విద్యారంగ స్వేచ్ఛకు ప్రమాదం..

 ఈమధ్య పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతున్న విద్యార్థుల పోరాటం గురించి మీడియాలో చూస్తున్నాం. ఆ సంస్థకు అధ్యక్షుడిగా గజేంద్ర చౌహాన్‌ను, ఆయనతోపాటు మరో ముగ్గురిని పాలక మండలి సభ్యులుగా నియమించటాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఆ సంస్థతో సంబంధంలేని ఇతర సినిమా రంగ నిష్ణాతులు కూడా ఈ నిరసనలో పాలుపంచుకుంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఆయనకున్న అర్హతల్లా ఆయన మోడీపై సినిమా తియ్యటమే. దానితోపాటు మహాభారతం టీవీ సీరియల్‌లో ధర్మరాజు పాత్రను పోషించాడు. ఒకప్పుడు మహామహులు నిర్వహించిన ఆ బాధ్యతలోకి రావటానికి ఈ అర్హతలు ఏమాత్రం సరిపోవు. అయితే పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మాత్రమే ఇలా జరగలేదు. అనేక ఇతర పరిశోధనా సంస్థలలో కూడా ఇలాంటి నియామకాలే జరిగాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ స్టడీస్‌, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌లే కాకుండా అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్ల నియామకం కూడా ఇలాగే జరిగింది. ఐఐటిల, ఐఐఎమ్‌ల పాలకమండళ్ళ నియామకాల్లో కూడా ఇలాంటి వివాదాలే చెలరేగాయి. ఉన్నత విద్యాసంస్థలకుండవలసిన సంస్థాగత స్వయంప్రతిపత్తి మీద ప్రభుత్వం ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి చేస్తోంది. అయితే ప్రజల దష్టిలో పడని మరొక మహత్తర మార్పు ఉన్నత విద్యారంగాన్ని ముంచెత్తబోతోంది. ఈ దాడితో జాతి ప్రయోజనాల కోసం విధాన నిర్ణయాలను, చట్టాలను చేయటానికి, వాటిని అమలుచేయటానికి ప్రభుత్వానికి, పార్లమెంటుకు ఉండే సార్వభౌమాధికారానికి ప్రమాదం వాటిల్లబోతోంది.
డబ్ల్యుటిఒ కైవసం చేసుకునే ప్రమాదం
2005లో ఉన్నత విద్యారంగంలోని ఉప రంగాలలో 'మార్కెట్‌ ప్రవేశానికి' ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)ను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. ఇది 2001లో మొదలైన గాట్‌ దోహా రౌండ్‌ చర్చల్లో భాగంగా ఉన్నది. ఆ విధంగా భారత ప్రభుత్వం ఆహ్వానించటంతో డబ్ల్యుటిఒలోని 160 సభ్యదేశాలు మన దేశంలో విద్యాలయాలను వాణిజ్య ప్రాతిపదికన స్థాపించటానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఈ ప్రక్రియ ఒక దశాబ్దం క్రిందటే ప్రారంభమైనప్పటికీ అది ఆలస్యంగా ఇప్పటికి వేగవంతమవుతున్నది. ఈలోపు దోహా రౌండ్‌లో అనేక వివాదాస్పద విషయాల మీద ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే 2014లో జెనీవాలో జరిగిన డబ్ల్యుటిఒ పాలకమండలి ప్రత్యేక సమావేశం ఈ విషయాలను తప్పనిసరిగా మార్చింది. గతంలో వెనుకబడిన దేశాలు ప్రతిఘటించిన విషయాలను వేగవంత ంగా అధిగమించేందుకు 2015 డిసెంబరు 15-18 తేదీల్లో మంత్రుల స్థాయి సమావేశం జరగనున్నది. ఈ సమావేశం ప్రపంచ వాణిజ్య సంస్థను మరింత బలోపేతం చేయనున్నదనే విషయం సుస్పష్టం. ఇది ఆర్థిక రంగంలోని అనేక విభాగాలలోనూ, వాణిజ్యంలోనూ అభివద్ధి చెందిన దేశాల ప్రయోజనాలకు, కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందనే విషయం చెప్పనక్కరలేదు. భారతదేశానికి దీనివల్ల ఎలాంటి పర్యవసానాలున్నాయి? గాట్‌ ఒప్పందం మూడు విభిన్న విషయాలను ఏకం చేస్తుంది. వ్యవసాయం, మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన వాణిజ్యం, సేవలు. ఈ ఒప్పందం ప్రకారం విద్య వాణిజ్య సేవగా పరిగణింపబడుతుంది. ఇది గాట్‌ కౌన్సిల్‌ పరిధిలోకి వస్తుంది. హేయమైనదిగా అనిపించినప్పటికీ కొద్దిపాటి స్థానిక మార్పులతో ఇది నైట్‌ క్లబ్బుల వంటి వినోద కార్యకలాపాల నియంత్రణ నియమాల కిందకొస్తుంది. దీనితో గాంధీ, ఠాగూర్‌ల శకం అంతరిస్తుంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో నెలకొల్పబడి, వారసత్వంగావచ్చిన విద్యా సంస్థలు గతానికి చెందిన అవశేషాలుగా మిగులుతాయి. నాగరికత, సంస్కతి ప్రక్రియలో భాగమై జాతితోపాటు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఉన్నత విద్య పరిత్యజింపబడుతుంది. మనోభావాలకు సంబంధించిన విషయాలను పక్కనబెడితే ప్రపంచ వాణిజ్య సంస్థ పర్యవేక్షణ పర్యవసానంగా చట్టపరంగా విద్యార్థి వినిమయదారుడిగా పరిగణింపబడతాడు. 1998లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో భారత పార్లమెంటు విద్యను ప్రాథమిక హక్కుగా ఏకగ్రీవంగా గుర్తించింది. కాబట్టి ఉన్నత విద్య కార్పొరేట్‌ కంపెనీలకు లాభసాటి వ్యాపారంగా మారి దానికి గత సంప్రదాయాలతో ఉన్న సంబంధం తెగిపోతుంది. ఉన్నత విద్యకు సంబంధించిన భారతీయ చట్టాలు వాణిజ్య విధాన సమీక్షా యంత్రాంగం (టిఆర్‌ఎమ్‌) ఏటా సమీక్షిస్తుంది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన చట్టబద్ధమైన విభాగం. పార్లమెంటు ఆమోదించే చట్టాలను, జాతీయ విధానాలను మార్చ టానికి, సవ రించటానికి ఈ విభాగానికి అధికారం ఉంటుంది.
మొదలైన సన్నద్ధత
ఉన్నత విద్యలో డబ్ల్యుటిఒ ప్రవేశం అనుకోకుండా జరగ లేదు. 1990వ దశాబ్దం ఆరంభంలో ప్రవేశపెట్టిన నయా ఉదారవాద సంస్కర ణల తాత్విక దిశా నిర్దేశంలో భారత్‌లోని విద్యా రంగం ప్రభావితం కావటం మొదలైంది. అయితే గత కొన్ని సంవత్స రాలుగా దీనిపై స్పష్టత వస్తున్నది. ఈ వ్యాపారీకరణలో ఆక్రమించే లక్షణం కనపడుతున్నది. దీనికి గల కారణాలను అర్థం చేసుకోవటం కష్టమేమీ కాదు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ నూతన విద్యా విధానం గురించి ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. 'విద్యపై ప్రభుత్వం చేస్తున్న వ్యయంలో 18 శాతం లేక స్థూల జాతీయోత్పత్తిలో 1.12 శాతం ఉన్నత విద్యపై ఖర్చు అవుతున్నది. దీనిని 25 శాతానికి పెంచాలి. జిడిపిలో ఉన్నత విద్యపై వ్యయాన్ని 1.5 శాతానికి పెంచితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అదనంగా రూ.25,000 కోట్లు సమకూ రుతుంది' అని ఈ పత్రం వ్యాఖ్యానించారు. అయితే గత బడ్జెట్లో విద్యారంగానికి చేసిన కేటాయింపులు కుదించడం పట్ల ఈ పత్రం మౌనంగా ఉంది. పెరుగుతుందని చెబుతున్న ఈ మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంచితే ఏమూలకూ రాదు.
ప్రయాణం ఏ దిశలో సాగుతోంది?
