కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పౌర స్వేచ్ఛ పైన, ప్రజాతంత్ర హక్కులపై దండెత్తుతున్నది. ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లు-2022 మోడీ ప్రభుత్వ మరో నిరంకుశ చర్య. బ్రిటిష్ వలస పాలకులు ప్రవేశపెట్టిన ఖైదీల గుర్తింపు చట్టం(1920) ని రద్దు చేసి, దాని స్థానే తీసుకొచ్చే బిల్లు ఆధునిక ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పౌర స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చేలా ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ, మోడీ ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నమైన రీతిలో బిల్లును తీసుకొచ్చింది.