సిట్‌ నివేదికను బహిర్గత పర్చాలి: సిపిఎం డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 21 మే, 2024.

 

సిట్‌ నివేదికను బహిర్గత పర్చాలి: సిపిఎం డిమాండ్‌

 

ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై దర్యాప్తునకు నియమించిన సిట్‌ బృందం సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ్‌ కమిటీ డిమాండ్‌ చేస్తోంది. పోలీసుల దర్యాప్తులో అనేక లోపాలున్నట్లు సిట్‌ నిర్ధారించిన నేపథ్యంలో ఆ నివేదికలోని అన్ని వివరాలనూ వెల్లడిరచడం మరింత అవసరం. అల్లర్లు, హింసకు సంబంధించిన కేసుల దర్యాప్తులోని లోపాలను సరి చేసేలా ఎఫ్‌ఐఆర్‌లో మరికొన్ని  సెక్షన్లు చేర్చాలని సిట్‌  ప్రతిపాదించినట్లు వార్తలొచ్చాయి. ఏయే సంఘటనల్లో  ఏయే సెక్షన్లు చేర్చవచ్చో కూడా నిర్దిష్టంగా వివరించినట్లు సమాచారం.  దర్యాప్తులో భాగంగా ఆయా ప్రాంతాల్లో సంఘటన ఎలా జరిగింది? ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులెవరు? సంఘటన జరగకుండా ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? అల్లర్లు జరగకుండా తీసుకున్న చర్యలేమిటి? ఘటనలకు సంబంధించి ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు చేశారు? ఏయే సెక్షన్లు వేశారు? అసలైన నిందితులను కేసులో పెట్టారా? లేక రాజకీయ ఒత్తిళ్లలకు లొంగి వారిచ్చిన పేర్లను కేసుల్లో ఇరికించారా? లాంటి విషయాలను స్ధానికులు, పోలీసులనుంచి వివరాలు  రాబట్టిన సిట్‌ ఆ అంశాలను కూడా నివేదికలో పొందుపరిచిందని మీడియాలో వార్తలు వచ్చాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఈ సంఘటనలకు సంబంధించి 33  కేసుల్లో మొత్తం 1370 మంది నిందితులలో ఇప్పటి వరకు 124 మందిని మాత్రమే అరెస్ట్‌ చేయగా, మరో94 మందికి 41(ఎ) కింద నోటీసులు జారీ చేశారు. మిగిలిన 1152 మంది సంగతి తెలియదు. వారిలో అనేకమంది పరారీలో వున్నారని కథనాలు వస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణే ఏకైక లక్ష్యంగా ఇకముందైనా పోలీసు యంత్రాంగం ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. రాష్ట్ర ప్రజలకు అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్‌ అటువంటి భరోసా కల్పించడం అవసరం. సిట్‌ నివేదికను బహిర్గతపరిస్తే పారదర్శకత పెరిగి ప్రజలకు విశ్వాసం కలిగే అవకాశముంటుంది. 

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి