
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 నవంబర్, 2026.
నీటిని ప్రయివేటీకరించే వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ప్రతిపాదనను
వెంటనే ఉపసంహరించుకోవాలి
- సిపిఐ(యం)
సాగు, త్రాగు నీటిని ప్రయివేటీకరించి ప్రజలపై మోయలేని భారాలు వేయడమే కాక వ్యవసాయాన్ని దెబ్బకొట్టే వాటర్ రెగ్యులటరీ కమిషన్ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం ప్రజలను వంచించడమే.
ఇప్పటికే విద్యుత్ రంగంలో ఏర్పాటు చేసిన రెగ్యులటరీ కమిషన్ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడక పోగా ప్రభుత్వాలు పెంచే విద్యుత్ చార్జీల భారాలకు ముసుగుగా తోడ్పడుతున్నది. అక్రమ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు ఆమోద ముద్ర వేసి ప్రజలపై భారాలు వేస్తున్నది. పైగా అదనంగా ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజల మూల్గులు పీలిస్తున్నారు.
ఈ తరహా కమిషన్ను జలవనరుల రంగంలో ఏర్పాటు చేయడం ద్వారా త్రాగు, సాగు నీరు పూర్తిగా వ్యాపార సరుకుగా మారుతుంది. కోకాకోలా, రిలయన్స్ లాంటి విదేశీ, స్వదేశీ కంపెనీలు ఇప్పుడే నీళ్ళ వ్యాపారంలోకి వచ్చాయి. ఇకపై మన నదులు, రిజర్వాయర్లు వారి ఆధీనంలోకి పోతాయి. జలవనరుల రంగంలో రెగ్యులేటరీ కమిషన్ను ఏర్పాటు చేయాలని చాలా కాలం నుండి ప్రపంచబ్యాంకు, కేంద్రం మన రాష్ట్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో అందుకు ప్రభుత్వాలు సాహసించలేకపోయాయి.
ప్రపంచబ్యాంకు ఆదేశాల్లో భాగంగా త్రాగు, సాగునీటి వనరులకు మీటర్లు ఏర్పాటు చేయించడంకోసం కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ పేరుతో రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తుంది. మోడీ విధానాలను రాష్ట్రంలో వేగంగా అమలు చేయడం గ్రామీణ ప్రాంత తాగునీటి పథకాలన్నిటికీ మీటర్లు బిగించాలని, వాడకం ప్రాతిపదికన ప్రజల నుండి యూజర్ చార్జీలు వసూలు చేయాలని స్థానిక ఎన్నికల మధ్యలో 160 జివోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆ జివోను ప్రభుత్వ వెబ్సైట్లో కనపడకుండా దాచేసి ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాలతో పాటు పట్టణాలు, త్రాగు నీటితో పాటు సాగు నీటి రంగాలను కలిపి జలవనరుల కమిషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోంది. డబల్ ఇంజన్ సర్కారు అంటే ప్రజలపై బుల్డోజర్ తోలడమేనని ఈ నిర్ణయంతో మరోసారి కూటమి ప్రభుత్వం రుజువు చేసుకుంది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. ఒకవైపు ఎలినినో ప్రభావంతో తీవ్ర కరువు, మరోవైపు వరుస తుఫానులు, భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ముప్పేట కష్టాల్లో వున్న ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా నీటిని కూడా వ్యాపార సరుకుగా మార్చాలని రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నాన్ని ప్రజలు వ్యతిరేకించాలని సిపిఐ(యం) పిలుపునిస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
