కమ్యూనిస్టులపై బిజెపి తప్పుడు ప్రచారం వామపక్ష పార్టీల ఖండన

వామపక్ష పార్టీలు
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 సెప్టెంబర్, 2026.
కమ్యూనిస్టులపై బిజెపి తప్పుడు ప్రచారం
వామపక్ష పార్టీల ఖండన

కమ్యూనిస్టులపై బిజెపి నాయకుల అసత్య, ఆరోపణలను, అబద్దపు, వాగాడంబర ప్రచారాలను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
విజయవాడలో బిజెపి రాష్ట్ర కమిటీ ప్రచురించిన “జాతీయ భావం కొరవడిన కమ్యూనిస్టులు” అనే పుస్తకావిష్కరణ సభలో జాతీయ ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర గురించి బిజెపి, ఆరఎసఎస్ నాయకులు చేసిన ఉపన్యాసం వక్రీకరణలు, తీవ్రమైన అసత్యాలు, అబద్ధాలతో కూడిన తప్పుడు ప్రచారాలను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీషు వాళ్ళ కొమ్ముకాచి వెన్నుపోటు పొడిచిన బిజెపి, ఆరఎసఎస్‌ల అసలు బండారాన్ని దాచిపెట్టి కమ్యూనిస్టులపై నిందలు మోపడం సూర్యుడిపై ఉమ్మివేయడమే. జెన్-జెడ్ యువతరంలో వస్తున్న మార్పును తట్టుకోలేని బిజెపి మరోసారి కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నది.
కమ్యూనిస్టు పార్టీ ప్రారంభం నుండి జాతీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లింది. కాంగ్రెస్‌తో కలిసి, విడిగాను పోరాడింది. త్యాగాలు చేసింది. బ్రిటీషు పాలకుల కుట్ర కేసులు ఎదుర్కొంది. గ్రామీణ పేదలు, పట్టణ కార్మికవర్గ విముక్తికి సామాజిక, లింగ వివక్షలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి పోయాయి. దున్నేవానికి భూమి కావాలనే పోరాటంలో వేలమంది ప్రాణాలు బలి తీసుకున్న నాటి సంస్థానాధీశులు, జమిందారులు, భూస్వామ్య శక్తుల పంచన చేరిన జనసంఘ్ వారసులు ఆనాటి నుండి ఈనాటి వరకు పాడిందే పాడుతూ చరిత్రను వక్రీకరించాలని చూస్తున్నారు.
రోజూ నెహ్రూను తిట్టిపోస్తూ, ఇప్పుడు తమ ద్రోహాన్ని కప్పెట్టుకోడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నెహ్రూ సోషలిజానికి, గాంధీ జాతీయ భావానికి ప్రతినిధిగా చెప్పుకున్నారు. మరి అటువంటి గాంధీని హత్య చేసింది ఎవరో ఆయన చెప్పలేదు. స్వాతంత్రోద్యమంలో ఎలాంటి పాత్రలేని వీరు జాతీయ ఉద్యమం గురించి, జాతీయత గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమే. కులవివక్ష, మనుధర్మ సిద్ధాంతం, భూస్వామ్య దోపిడి వ్యవస్థతో తరాలుగా అణచబడిన అట్టడుగు వర్గాలకోసం కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాల ఫలితమే నేడు పాలక పార్టీలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.
ఇన్నాళ్లుగా బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రచారం చేసుకున్న నకిలీ దేశభక్తి, రామభక్తి, నైతిక విలువల అసలు బండారం ఒక్కొక్కటిగా బయటపడుతుండంతో బెంబేలెత్తిపోయి కమ్యూనిస్టులపై పాత నిందలను కొత్త గొంతులతో వినిపిస్తున్నారు. శ్రీరాముని పేరు చెప్పి ఓట్లు దండుకొని అయోధ్య రామాలయాన్నే కొల్లగొట్టిన బిజెపి ద్రోహాన్ని ప్రజలు విస్మరించరని హెచ్చరిస్తున్నాము. ప్రజల విశ్వాసాన్ని పోగోట్టుకున్న బిజెపి తిరిగి అక్రమ పద్దతిలో అధికారానికి రావాలని చూస్తున్నది. సర్ పేరుతో ఓట్లు తొలగించిన బిజెపి కుట్ర బట్టబయలైంది. ఇలాంటి పార్టీ కమ్యూనిస్టులపై నిందలు వేస్తే ప్రజలు సహించరని హెచ్చరిస్తున్నాము.

(వి.శ్రీనివాసరావు)
సిపిఐ(యం)                                  

(జి.ఈశ్వరయ్య)
సిపిఐ    

 (పి.ప్రసాద్)
  సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ

(బి.బంగార్రావు)                                                    
సిపిఐ(యంఎల్) లిబరేషన్                                        

(కాటం నాగభూషణం)
యంసిపిఐ(యు)

(జాస్తి కిషోర్‌బాబు)    
సిపిఐ(యంఎల్)  

(యం.రామకృష్ణ)              
సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ
   
(పి.వి.సుందరరామరాజు)
  ఫార్వర్డ్‌బ్లాక్    

(జానకి రాములు)
రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ

 

--