తుఫాన్‌తో నష్టపోయిన ఉత్తరాంధ్ర రైతులను ఆదుకోవాలి. ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 సెప్టెంబర్, 2026.
తుఫాన్‌తో నష్టపోయిన ఉత్తరాంధ్ర రైతులను ఆదుకోవాలి.
ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలి.
బాధితులందరికీ ఉచిత రేషన్ ఇవ్వాలి.
కూలీల కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలి.
-సిపిఐ(యం)
గడిచిన మూడు, నాలుగు రోజులుగా వాయుగుండం ప్రభావంతో వచ్చిన తుఫాన్ ఉత్తరాంధ్ర జిల్లాల రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలలో వందలాది గ్రామాలలో వేలాది ఎకరాలలో రైతులు వేసిన వరి, పత్తి, మిర్చి, అరటి, బొప్పాయి వంటి పంటలు చేతికి వచ్చే దశలో నీటిపాలు అయ్యాయి. పేదలు ఉపాధి కోల్పోయారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ఆదివాసీ రైతులను ఆదుకోవాలని ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. పేదలు కోలుకునేదాకా నిత్యావసరాలతో రేషన్, కూలీలకు రూ.10వేలు ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నది. అసలే కరువుతో అల్లాడుతున్న ప్రజలపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా తుఫాను వచ్చి పడింది. అందువల్ల యుద్ధ ప్రాతిపదికపై తుఫాను బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవాలి.
తుఫాను తీరం దాటినా మూడు రోజులుగా ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నాగావళి, జంఝావతి, స్వర్ణముఖి, వేగావతి నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో నదీతీర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న పంటలు ఈ తుఫాన్‌తో వచ్చిన వర్షాలతో చేతికొచ్చే దశలో పంటలు దెబ్బ తినడంతో రైతాంగం తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లా 28 మండలాల్లో 382 గ్రామాల్లో సుమారు 30వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పాలకొండ, బూర్జ, లావేరు మండలాల్లోని అనేక గ్రామాలలో రైతులు వేసిన పంటలన్నీ పూర్తిగా నీటమునిగి దెబ్బతిన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో రోడ్లు దెబ్బ తినడంతో 40 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి.
తోటపల్లి, జంఝావతి, మడ్డువలస ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి పెడుతున్నారు. దీంతో నదీతీర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నాగావళి ఉధృతివల్ల పలు గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఎగువన ఉన్న చత్తీస్‌ఘడ్, ఒడిశా నుండి వస్తున్న వరద నీటితో తుఫాను కారణంగా విజయనగరం జిల్లాలో పంటనష్టం జరిగింది. రాజోలి మండలంలో సుమారు 200 ఎకరాలు అరటి, పత్తి, మొక్కజొన్న పాడైంది. సోసేరు గ్రామానికి చెందిన రైతు 15 ఎకరాల్లో పంట దశకు వచ్చింది. తుఫానుతో నేలమట్టం అయ్యి లక్షల రూపాయల పెట్టుబడిపోయింది. నెల్లిమర్ల మండలంలో 120 ఎకరాల పత్తి, 15 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. చిపురుపల్లి మండలంలో 100 ఎకరాలకు పైన పత్తి, బొప్పాయి, మొక్కజొన్న నేలకొరిగి లక్షల్లో పంట నష్టం వాటిల్లింది.
పోలవరం జిల్లాలోని చింతూరు డివిజన్ పరిధిలో శబరినది ఒక్కసారిగా పోటెత్తడంతో చింతూరు మండలం కుయిగూరు, సోకిలేరు, జల్లివారి గూడెంలలో వరదనీరు గ్రామాల్లో ప్రవేశించింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌వద్ద శుక్రవారం సాయంత్రానికి 4లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రికార్డు అయింది. దీంతో కోనసీమ లంక గ్రామాల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలన్నింటినీ గుర్తించి ఎకరాకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి