
ఈరోజు (27 సెప్టెంబర్) వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రిస్తున్న మోడీ, అమిత్‌షా
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
సిఈసి జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాలి
బిజెపి తీరు దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిదికాదు
ఎన్నికల కమిషన్ చెప్పాల్సిన సమాధానాన్ని బిజెపి చెబుతోంది
టిడిపి సమర్థించడం సరికాదు
ప్రధాని మోడీ, హోమ్‌శాఖ మంత్రి అమిత్‌షా రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రిస్తున్నారని, సిఈసి జ్ఞానేష్‌కుమార్ వారి కనుసన్నల్లో పనిచేసి 13 కోట్ల మంది ఓట్లను తొలగించారని, ఇది ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిది కాదని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిఈసిని తొలగించాలని, ఎసఐఆర్ ప్రక్రియను నిలిపేయాలని, ఓటర్ల జాబితా నుండి అన్యాయంగా తొలగించిన వారి ఓట్లను పునరుద్దరించాలని, ఎన్నికల కమిషనర్ల నియామక వ్యవస్థలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సభ్యుడిగా చేర్చాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఎంబివికెలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టు చేసిన కృషి వల్ల ఎన్నికల కమిషన్లో జరుగుతున్న అక్రమాలు బయటకు వచ్చాయన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలిసిన తరువాత బిజెపి నాయకత్వం తప్పేమి జరగలేదన్నట్లు ప్రకటనలు చేసిందని, ఎన్నికల కమిషన్ నోరెత్తడం లేదని తెలిపారు. ఎన్నికల్లో పారదర్శకత లేదన్నారు. ఈసిఐనెట్‌ను ఢిల్లీలో కేంద్రీకరించారని విమర్శించారు. ఓటర్ల లిస్టులో అక్షర దోషాలకు అసలు కారకులు అధికారులేనని, వారిని జైల్లో పెట్టాలన్నారు. ఎన్నికల కమిషనర్ ఎన్నిక ప్రక్రియలోకి సిజెఐని తీసుకుని కొత్త కమిటీని వారి అధ్యక్షతన ఏర్పాటు చేయాలని, దేశ వ్యాప్తంగా తొలగించిన 13 కోట్ల ఓట్లను చేర్చాలని డిమాండు చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రకటనను ఆహ్వానిస్తున్నామని, టిడిపి సమర్థించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. నిజాయితీగా ఉంటాడనుకున్న లావు శ్రీకృష్ణ దేవరాయులు కూడా దీనిపై అసంబద్ధ ప్రకటన చేశారని అన్నారు.
కేంద్ర మాజీమంత్రి కాంగ్రెస్ నాయకులు జెడి శీలం మాట్లాడుతూ జ్క్షానేష్‌కుమార్ నియామకం మొత్తం అక్రమమార్గాల్లో సాగిందని తెలిపారు. మోడీ, అమిత్‌షా చెప్పినట్లు వినేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేసి అతన్ని నియమించారని, రామమందిరంలో అవినీతికి పాల్పడిన కమిటీని కూడా ఇతనే నియమించారని తెలిపారు. ఆరఎసఎస్, బిజెపి చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని కోరారు. వెంటనే జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాలని, దీనికోసం జరిగే కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో నామినేషన్లు ఆన్‌లైన్లో దాఖలు చేసే విధంగానూ అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరతామన్నారు.
మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ సిఈసిని తక్షణమే తొలగించాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియను గుప్పిట్లో పెట్టుకుని వారికి కావాల్సిన అధికారాన్ని నిలబెట్టకునేందుకు వీలుగా మోడీ, అమిత్‌షా కీలుబొమ్మ సిఈసిని తెచ్చి పెట్టి ఏకపక్షంగా చేసుకుపోయారని అన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏ మాత్రమూ శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. ఇదే పద్ధతి అనుసరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం బతకదని తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి విచారించాలని కోరారు.
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ దేశంలో జరిగిన ఎన్నికల తీరుపై అనేక అనుమానాలు వస్తున్నాయని, ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. వ్యవస్థల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రజలను చైతన్యం చేయాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే వైసిపి నాయకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ ఎసఐఆర్‌లో జరిగిన ఓట్ల తొలగింపు ప్రకియపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 32 లక్షల మందికి ఓటు హక్కు లేకుండా చేసి ఎన్నికలకు వెళ్లడం సరికాదని తెలిపారు. దీనికోసం జరిగే ఆందోళనల్లో వైసిపి కలిసి వస్తుందని తెలిపారు.
ఓటు పరిరక్షణ వేదిక కన్వీనర్ సుంకర రాజేంద్రప్రసాదు మాట్లాడుతూ కేంద్రం రాజ్యాంగ వ్యవస్థలను ముఖ్యంగా ఎన్నికలు, న్యాయ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుంటోందని విమర్శించారు. జ్ఞానేశ్వర్‌కుమార్‌పై అనేక విమర్శలు ఉన్నాయని, నోయిడాలో కార్మికులను బలవంతంగా అరెస్టు చేయించింది కలెక్టర్‌గా ఉన్న జ్ఞానేశ్వర్ కుమార్తె అని తెలిపారు. అన్ని వ్యవస్థల్లో బిజెపి ఎజెండాను అమలు చేస్తే అవన్నీ దెబ్బతింటాయని, ప్రజలకు న్యాయం దక్కదని, కీలకమైన ఎన్నికల ప్రక్రియ నిరుపయోగంగా మారుతుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని కోరారు.
మాజీ ఐఎఎస్ అధికారి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్లో మెజార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన అంశాలపై అన్ని పక్షాలూ కలిసి నిలదీయబట్టే అసలు విషయం బయటకు వచ్చిందని, దాన్ని చట్టపరంగానూ నిరూపించి అతనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సిఈసిపై చర్యలు లేకుండా కొత్తచట్టంలో సవరణలు చేశారని, ఇది ప్రమాదకరమని తెలిపారు. ఈఆరఓ, ఈసిఐ నెట్ల మీద ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని కోరారు. రికార్డులన్నీ భద్రపరచాలని, ముఖ్యంగా సిఈసిలు అభ్యంతరం వ్యక్తం చేసిన 14 అంశాలకు సంబంధించిన ఫైల్స్‌కు రక్షణ కల్పించాలని, సుప్రీం కోర్టు దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిఎసఆర్‌కెఆర్ విజయకుమార్ మాట్లాడుతూ ఇప్పుడు దేశంలో ఉన్న నియంత పాలకులు వ్యవస్థలను, మీడియాను నియంత్రిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు అసలు విషయాలు తెలియకుండా వారు చెప్పదలుచుకున్నదే ప్రచారంలో ఉండేలా చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరించడం అంగీకరించదగిన విషయం కాదన్నారు.
జనచైతన్య వేదిక నాయకులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసేందుకే బిజెపి పనిచేస్తోందని విమర్శించారు.
విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ అస్సాంలో అక్రమ చొరబాటుదారులని తేల్చినవారిలో ఒక్కరిపైనా చర్య తీసుకోలేదని, ఇటువంటి చర్యలన్నీ ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి ఆడుతున్న నాటకం తప్ప మరొకటి కాదని తెలిపారు.
సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు హరినాథ్ మాట్లాడుతూ కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోతే భవిష్యత్ తరాలకు న్యాయం జరగదని అన్నారు. సిపిఐఎంఎల్ న్యూడెమెక్రసీ నాయకులు పి.పొలారి, ఎం.రామకృష్ణ మాట్లాడుతూ సిఈసి విషయంలో లోతుగా పరిశీలిస్తే ప్రజాస్వామ్యంపై ఏకపక్షదాడి జరిగిందనేది స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
సామాజికవేత్త కుర్రా వసుంధర మాట్లాడుతూ సిఈసిని పునర్నిర్మించాలని అన్నారు. అక్రమాలను వెలికితీసి రితికా, దామినానాథ్‌ను అభినందనీయులని పేర్కొన్నారు.
ఎంసిపిఐ నాయకులు ఖాదర్‌భాషా, ఎస్‌యుసిఐసి నాయకులు సుధీర్ మాట్లాడుతూ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ఎన్నికల వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు మోడీ, అమిత్‌షా చేస్తున్న కుట్రలపై దేశవ్యాప్త ఆందోళన జరపాలని కోరారు. 28వ తేదీన అక్టోబరు 2వ తేదీన జరిగే నిరసనలు, ఆందోళనల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలందరూ ఏకగ్రీవంగా ప్రకటించారు
