సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి యం.ఏ.బేబి సహా వామపక్ష కేంద్ర నాయకుల అరెస్టులకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 29 సెప్టెంబర్, 2026.
సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి యం.ఏ.బేబి సహా
వామపక్ష కేంద్ర నాయకుల అరెస్టులకు ఖండన

ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఎసఐఆర్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి యం.ఏ.బేబి సహా అఖిల భారత నాయకులు బి.వి.రాఘవులు, బృందాకరత్, సుభాషిణి ఆలీ, ఆర్.అరుణ్‌కుమార్, సిపిఐ ఢిల్లీ రాష్ర కార్యదర్శి దినేష్ వర్షినే మరియు ఇతర వామపక్ష పార్టీల నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి, అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. అరెస్టు చేసిన వారిని బే షరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.
13కోట్ల మంది ఓటర్లను అక్రమంగా తొలగించిన నేరానికి దేశవ్యాపితంగా ప్రజా నిరసన పెల్లుబుకుతున్నది. ప్రధాన ప్రతిపక్షాలన్నీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్‌డిఏ భాగస్వామ్యం పక్షాలు సైతం అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. వీటికి సమాధానాలు చెప్పలేదు.
ప్రశాంతంగా ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్తున్న సిపిఐ(యం) సీనియర్ నాయకులు, వామపక్ష పార్టీల నాయకులపై రౌడీలు, సంఘ విద్రోహ శక్తులపై వ్యవహరించినట్లు పోలీసులు దురుసుగా ప్రవర్తించడం దారుణం.
ఈ అరెస్టులను ఖండించాలని మేధావులు, ప్రజాతంత్రవాదులను, పౌర సమాజాన్ని సిపిఐ(యం) కోరుతున్నది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా ప్రజాస్వామ్యయుతంగా పనిచేయడానికి జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి