స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి వారి ఆందోళనకు సిపిఐ(యం) మద్దతు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
 విజయవాడ,
తేది : 26 సెప్టెంబర్, 2026.
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల  సమస్యలు వెంటనే పరిష్కరించాలి
వారి ఆందోళనకు సిపిఐ(యం) మద్దతు
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ఉద్యోగుల సంఘ నాయకులతో చర్చించి  వెంటనే పరిష్కరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
నోషనల్ ఇంక్రిమెంట్స్ వెంటనే మంజూరు చేయాలని, ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలు చేయాలని, ప్రమోషనల్ చానల్ కల్పించాలని, నష్టదాయకమైన జివో నెం.11ను రద్దు చేయాలని, ప్రొబేషన్ ఆలస్యమైన 9 నెలలకు ఎరియర్స్ చెల్లించాలని మరియు ఇతర సమస్యలపై ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నది. క్షేత్రస్థాయి ప్రజల సమస్యల పరిష్కారంలో, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న సచివాలయ ఉద్యోగుల ఆందోళన న్యాయసమ్మతమైంది. సుధీర్ఘకాలంగా వారెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నది. వివిధ కేడర్‌లకు ప్రమోషన్ అవకాశాలు కల్పించలేదు. ప్రొబేషన్ కాలానికి సంబంధించిన రెండు ఇంక్రిమెంట్‌లను ఇవ్వలేదు. రకరకాల యాప్‌ల వర్క్‌లతో సచివాలయ ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా స్థాయిలో హెల్త్, గ్రామ సచివాలయ శాఖ అధికారుల మధ్య సమన్వయలోపం వలన హెల్త్ సెక్రటరీలపై తీవ్ర ఒత్తిడి పడుతున్నది. పని ఒత్తిడితో ఇటీవల కాలంలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల పరిష్కారానికి సంఘ నాయకులతో చర్చించి పరిష్కరించాలని, తద్వారా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని సిపిఐ(యం) కోరుతున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి