ల్యాండ్‌ బ్యాంక్‌ వద్దు :మధు

పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా భూసేకరణ చేయడాన్ని ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి  లేఖ రాశారు. సారవంతమైన వ్యవసాయ భూములను బడా కార్పొరేట్‌ కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేయడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల భూ బ్యాంక్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించడం సరికాదని, ఈ విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పేరుతో అవసరానికి మించి పెద్ద మొత్తంలో రెండు, మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడాన్ని విరమించుకోవాలని కోరారు. రైతుల సాగులో ఉన్న ప్రభుత్వ, అటవీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటే రైతులే కాకుండా వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని తెలిపారు. 5వేల ఎకరాలు సరిపడే రాజధాని కోసం 1.11లక్షల ఎకరాలు సేకరించి బడా కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుందని, ఈ విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు.