
విలేకర్ల సమావేశం - 24 సెప్టెంబర్, 2026 - విజయవాడ (బాలోత్సవ భవనం)
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాల ప్రకటన చేయాలి.
కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి. లక్ష కోట్లు విడుదల చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులను నిర్థిష్టంగా పరిశీలించాలి.
మండలం, గ్రామం యూనిట్‌గా కరువును గుర్తించాలి.
కరువు సహాయక చర్యలకు నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టాలి.
పంటలు వేసి నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.40,000లు, ఏపంట వేయని రైతులకు ఎకరాకు రూ.15,000లు నష్టపరిహారం ఇవ్వాలి. మేత సరఫరా చేయాలి.
గ్రామాలలో అడిగిన వారందరికీ ఉపాధి చూపాలి, రోజుకూలీ రూ.600లు ఇవ్వాలి.
పట్టణ ఉపాధిహామీ పథకం అమలు చేయాలి. ఉపాధి పధకంలో అవినీతిని అరికట్టాలి.
భూమిలేని పేదలకు, పేద రైతులు, కౌలు రైతులకు
సంవత్సరం పాటు చౌకడిపోల ద్వారా 16 రకాల నిత్యావసర సరుకులు కరువుభత్యంగా ఇవ్వాలి.
ఇన్‌పుట్ సబ్సిడీ, రైతులు, కౌలు రైతులకు పంట నష్టపరిహారం, రైతుల రుణమాఫీ, అన్ని పంటలకు బీమా అమలు, త్రాగునీరు, ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్‌ప్లాన్ అమలు చేయాలి. ఎరువుల యాప్‌ను మార్చాలి. లేదా రద్దుచేయాలి.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుండి 24 వరకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం, మూలం రమేష్, కె.ప్రభాకరరెడ్డి, వి.రాంభూపాల్, రాష్ట్ర నాయకులు వి.క్రిష్ణయ్య, దడాల సుబ్బారావు, ఎం.హరిబాబు, కె.ఆంజనేయులు, వి.వెంకటేశ్వర్లు, ఎం.సూర్యనారాయణ, వి.శివనాగరాణి తదితర నాయకులు మూడు బృందాలుగా రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం, పల్నాడు, కృష్ణా, ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, ఎఎసఆర్ తదితర 12 జిల్లాలలో 60కి పైగా మండలాలు, 200 గ్రామాలలో ప్రత్యక్షంగా కరువు పరిస్థితులను సిపిఎం రాష్ట్ర బృందం పరిశీలించింది.
రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, గ్రామీణ పేదలు కరువు కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నాము.
ఈ పర్యటనలో కరువు తీవ్రతను రైతులు, కౌలు రైతులు దుఃఖం, ఆందోళన, ఆగ్రహంతో సిపిఎం బృందాలకు వివరించారు. గడచిన 30 ఏళ్లలో ఇలాంటి కరువు పరిస్థితులను తాము చూడలేదని, వేల ఎకరాలు ఉన్న తమ గ్రామాలలో ఒక్క ఎకరా కూడా విత్తనం పడలేదని, ఎప్పుడూ ఎండిపోని చెరువులు కూడా ఈ కరువులో ఎండిపోయాయని, మనుషులకే కాదు పశువులకు కూడా తాగునీరు సమస్యగా ఉందని, పశువులు, గొర్రెలు, మేకలు వంటి జీవాలకు మేత తీవ్రమైన సమస్యగా ఉందని సిపిఎం బృందాలకు తమ ఆవేదనను చెప్పుకున్నారు. ఖరీఫ్ ప్రారంభమై 3 నెలలు కావస్తున్నా వర్షాలు లేక దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, ఎలా జీవించాలో అర్థం కావడం లేదని, భవిష్యత్తు ఊహించుకుంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి విపత్తులో కూడా నేటికి ఒక్క ప్రజాప్రతినిధి, అధికారులు వచ్చి మా బాధలు వినలేదు. కనీసం ఓదార్చనూలేదు.
ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో కృష్ణ డెల్టాలో వేసిన వరితోపాటు ఇతర ప్రాంతాల్లో బోర్లకింద వేసిన మిర్చి, పత్తి, కూరగాయలు తదితర పంటలు ఎండిపోతున్నాయి. ఉన్న వాటిని కాపాడుకునేందుకు వారానికి ఒకసారి ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని తోడి పోయాల్సి వస్తుందని ఆయిల్ ఇంజన్లకు సబ్సిడీతో డీజిల్, పెట్రోల్ అందించాలని కోరారు.
కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలందకొండ గ్రామంలో 300 ఎకరాల్లో ఉన్న చెరువు పూర్తిగా ఎండిపోయిందని, తాగేందుకు చుక్క నీరు కూడా చెరువులో లేదని సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువ ద్వారా చెరువుకు నీళ్లు నింపమని కోరినా అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో పత్తి 6.50 లక్షల ఎకరాలకు పైగా సాగుచేశామని, ఎకరాకు 25 వేలు నుండి 30వేలు ఖర్చు పెట్టామని, వర్షాభావంవల్ల పత్తి పంట గిటకబారిపోయి సగటున ఎకరాకు 12 క్వింటాళ్లు రావాల్సిన పత్తి ఒకటి, రెండు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉల్లి సాగు అయ్యే కర్నూలు జిల్లాలో ఎకరాకు 50 వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పెట్టామని, మార్కెట్‌లో మంచి ధర ఉన్నా దిగుబడి లేకపోవడం వల్ల 20 వేలకు మించి తమకు గిట్టుబాటు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోడుమూరు మండలం వెంకటగిరి అనే ఒక్క గ్రామంలోనే 1600 ఎకరాలు ఉల్లి వేశామని ఒక్కకిలో ఉల్లిపాయలు కూడా చేతికి రాలేదని ఒక్కొక్క రైతు 4లక్షల నుండి 10 లక్షల వరకు పెట్టుబడి నష్టపోయామని, ఉల్లి, పత్తి, ఆముదం, వేరుశనగ, కొర్ర, మిర్చి వంటి అన్ని పంటలు కరువు కారణంగా తీవ్రంగా నష్టపోయామని తమ ఆవేదన చెందారు.
నంద్యాల జిల్లాలో తెలుగు గంగ కే.సీ. కెనాల్, ఎస్. ఆర్.బి.సి వంటి కాలువలు ఉన్నా సాగునీరు ఇవ్వకపోవడంతో విస్తారమైన ప్రాంతంలో వరిసాగు చేయలేకపోయామని, బోర్లకింద వేసిన మొక్కజొన్న మెట్ట భూముల్లో వేసిన పత్తి, ఆముదం వంటి పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదని ఎకరాకు సగటున 30వేల నుండి 50 వేలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ భూములు సాగు చేసినవారు కానీ, ప్రైవేట్ భూయజమానుల దగ్గర భూములు తీసుకున్న కౌలు రైతులు కానీ ముందస్తు కౌలు ఎకరాకు 20వేలకు పైగా చెల్లించి పంటలకు కొరకు మరో 20వేలకు పైగా పెట్టుబడి పెట్టినా ఒక్క రూపాయి కూడా తిరిగి ఆదాయం పొందలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని కౌలు రైతులు సిపిఎం బృందాలు తమ ఆవేదన చెప్పుకున్నారు.
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో బోర్ల కింద సాగు చేసిన చీని, బత్తాయి, నారింజ వంటి పంటలు 10 నుండి 15 సంవత్సరాలుగా లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పెంచి పోషించిన చీని, దానిమ్మచెట్లు బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో నిట్ట నిలువునా ఎండిపోయాయని, కన్నబిడ్డల్లాగా వాటిని సాకేమని, ఏమి చేయాలో దిక్కు తోచడం లేదని బోరున విలపిస్తూ రైతులు సిపిఎం బృందానికి మమ్మల్ని ఆదుకునేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని విన్నవించారు. హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులకు నీళ్లు నింపకపోవడంతో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఉన్న బోర్లలో నీటిమట్టాలు తగ్గిపోయి అన్ని పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వేసిన పత్తి, వేరుశనగ, ఆముదం, మిర్చి తదితర వ్యాపార పంటలు, ఇప్పటికే సాగుచేసిన ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం బృందం దృష్టికి తీసుకువచ్చారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి, మర్రిపాడు వంటి నాన్ డెల్టా ప్రాంతంలో వర్షాలు లేక పంటలు సాగు చేయలేకపోయామని, కొందరైతే అప్పుడప్పుడు కురిసిన కొద్దిపాటి వర్షాలకు ఆశతో పంటలు వేసినా, ఏ ఒక్కపంట చేతికి రావటం లేదని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, త్రాగునీరు కూడా సమస్యగా ఉందని విన్నవించారు. సోమశిల ప్రాజెక్టుకు నిధులు ¹కేటాయించాలి. యాప్రాన్ వంటి పనులు, మరమ్మత్తుల పనులు చేపట్టాలి.
ప్రకాశం, మార్కాపురం, బాపట్ల జిల్లాలలో దుర్భిక్షం తాండవిస్తుంది.
బాపట్ల జిల్లా కొలలపూడి, బోడవాడ, భట్టిప్రోలు తదితర గ్రామాలలో పార్టీ దళం పర్యటించింది. క్రృష్ణా డెల్టా కింద ప్రభుత్వం ముందుగా నీళ్లు ఇస్తామని చెప్పటంతో తొందరపడి పంటలు వేశామని వేసిన పంటలు మొత్తం నీరులేక ఎండిపోతున్నాయి.
జిల్లాలో 20 మండలాలు ఉంటే 12 మండలాలు తీవ్ర కరువులో ఉన్నాయని మిగిలిన మండలాల్లో నీటి ఎద్దడి ఉందని ఆయిల్ ఇంజిన్లు వాడుకుని పంటను బ్రతికించుకుంటున్నామన్నారు.
ప్రకాశం జిల్లాలో ఖరీఫ్‌లో 1,40,000 ఎకరాల భూమి సాగు చేయాల్సి ఉండగా కేవలం 26,000 ఎకరాల్లోనే సాగు అయింది. ఈ ప్రాంతంలో 64 వేల ఎకరాలు కంది వేయాల్సి ఉండగా కేవలం 2,000 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. ఆ కంది పంట కూడా ఎండిపోయింది. జూట్ మొలకలు చచ్చిపోయాయి. కోటపాడులో 30బోర్లు ఉండగా భూగర్భ జలాలు అడుగంటి కూరగాయ పంటలు వేసిన రైతులకు దిగుబడి లేకుండా పోయిందని రైతులు తెలిపారు. వేంపాడు, శంకరాపురం మరియు వేంపాడు తఇతర ప్రాంతాల్లో వేసిన మిర్చి ఎండి పోవడంతో పీకేసి మరలా ఈ వర్షాలకు మొక్కలు వేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
అన్ని పంటలకు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయామని రైతులు చెప్పారు. ఒక్క మొక్కజొన్న పంటకు మద్దతు ధర లేక రైతులు ఒక ఎకరానికే 30 నుండి 40 వేల రూపాయలు నష్టపోయామని తెలిపారు.
కూరగాయలు అమ్ముకోవడానికి మార్కెట్లో నాలుగు శాతం వసూలు చేయాల్సి ఉండగా 8 నుండి 10% వసూలు చేస్తున్నారని అన్నారు.
ఎరువుల యాప్ వల్ల ఆర ఎకరా ఉన్న వాళ్లకి కూరగాయలు వేసుకున్న రైతులకి ఎరువులు సక్రమంగా అందడంలేదు. అసైన్డ్ భూములు డికెటి పట్టా, ఇతర ప్రభుత్వం భూములకు ఎరువులు ఇవ్వటం లేదని చెప్పారు.
కౌలు రైతులు పెట్టుబడికి ప్రైవేటు అప్పులతో అధిక దోపిడీకి గురవుతున్నారు. మెట్ట పంటలకు రైతులు కోరిన విత్తనాలు కాకుండా ప్రభుత్వం వారివద్ద వున్న వాటిని తీసుకోవాలని చెపుతున్నారని చెప్పారు.
వరిగడ్డి ఒక కట్ట రూ.80 ఉండేది నేడు రూ.220 నుంచి 270లకు కొనుగోలు చేస్తున్నామన్నారు. మేతలేక పశవులు జీవాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు.
ఒకవైపు కరువు ఉంటే మరోవైపు ప్రభుత్వం రీసర్వే పేరిట రైతులకు కొత్త భూ సమస్యలు సృష్టిస్తున్నదని, 22 ఏ పేరుతో రైతుల వారసత్వ భూములను, పేదల సాగులో ఉన్న ప్రభుత్వ భూములు, దేవాలయ భూములను, ఈనాం భూములను నిషేధ జాబితాలో పెట్టి రైతులకు నరకం చూపిస్తున్నదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే నాగార్జునసాగర్ ఆయకట్టు కింద నీళ్లు లేక, వర్షాలు రాక ఏ ఒక్క ఎకరంలో కూడా వరినాట్లు వేయలేదని, వర్షాధార పంటలు అక్కడా, ఇక్కడా వేసినా పెట్టుబడి మొత్తం భూమిలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ మండలం, రొంపిచర్ల మండలం, ముప్పాళ్ళ మండలంలో ......... వేల ఎకరాలలో ఎలాంటి పంటలు వేయలేకపోయామని అక్కడక్కడా వేసినపత్తి ఎకరాకు క్వింటాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని పెట్టుబడి మాత్రం ఎకరాకు 20 నుండి 25 వేలు పెట్టాల్సి వచ్చిందని కౌలు రైతులు దీనికి అదనంగా మరో 20వేలు కౌలు కింద చెల్లించాల్సి వచ్చిందని ఒక మహిళా రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ఒక్క రైతు ఆవేదన కాదని వేలాది మంది రైతులు ఆవేదన ఇదే రకంగా ఉందని తమ బాధను సిపిఎం బృందం ముందు పంచుకున్నారు.
కృష్ణాజిల్లా అవనిగడ్డ డివిజన్ కోడూరు, నాగాయలంక వంటి ఆరు మండలాలలో వరి తప్ప మరేపంట వేయలేని పరిస్థితి ఉన్నదని కానీ సాగునీరు లేక మెజారిటీ భూములలో వరిసాగు చేయలేదని అక్కడక్కడ వాగులలో, కాలువలలో ఉన్న నీళ్ల ఆధారంగా వరి వేసిన రైతులు ఆయిల్ ఇంజన్లు పెట్టి వారానికి ఒకసారి తడి నీళ్లు పెడుతున్నామని, తడికి ఎకరానికి వెయ్యి రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నదని అయినా పంట చేతికి వస్తుందో, రాదో అనే ఆందోళనలో ఉన్నారు. కోడూరు మండలం సాలెం పాలెం అనే గ్రామంలో నాలుగు చెరువులు ఉండగా ఒక్క చెరువులో కూడా చుక్క నీరు లేదని మనుషులకే కాదు, పశువులకు కూడా తాగునీళ్లు సమస్యగా ఉంది. పశువుల మేత ఎలా చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు. రైతులు, పశువులు, గొర్రెలు మేకల పెంపకం దారులు సిపిఎం బృందానికి తమగోడు విన్నవించుకున్నారు.
అనకాపల్లి జిల్లాలో జిల్లా మొత్తం తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఇప్పుడిప్పుడు కురుస్తున్న వర్షాలతో భూములు పచ్చగా కనిపిస్తున్నాయని, కానీ వేసిన ఏపంట చేతికి వచ్చే పరిస్థితి లేదని, ఎకరాకు 30వేల నుండి 40 వేలు పెట్టుబడి పెట్టి ఒక్క రూపాయి కూడా దిగుబడిరాని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు పోలవరం ఎడమ కాలువ నుండి నీళ్లు ఇస్తున్నామని, జలహారతి ఇచ్చారు, కానీ నీళ్లు మాత్రం తమ పొలాలకు రావటం లేదని నీళ్లు ఎక్కడికి వెళ్లాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, కౌలు రైతులు, పాడి రైతులు, ఉపాధి కూలీలు పంటలు లేక, పెట్టిన పెట్టుబడులు భూమిలో కలిసిపోగా పాడి పశువుల పోషణ ఖర్చులు పెరిగిపోయాయని, మరోవైపు పాల దిగుబడి తగ్గి రోజుకు ప్రతి కుటుంబం రూ.200 నుండి 300లు నష్టపోతున్నామని తెలిపారు.
వ్యవసాయ పనులు లేక ఉపాధి పనులైనా పెడితే గ్రామీణ ఉపాధి చట్టం ద్వారా ఎంతో కొంత జీవనం సాగిద్దామని ఆశపడ్డ ఉపాధి కూలీలకు ప్రభుత్వ విధానంతో నిరాశ మిగిలింది. ఎక్కడ ఏ జిల్లాలో, ఏ గ్రామంలోనూ పట్టుమని 100 మంది గ్రామీణ పేదలకు వందరోజులు పని కల్పించిన ఘటన ఏ ఒక్క గ్రామంలోనూ కనిపించలేదు. అదికూడా రూ.100లకు మించి ఇవ్వకడం లేదు. వ్యవసాయ పనులు లేక ఉపాధి పనులు లేక గ్రామాలకు గ్రామాలే సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి. ఎర్రగుడి గ్రామం నుండి 100 మంది పేదలు వలస వెళ్లి కళ్యాణ దుర్గం లో రైల్వే ట్రాక్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నామని. అక్కడ ఎలాంటి వసతి లేదని గుడారాల కింద జీవించాల్సి వస్తోందని తమ ఆవేదన పంచుకున్నారు.
రాష్ట్రంలో ఏర్పడ్డ ఈ దుర్బక్ష పరిస్థితులలో రైతులు, కౌలు రైతులు గ్రామీణ కూలీలు, వృత్తిదారులను ఆదుకునేందుకు తక్షణమే కరువు ప్రాంతాలను ప్రకటించాలి. ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం ఇవ్వాలని, రబీ పంటలు వేసేందుకు మినుములు, పెసలు, పప్పు శనగ, శెనగ, కొర్రలు, జొన్నలు వంటి విత్తనాలు 100% సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలని, మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నాము. పంటల బీమా పరిహారం వెంటనే ఇప్పించేందుకు బీమా కంపెనిలపై వత్తిడి తేవాలని, కౌలు రైతులు ముందస్తుగా చెల్లించిన కౌలు తిరిగి ఇప్పించాలని, రైతులు, కౌలు రైతులకు, పొదుపు గ్రూపులకు బ్యాంకుల రుణాలు మాఫీ చెయాలని త్రాగునీటి సమస్య పరిష్కరించాలని, గ్రామీణ ఉపాధి పనులు పెట్టి వలసలు నివారించాలని, పశువులు, జీవాలకు మేత, దానా కేంద్రాలు పెట్టి ఉచితంగా సరఫరా చేయాలని, సంవత్సరం పాటు తెల్ల కార్డు కలిగి ఉన్నవారందరికి చౌక డిపోల ద్వారా 16 రకాల నిత్యావసర సరుకులు భత్యంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.
మార్కాపురం జిల్లా పామూరు మండలంలో మోపాడు రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయింది. 15,000 ఎకరాలు వరిసాగు నిలిచిపోయింది. మిగిలిన ప్రధాన చెరువులు, వాగులు, వంకలు ఎండిపోయాయి. సగం గ్రామాల్లో ఉపాధి పనులు 100 రోజులు పూర్తయినాయని నిలిపివేశారు. ఎస్సీ,ఎస్టీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పామూరు ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఎన్జీవో కాలనీలలో బోర్లు చెడిపోయాయి. మోపాడు ఎస్టి కాలనీ, తాతాయపల్లి ఎస్టీ కాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఎక్కడా వరిపంట వేయలేదు. కరువు వల్ల కాఫీ, మిరియాల పంట కూడా దెబ్బతినిందని దిగుబడి తగ్గిపోతుందని గిరిజన రైతులు సిపిఎం బృందం దృష్టికి తెచ్చారు. పాడేరు మండలం డోకూలూరు పంచాయతీ పరిధిలో దుమ్ముపుట్టు, వల్లపురం గ్రామాలలో వరినాట్లు వేసిన పొలాలు నీళ్లులేక బీటలు తీశాయి. మత్స్యగెడ్డ, శిల్పగెడ్డలకు లిఫ్ట్‌లు పెడితే ప్రయోజనం ఉంటుందని, హుకుంపేట మండలంలో కొంతిలి, నక్కలపుట్టు, మారెల, తడిగిరి వంటి 8 లిఫ్ట్‌లకు మరమ్మతులు చేస్తే 10వేల ఎకరాలకు నీరు పారుతుందని రైతులు కోరారు. జి.మాడుగుల, అరకు, అనంతగిరి మండలాల్లో 60 నుండి 65శాతం లోటువర్షపాతం ఉందని, పుట్టబయలు గూడెం, ముంచింగు పుట్టు, కొత్తవీధి, పాడేరు, కొయ్యురు తదితర 9 మండలాలలో గత 40/50 సంవత్సరాలలో ఇంతలోటు వర్షపాతం ఎప్పుడు చూడలేదని చెప్పారు. వర్షభావం వల్ల కాఫీ పంట తెగులు సోకి పంట దిగుబడి తగ్గిపోతుందని, 3 లక్షల ఎకరాలలో సాగుచేస్తున్న కాఫీ పంట 2.5లక్షల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అరకు కాఫీకి తానే బ్రాండ్ అంబాజిడర్ అని చెప్పుకొనే ముఖ్యమంత్రి కాఫీ రైతుల గోడు పట్టించుకోవడంలేదని రైతులు వాపోయారు.
కృష్ణా జిల్లా కోడూరు మండలం, 1) సాలెంపాలెం: సాగునీరు లేనందున ఒక్క ఎకరంలో కూడా నాట్లు పడలేదు. తాగునీరు లేదు, నాలుగు చెరువులు ఎండి ఉన్నాయి, పశువులకు తాగునీరు కూడా లేదు. ఉపాధి పనులు 50 రోజులు మించి జరగ లేదు. పశువులకు పశుగ్రాసం కోసం గత సంవత్సరం మిగిలిన వరిగడ్డినే పొదుపుగా వాడుకొంటున్నారు. ఈ స్ధితిలో పశువులు పోషణ చేయాలని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వరినాట్లు వేసిన రైతులు ఆయిల్ ఇంజన్ల ద్వారా అదనపు ఖర్చుచేసి పంటను కాపాడుకొంటున్నారు. ఎకరానికి ఒక తడికి 4,000 చొప్పున ఖర్చు. వారానికోసారి తడి వెయ్యాల్సి వస్తుంది. 2) వేణుగోపాలపురం: సాగు లేదు, చెరువులకు తగిన నీరు అందటం లేదు. కౌలు రైతులు, చిన్న కారు రైతాంగం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక మహిళలకు డ్వాక్రా గ్రూపులు చెల్లించలేకపోతున్నారు. 3) పాలకాయ తిప్ప: తాగునీరు లేక మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న చేతిపంపు దగ్గర నుండి తాగునీరు తెచ్చుకొంటున్నారు. వారి ఇళ్లకుగాని, సాగు భూములకుగాని రిజిస్ట్రేషన్ పట్టాలులేక సంవత్సరాలు తరబడి ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి పనులు లేక, ఆర్థికంగా అప్పుల భారంతో ఉన్నారు. ఉపాధి కోసం గ్రామంలో సగం మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. 4) హంసలదీవి: గ్రామం మొత్తం మత్స్యకార కుటుంబాలు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, వారు నివసిస్తున్న ఇళ్లకు సంవత్సరాల తరబడి పట్టాలు ఇవ్వ లేదు. ఔట్‌ఫాల్ స్లూయిస్‌కు గేట్లు లేనందున సముద్రపు ఉప్పునీరు వరి పొలాల్లోకి ప్రవేశించి ఈ ప్రాంత భూములన్నీ సాగుకు పనికిరాకుండా పోతున్నవి. గత మూడు సంవత్సరాల నుంచి ముంపు ఏర్పడి సాగు చేయని పరిస్థితి. భూములను 22 ఏ నిషేధిత జాబితాలో పెట్టడం జరిగినది. ఉపాధి పనులులేక, వేట కూడా లేని పరిస్థితి ఉంది. 5) రామకృష్ణాపురం: సుమారు 1500 ఎకరాలు నాట్లు పడలేదు, 20 కుటుంబాలు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వలస వెళ్లినారు. ఉపాధి పనులు లేవు, 2000 ఎకరాలు 22 ఏ నిషేధిత జాబితాలో పెట్టడం జరిగినది. తాగునీరు ఇబ్బందిగా ఉంది. ఊటగుండం, బసవానిపాలెం, ఇరాలి గ్రామాలలో ఉపాధి లేక, సాగునీరు లేక, రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మందపాకల పంచాయతీ శివారు చింతకోళ్ల గ్రామంలో తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. గ్రామంలో ఉన్న చెరువు నుండి పైప్‌లైన్ ద్వారా మురికి నీరు వస్తుంది. ఆ గ్రామంలో పశువులన్నీ చెరువులో దిగి బురదమయం చేయటం వలన మురికి నీరు వస్తుందని చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మందపాకల గ్రామంలో కూడా వరి సాగు చేయలేదు. నాగాయలంక మండలం. 1) కమ్మనమోలు 2) భావ దేవరపల్లిలో సగం ఆయకట్టు, 3) బర్రెంకల 4) నాలి 5) దిండి 6) సొర్ల గొంది 7) గణపేశ్వరం 8) గుల్లల మోద 9) పెద కమ్మవారి పాలెం తదితర గ్రామాలలో ఉన్న మొత్తం భూములలో నాట్లు వేయలేదు. కొన్ని గ్రామాలలోని కాలువ ప్రక్కన ఉన్న భూముల వరకు ఆయిల్ ఇంజన్ల ద్వారా అదనపు ఖర్చుచేసి నాట్లు వేశారు. ఆయిల్ ఇంజన్ ద్వారా సంవత్సరానికి ఎకరానికి పదివేల రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది. ఉపాధి పనులులేక అన్ని గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు కూడా లేక ఇబ్బందిగా ఉంది. గొల్లలమోద గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఉపయోగించుకుంటున్న చెరువును రక్షణ శాఖవారు స్వాధీనం చేసుకుని గ్రామ ప్రజలకు తాగునీటి చెరువు లేకుండా చేస్తున్నారు. పశుగ్రాసం కూడా లేదు.
సిపిఐ(ఎం) ప్రధాన డిమాండ్లు
పంటలు వేసి నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.40,000 పంట నష్టపరిహారం ఇవ్వాలి.
పంటలు వేయలేని రైతులకు ఎకరాకు రూ.15,000 పరిహారం ఇవ్వాలి.
ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి.
అన్ని పంటలకు పంటల బీమా అమలు చేసి, బీమా పరిహారం వెంటనే ఇప్పించాలి.
కౌలు రైతులు ముందస్తుగా చెల్లించిన కౌలు మొత్తాన్ని తిరిగి ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
రైతులు, కౌలు రైతులు, పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేయాలి.
రబీ సాగు కోసం మినుములు, పెసలు, శనగ, కొర్ర, జొన్న తదితర విత్తనాలను 100 శాతం సబ్సిడీతో అందించాలి.
అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందేలా ఎరువుల యాప్‌ను మార్చాలి లేదా రద్దు చేయాలి.
గ్రామాల్లో పని కోరిన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించి, రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలి.
పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి. ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టాలి.
భూమిలేని పేదలు, పేద రైతులు, కౌలు రైతులకు సంవత్సరం పాటు చౌకధరల దుకాణాల ద్వారా 8 రకాల నిత్యావసర సరుకులను కరువు భత్యంగా అందించాలి.
గ్రామాల్లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి.
పశువులు, గొర్రెలు, మేకలకు మేత, దాణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా సరఫరా చేయాలి.
ఆయిల్ ఇంజన్ల ద్వారా పంటలను కాపాడుకునే రైతులకు సబ్సిడీపై డీజిల్, పెట్రోల్ అందించాలి.
కరువు కారణంగా ఉపాధి కోల్పోయిన గ్రామీణ పేదలకు ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టి వలసలను నివారించాలి.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలని, కరువు ప్రభావిత రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పాడి రైతులు, వృత్తిదారులు, గ్రామీణ పేదలను ఆదుకోవాలి.
= = = =
