పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా భూసేకరణ చేయడాన్ని ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. సారవంతమైన వ్యవసాయ భూములను బడా కార్పొరేట్ కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేయడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల భూ బ్యాంక్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించడం సరికాదని, ఈ విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో అవసరానికి మించి పెద్ద మొత్తంలో రెండు, మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడాన్ని విరమించుకోవాలని కోరారు.