కరువు మండలాలపై కంటి తుడుపు ప్రకటన రాష్ట్రాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 అక్టోబర్, 2026.
కరువు మండలాలపై కంటి తుడుపు ప్రకటన
రాష్ట్రాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి.
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వ కరువు మండలాల ప్రకటన ప్రజలను, రైతు, కూలీలను తీవ్రంగా నిరాశపరిచింది. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో 544 మండలాలను కరువుగా గుర్తించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని, అందుకు తగినట్లుగా ప్యాకేజీ ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. పరిస్థితికనుగుణంగా కేంద్ర ప్రభుత్వ కరువు మాన్యువల్ 2016ను సవరించాలని కోరుతున్నది.
ఈ సంవత్సర ఆరంభం నుండే ఎల్‌నినోతో వర్షాలు పడవని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా కళ్లు తెరిచి 388 మండలాలను అందులోనూ 283 మాత్రమే తీవ్ర కరువుగా ప్రకటించడం అన్యాయం. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో 31 గ్రామీణ మండలాలకు గాను 28 కరువుగా ప్రకటించారు. కానీ ప్రకటించని పెద్ద ఒడుగూరు మండలంలో నేను పర్యటించిన సందర్భంగా పంటలన్నీ ఎండిపోవడం ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి మండలాలను మినహాయించరాదని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, పల్నాడు చివరకు గుంటూరు, బాపట్ల, ఎన్‌టిఆర్, కృష్ణా, నెల్లూరు జిల్లాల పశ్చిమ మండలాలు, డెల్టా చివర భూములు కూడా ఎండిపోయాయి. పంట వేయని భూములు ఖాళీగా ఉన్నాయి. రైతులు పెట్టుబడి నష్టపోయారు. కూలీలకు ఉపాధి లేదు. తాగే నీరు కరువైంది. పశువులకు గడ్డిలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయం. విదేశీ పెట్టుబడుల రందిలో రాష్ట్ర ప్రజలను, గ్రామీణ పేదలు, రైతుల్ని మరిచిపోయారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రాష్ట్రాన్ని కరువు బారి నుండి ఆదుకునేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి