
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 సెప్టెంబర్, 2026.
రాజధాని అమరావతి రైతుల
న్యాయబద్దమైన కోర్కెలను జాప్యం లేకుండా పరిష్కరించాలి
-సిపిఐ(యం)
ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని అమరావతి రైతులు లేవనెత్తుతున్న న్యాయమైన కోర్కెలను సత్వరమే పరిష్కరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. రాజధాని కొరకు భూములు సమీకరించి 12 సంవత్సరాల గడిచినా, చట్టబద్ధంగా నెరవేర్చాల్సిన అంశాలను ఇంకా పరిష్కరించకుండా కాలయాపన చేయటం ప్రభుత్వానికి తగదు.
పూలింగ్ నుండి గ్రామ కంఠాల మినహాయింపు, సమంజసమైన నష్టపరిహారం చెల్లింపు, రైతుల ప్లాట్లలో నిర్మాణాలకు నిబంధనల సడలింపు తదితర అనేక అంశాలు పరిష్కరించకుండా ప్రభుత్వం, సిఆర్‌డిఏ కాలయాపన చేయటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల గోడు వినకుండా పెడ చెవిన పెట్టడం సరికాదు. బడా సంస్థలకు, కాంట్రాక్టర్లకు ఉదారంగా భూములు ఇస్తూ, రాయితీలు ప్రకటిస్తూ, నిబంధనలు సడలిస్తున్న పాలకులు అమరావతి రైతులు, ప్రజలకు చట్టబద్ధంగా నెరవేర్చాల్సిన అంశాలను పట్టించుకోకపోవడం శోచనీయం.
రాజధాని అసైన్డ్ భూములు గ్రామకంఠాలు తదితర విషయాలలో అవినీతి, అక్రమాలు, పక్షపాత వైఖరి చోటుచేసుకుంటున్నాయని రైతులు చేస్తున్న విమర్శలపై ప్రభుత్వం స్పందించాలి. స్వతంత్ర విచారణ జరిపించాలి. రైతులతో చర్చలు జరపాలి. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అమరావతి రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి జరిగే ఆందోళనకు సిపిఐ(యం) మద్దతు ఇస్తుంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
