
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 28 సెప్టెంబర్, 2026.
సచివాలయ ఉద్యోగులపై నిర్బంధం ఆపి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.
అక్రమ సస్పెన్షన్స్ ఎత్తివేయాలి - కేసుల్ని ఉపసంహరించుకోవాలి.
- సిపిఐ(యం)
తమ విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆదివారం నాడు తమ కోర్కెలపై ఛలో విజయవాడకు వస్తున్న, వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని అనుమతించాల్సింది పోయి శాంతియుతంగా ధర్నా చేస్తున వారిని వెంటాడి వేటాడి కొట్టడం, తరమడం, అరెస్టు చేయడం లాంటి బీభత్స చర్యలను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ధర్నాలో పాల్గొన్నారన్న పేరుతో సస్పెన్షన్స్ చేస్తున్నారు. బెదిరిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం పట్ల వారిలో వ్యతిరేకత, ఆగ్రహం పెరగడం తప్ప సాధించేందేమీ ఉండదు. ఈపాటికే చర్చలు చేసి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించడమేకాక కక్షతో వ్యవహరించింది. ఇప్పటికైనా కళ్లుతెరిచి సంఘ నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయసమ్మతమైన సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కేడర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తూ జివోని ఎట్టకేలకు జారీ చేసింది. మంచిదే. కానీ ఇతర సమస్యలేవీ పరిష్కరించలేదు. వాటన్నిటినీ వెంటనే సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి పరిష్కరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది
గత ప్రభుత్వంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన నుండి నేటి వరకు ప్రభుత్వాలు వారి సమస్యలు పరిష్కారం ఎడల నిర్లక్ష్యం చూపడంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పించాయి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం నిర్వహించే చలో విజయవాడ శాంతియుత నిరసన కార్యక్రమం అనుమతి కొరకు 10 రోజుల ముందే దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ పోలీసు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు ఒక్కసారిగా ధర్నాచౌక్ చేరుకొని నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఉద్యోగులను బలవంతగా ఈడ్చిపడేసి అరెస్ట్ చేయడం, మహిళా ఉద్యోగులని చూడకుండా లాగి కొట్టి జీపుల్లో ఎక్కించడం దుర్మార్గం.
తమ డిమాండ్ల సాధన కోరకు పోరాడే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులపై విధించిన సస్పెన్స్ ను ఎత్తివేయాలని, చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై కేసులు పెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని,సమస్యల పరిష్కారం కొరకు చొరవ చూపాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