నిజానికి ఉన్నత విద్యా రంగంలో క్రమేణా ప్రయివేటురంగ ప్రాబల్యం పెరిగి లాభాపేక్షే పరమావధిగా ఉంది. ఈ విస్తరణ ప్రథమంగా సాంకేతిక, మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలలో జరిగింది. ఆ తరువాత అది సాధారణ ఉన్నత విద్యకు విస్తరించింది. ఈ విద్యాసంస్థలు విజయవంతం కావటం, కాకపోవటం అనేది అవి లాభసాటిగా ఉన్నాయా, లేదా అనే విషయంపైనే ఆధారపడుతుంది. దీనివల్ల అనివార్యంగా రెండు విధాలైన పర్యవసానాలుంటాయి. అరకొర సౌకర్యాలు, సరైన జీతాలు ఇవ్వని, సరైన పరిజ్ఞానంలేని అధ్యాపకులు ఉండటంచేత ఈ విద్యాసంస్థలు డిగ్రీల విక్రయ కేంద్రాలుగా తయారవుతాయి. విద్యారంగాన్ని లాభసాటిగా మార్చటానికి వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, కేంద్రీకరణ ప్రాథమ్య విషయాలయ్యాయి. విద్యను వికేంద్రీకరించాలనే భావనను రాజ్యాంగంలో పొందుపరిచి దానిని రాష్ట్రాల జాబితాలో చేర్చారు. ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. యుపిఎ-2 ప్రభుత్వ చివరి దశలో ప్రతిపాదించిన అరడజను చట్టాలు ప్రయివేటీకరణ, కేంద్రీకరణలను ప్రోత్సహించేవిగా ఉన్నాయి. ఈ చట్టాలు ఉన్నత విద్యను మార్కెట్‌లో ఐక్యం అయ్యేలా చేశాయి. ప్రపంచంలో విద్యా వ్యాపారం రెండవ అతి పెద్దది. ఇది అత్యంత వేగంగా పెరుగుతున్నది. ప్రపంచ విద్యా మార్కెట్‌లో భారత్‌ ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తున్నది. విద్యను మార్కెట్‌ నమూనాగా మార్చటం అత్యంత ఆవశ్యకంగా మారింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను సెమిస్టర్‌ పద్ధతికి మార్చటంతో ఇది మొదలయింది. ప్రభుత్వ విద్యా సంస్థలు వున్నంతకాలం 'ప్రైవేటు' ముందుండదని అనుభవం చెబుతోంది. ఇంజనీరింగ్‌ కాలేజీలలో అనేక వేల సీట్లు మిగిలిపోతున్నాయి. ప్రస్తుతం 45 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 321 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 129 డీమ్డ్‌ విశ్వవిద్యాల యాలు, 187 ప్రైవేటు విశ్వవిద్యాలయాలున్నాయి. ఇలా విడివిడిగా ఉన్న చిన్నచిన్న సంస్థలు ప్రైవేటు పెట్టుబడుల స్థిరీకరణకు అడ్డంకిగా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటి ప్రమా ణీకరణ జరగాలి. క్షేత్ర స్థాయిలో పబ్లిక్‌, ప్రైవేటు మధ్య వాస్తవ తేడాను రూపుమాపాలనే లక్ష్యంగా మాడ్యూల్‌ మోడ్‌, చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సిబిసిఎస్‌)లను ప్రవేశ పెడుతున్నారు. సమానత లేక లాభార్జనల ప్రాతిప దికన ప్రైవేటు పోటీపడలేనందున ఇది అవసరమౌతోంది. కాబట్టి వాస్తవంలో ప్రభుత్వ విద్య సరుకుగా మారాలి. అది జరగటానికి బోధన సిబ్బంది ఒప్పంద కార్మికులుగా మారాలి. అలాగే సరిపడినంత నిధులు కేటాయించకుండా వ్యవస్థాపనా సౌకర్యాలను నాశనం చెయ్యాలి.
దేశంలోని దిగువ స్థాయి ఉన్నత విద్యను ప్రపంచ కార్పొరేట్‌ సంస్థలకు సేవలందిం చేదిగా చెయ్యాలి. ఆవిధంగా డబ్ల్యుటిఒ పాలనను విద్యా రంగంలో ప్రవేశ పెట్టాలి. తద్వారా విజ్ఞానానికి ప్రావీణ్యత, ప్రజల యాజమాన్యానికి లాభాపేక్ష గల ప్రైవేటు, జాతీయతకు విదేశీ, విమర్శనాత్మకతకు యథాతథవాదం ప్రత్యామ్నా యాలవుతాయి. అంతిమంగా సార్వభౌమాధికారం దాస్యశంఖ లాలలో చిక్కుకుంటుందనడంలో సందేహం లేదు.
ముందు దారి
రాబోయే రోజుల్లో ఏకైక ప్రత్యామ్నాయం ప్రతిఘటన మాత్రమే. విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, దేశాభివద్ధి, విద్య అవసరమనుకునే భారత సమాజంలోని ప్రజలందరూ ఐక్యంగా ఈ విధానాలను ప్రతిఘటించాలి. ప్రభుత్వం తన ప్రతిపాదనను ఉపసంహరించుకోకపోతే విద్యకు సంబంధించి గాట్‌లో భాగంగా ప్రపంచ డబ్ల్యుటిఒలో భారతదేశం చేరినట్టవుతుంది. భారత ప్రభుత్వం, పార్లమెంటు వంటి ప్రజాప్రాతినిధ్య సంస్థలు చట్టాలను చేయగల సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఎందుకంటే ఒప్పందాన్ని అమలుచేయటానికి ఈ సంస్థలు చేసిన చట్టాలను రద్దుచేసే అధికారం ప్రపంచ వాణిజ్యసంస్థకు వస్తుంది. ప్రభుత్వం, పార్లమెంటు ప్రజల ఒత్తిడికి, జవాబుదారీతనానికి అతీతంగా తయారవుతాయి. ఎంతోమంది బలిదానాలతో, మహత్తర త్యాగాలతో సాధించుకున్న ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ తెరమరుగవుతాయి. కచ్చితంగా అలాంటి భవిష్యత్తును మనం కోరుకోవటం లేదు.
నీలోత్పల్‌ బసు