అన్ని రకాల మందుల ధరలు తగ్గించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 అక్టోబర్, 2026.

అన్ని రకాల మందుల ధరలు తగ్గించాలి

` సిపిఐ(యం)

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అన్నిరకాల మందులు, టెస్టుల ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ప్రజారోగ్య వ్యవస్థకు నిధులు కేటాయించి బలపరచాలని కోరుతున్నది.

క్యాన్సర్ వ్యాధికి అవసరమైన కొన్ని రకాల మందుల గరిష్ట ధరలను తగ్గిస్తూ జాతీయ మందుల ధరల అథారిటీ (ఎన్‌పిపిఎ) తీసుకున్న నిర్ణయం హర్షణీయం. అయితే ఇది చాలా పరిమితమైన ప్రభావాన్నే చూపుతుంది. వీటితోపాటు దీర్ఘకాలిక జబ్బులు (బిపి, షుగర్, గుండె, కిడ్నీ, మానసిక) మందుల ధరలు కూడా తగ్గించాలి. సాధారణ డెంగ్యూ లాంటి మందుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. ఈ రోజు ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా వ్యాపారమయమైపోయి టెస్టులు, మందులకే సాధారణ జనం దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ప్రజల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రప్రథమ ప్రాధాన్యతనివ్వాలి. ఈరోజు సాధారణ జ్వరం, దగ్గు, జలుబు లాంటి జబ్బులకే వేల రూపాయలు ఖర్చయిపోతున్నాయి. వైద్యానికే జనం అప్పులపాలవుతున్నారు. ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా బలహీనపడిపోయింది. ఆరోగ్య శ్రీ ఉన్నా నిష్పలం. మార్కెట్‌లో మందుల ధరలకు ఉత్పత్తి ఖర్చుకు అసలు పొంతనే లేదు. అనేకరెట్లు వ్యత్యాసం ఉంది. జనరిక్ మందుల ధరలు కూడా యంఆర్‌పి ఒక ధర ఉండగా ఒక్కో షాపులో ఒక్కో ధరకు అమ్మడం వలన ప్రజలకు ప్రయోజనం చేకూరడం లేదు. సాధారణ ప్రజలకు మందులు అత్యవసరమైనందున అప్పులు చేసైనా కొనాల్సిన దుస్తితి. దీనిపై ఎలాంటి నియంత్రణా లేదు. మందుల వ్యాపారాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్కెట్ శక్తులకే వదిలేసింది. ఆ రీత్యా తక్షణం మందుల ధరల నియంత్రణ అథారిటీని నెలకొల్పి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు తగ్గించాలి. ప్రభుత్వ ఆస్పత్రులలో పరీక్షా యంత్రాలను, మందులను పూర్తిగా వినియోగంలోకి తెచ్చి అన్నిరకాల జబ్బులకు రోగులందరికీ ఉచితంగా అందించాలి. ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు. దీనికనుగుణంగా ప్రభుత్వ విధానాలు రూపొందించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి