప్రాజెక్టు కేంద్రప్రభుత్వ బాధ్యత. కానీ కేంద్ర ప్రభుత్వం ఏవో కుంటి సాకులు చెబుతూ నిధులివ్వటాన్కి తాత్సారం చేస్తున్నది. పునరావాస బాధ్యత నుండి తప్పుకుంటున్నది. పునరావాస బాధితుల ప్రాణాలతో, బతుకులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి. 

ఇప్పటికైనా తక్షణం మరిన్ని ఘటనలు జరగకముందే రాష్ట్ర ప్రభుత్వం పునరావాస బాధితులకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించాలని సిపిఐ(యం) కోరుతున్నది. 

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి