అధికార పార్టీ అక్రమాలకు సిపిఐ(యం) ఖండన రీపోలింగ్ జరపాలని డిమాండ్

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 01 నవంబర్, 2026.

అధికార పార్టీ అక్రమాలకు సిపిఐ(యం) ఖండన

రీపోలింగ్ జరపాలని డిమాండ్

రాష్ట్రంలో ఈరోజు జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ మరియు నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కూటమి పార్టీలు అధికార దుర్వినియోగం చేసి బూత్ ఆక్రమణలకు పాల్పడడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. రిగ్గింగ్‌కు పాల్పడిన ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. రిగ్గింగ్‌కు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది. వారికి వత్తాసు పలికిన పోలీసు అధికారులపై కూడా తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నది. ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాల్లో ఇటువంటి చర్యలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం గర్హనీయం.

నంద్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆయన భార్య సుజాతమ్మ నాయకత్వంలో వందలాది మందితో డోన్‌లో 36 వార్డులను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అందులో సిపిఐ(యం) పోటీ చేస్తున్న 15,18,28 వార్డులలో డిఎస్పి శ్రీనివాసులు సిఐలు పోలీసుల సహకారంతో సిపిఐ(యం) ఏజెంట్లను, వైసిపి ఏజెంట్లను బలవంతంగా బయటికి గెంటివేసి, ఒక ప్రాంతంలో బంధించి పూర్తిస్థాయిలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 

మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలో సిపిఐ(యం) పోటీచేస్తున్న 22వ వార్డులో తెలుగుదేశం కార్యకర్తలు  రిగ్గింగ్ చేశారు.

నంద్యాల జిల్లా బేతంచెర్ల కూడా దాదాపు 15 వార్డులలో ఇదేవిధంగా రిగ్గింగ్ చేసుకున్నారు. ఈ రెండు మున్సిపాలిటీలలో రీ పోలింగ్ జరపాలని సిపిఐ(యం) డిమాండ్  చేస్తున్నది.

మార్కాపురం జిల్లా కనిగిరిలో 29వ వార్డులో పోటీచేస్తున్న సిపిఐ(యం) అభ్యర్థి కేశవరావును రౌడీషీట్ ఉందనే పేరుతో పోలింగ్ ముగిసే వరకు పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

కడపలో పులివెందుల, అనంతపురం జిల్లాలో కూడా రిగ్గింగ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అధికార పార్టీ ఒక పథకం ప్రకారం ఇలా అక్రమాలకు పాల్పడుతుంటే పోలీసు యంత్రాంగం వాటిని నివారించాల్సింది పోయి వారికి తోడ్పడే పద్దతిలో వ్యవహరించడం దుర్మార్గం. ఈ దుర్మార్గ చర్యలకు పాల్పడిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించి తిరిగి ఎన్నికల నిర్వహించాలి. అందుకు తోడ్పడిన పోలీసు, పోలింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి