ఆదివాసీ మహిళ పాంగి లావణ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణం 25 లక్షల నష్టపరిహారం అందించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 సెప్టెంబర్, 2026.
ఆదివాసీ మహిళ పాంగి లావణ్య కుటుంబానికి
ప్రభుత్వం తక్షణం 25 లక్షల నష్టపరిహారం అందించాలి.
ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణం. -సిపిఐ(యం)

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం గ్రామానికి చెందిన 28 ఏళ్ల ఆదివాసీ మహిళ పాంగి లావణ్య రవాణా సౌకర్యం లేక ప్రసవ వేదనతో మరణించడంపై సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆమె మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి.
పాంగి లావణ్య గురువారం రాత్రి ప్రసవం తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఈ పరిస్థితిలో గ్రామస్తులు ఆమెను దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని (పిహెచ్‌సి)కి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ తుఫాన్‌కు ముందే మైదాన ప్రాంతంతో కలిపే వంతెన కొట్టుకుపోవడంతో ఆస్పత్రికి తరలించలేకపోయారు. వంతెన మరమ్మత్తులకు ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదు. భారీ వర్షాలు, రోడ్ల పరిస్థితి కారణంగా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో వైద్య సహాయం అందక పాంగి లావణ్య మరణించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
మృతి చెందిన పాంగి లావణ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణం రూ.25లక్షలు నష్టపరిహారం అందించాలి. పుట్టిన శిశువుకు పాలు, పోషకాహారం, వైద్యసహాయం తదితర అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేయాలి. ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా గిరిజన ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు, ఆరోగ్య సేవలు బలోపేతం చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి