(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 05 అక్టోబర్, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాల్లో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న పార్ట్‌టైమ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ...
అయ్యా!
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థలోని 190 పాఠశాలలో వివిధ తరహా కేడర్లలో పార్ట్-టైమ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు సుమారు 1673 మంది అనేక సంవత్సరాలుగా పని చేస్తున్నారు . వీరంతా దళిత పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సేవలందిస్తున్నారు.
వీరంతా క్వాలిఫైడ్ టీచర్లు. అయినా పార్ట్-టైమ్‌గా నియమించబడ్డారు. వీరిలో సగం మంది మహిళలు. వాస్తవంగా ఉదయం 4:30 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు బోధనతో పాటు హౌస్ టీచర్ బాధ్యతలు, స్టడీ అవర్స్, సెలవు రోజుల విధులు, నైట్ డ్యూటీలు, మెస్ నిర్వహణ, సహపాఠ్య కార్యక్రమాలు మరియు విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వారానికి సుమారు 32-38 బోధనా పీరియడ్లు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమానమైన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, వారికి అందుతున్న వేతనం మాత్రం అందులో నాలుగో వంతు. సుమారు రూ.14 వేల నుండి 24 వేలు మాత్రమే. చాలీ చాలని వేతనాలతో వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అవి కూడా రెగ్యులర్‌గా రావడం లేదు. ఇతర ఉద్యోగులకు వర్తించే ఎలాంటి సెలవులు లేవు. పిఏఫ్, ఇఎసఐ వర్తించదు. వీరి సమస్యలు చెప్పుకునేందుకు కేంద్ర ఆఫీస్‌లో లైజినింగ్ ఆఫీసర్ లేరు. ఇవన్నీ ప్రభుత్వపరంగా ఎదురవుతున్న సమస్యలు. అయితే వ్యక్తిగతంగా క్షేత్రస్ధాయిలో వివక్షతో కూడిన సమస్యలు కూడా ఎదుర్కుంటున్నారు. ఉదాహరణకు వీరిని స్టాఫ్ రూమ్‌లో అందరితో సమానంగా కూర్చోదానికి అనుమతించరు.
గత్యంతరం లేక వారి సమస్యల పరిష్కారం కొరకు గత 8 రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. రాష్ట్రంలోని దళిత మరియు పేద విద్యార్థులకు పాఠాలు చెప్పే వీరి సమస్యలు పట్ల మీరు ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని వీరి న్యాయమైన సమస్యలు పరిష్కారం చెయ్యాలని కోరుతున్నాను.
వారి కోర్కెలు మీ దృష్టికి తెస్తున్నాను :
(1) ఎపిఎస్‌డబ్ల్యూఆరఇఐఎస్‌లో అనేక సంవత్సరాలుగా నిరంతర సేవలందిస్తున్న అన్ని కేడర్ల పార్ట్-టైమ్ ఉద్యోగులను కాంట్రాక్ట్‌లోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలి.
(2) గత పిఆర్‌సి సిఫార్సుల ప్రకారం మినిమమ్ టైమ్‌స్కల్ (యంటిఎస్) మంజూరు చేసి, సమాన పనికి సమాన వేతనం అందేలా చర్యలు తీసుకోవాలి.
(3) నాలుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి. ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించాలి.
(4) డిఎస్సీ బదిలీలు/ పదోన్నతుల కారణంగా స్థానభ్రంశం చెందిన వారికి తిరిగి పోస్టింగ్ కల్పించాలి. సీనియారిటీ ఆధారంగా తగిన పోస్టింగ్/రీ-అలోకేషన్‌కు హామీ ఇవ్వాలి.
(5) సంవత్సరానికి 15 క్యాజువల్ సెలవులు మంజూరు చేయాలి. వినియోగించని సెలవులను నిబంధనల ప్రకారం క్యారీఫార్వర్డ్ చేసే అవకాశం కల్పించాలి.
(6) ఇపిఎఫ్ మరియు ఇఎస్ఐ భద్రత కల్పించాలి.
(7) సేవలో మరణించిన పార్ట్-టైమ్ ఉపాధ్యాయుల కుటుంబాలకు మట్టి ఖర్చులతోపాటు రూ.10 లక్షలు గ్రాంటుగా మంజూరు చేయాలి.
(8) మహిళా ఉపాధ్యాయులకు ప్రసూతి మరియు పసి పిల్లల సంక్షేమ సెలవులు ఇవ్వాలి.
(9) పరిపాలనా, ఉద్యోగ మరియు సంక్షేమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ (లైజాన్) ఆఫీసర్‌ను నియమించాలి.
వీరి సమస్యలను సానుభూతితో అర్థం చేసుకొని పరిష్కారానికి మీరు చొరవ చూపించాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
