శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి పునరావాసం, పరిహారం కల్పించడం, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, పెళ్లయిన యువతులకు R&R ప్యాకేజీ కల్పించడం - నిర్వాసితులు, ప్రజా ప్రతినిధులపై పోలీసు నిర్బంధం, అడ్డంకులపై చర్యలు తీసుకోవడం

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,
తేది : 23 సెప్టెంబర్, 2026.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
 విషయం: శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి పునరావాసం, పరిహారం కల్పించడం,  18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, పెళ్లయిన యువతులకు R&R ప్యాకేజీ కల్పించడం - నిర్వాసితులు, ప్రజా ప్రతినిధులపై పోలీసు నిర్బంధం, అడ్డంకులపై చర్యలు తీసుకోవడం - తక్షణ జోక్యం కోరుతూ.

శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి మీరు స్వయంగా ప్రారంభించి నీటిని విడుదల చేశారు. మా పార్టీ సహా జిల్లా ప్రజలంతా హర్షించారు. కాని ప్రాజెక్టు కింద నిర్వాసితులకు ఈ ఆనందంలో భాగం దక్కలేదు. నేటికీ బిక్కుబిక్కుమంటూ చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురుగా దీనావస్థితిలో ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల పరిహారం, పునరావాసం, పునరావాస ప్యాకేజీ మరియు జీవనోపాధి రక్షణ కూడా సమాంతరంగా పూర్తిచేయడం జరగలేదు.
ప్రాజెక్టు కోసం తమ భూములు, ఇళ్లు, గ్రామాలను కోల్పోయిన నిర్వాసితుల పునరావాసం మరియు పునరావాస ప్యాకేజీ అమలు విషయంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
11 గ్రామాలకు సంబంధించిన నిర్వాసిత కుటుంబాలలో ఇప్పటికీ అనేక కుటుంబాలకు పూర్తి R&R ప్యాకేజీ, పరిహారం అందలేదని మా పరిశీలనతో వెల్లడైంది.
కొంతమంది కుటుంబాలకు మాత్రమే ఇంటి స్థలాలు కేటాయించారు. అక్కడ ఇంకా ప్రాధమిక సదుపాయాలు సమకూర్చలేదు. అందువలన ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
గతంలో గుర్తించిన కుటుంబాలతో పాటు, 2026 ఆగస్టు 31 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను కుటుంబాలుగా పరిగణించి R&ర్ ప్యాకేజీకి అర్హులుగా గుర్తించమని  కోరిన మీదట రెండు లక్షలు ప్రకటించారు. కానీ 18 సంవత్సరాలు నిండి పెళ్లయిన యువతులకు కూడా సముచిత పరిహారం,  R&R ప్రయోజనాలు కల్పించాలి అనే డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఓటీఎస్ పేరుతో ప్యాకేజి ఇచ్చిన వారికి కూడా ఇంటి స్థలం మరియు అవసరమైన పునరావాస సదుపాయాలు పూర్తిగా కల్పించాల్సి ఉంది. నిర్వాసితులకున్న చట్టపరమైన హక్కులు మీకు తెలుసు.
భూసేకరణ, పునరావాసం మరియు పునరావాస పునరావాస హక్కులకు సంబంధించిన Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013లోని Section 38 ప్రకారం, భూమిని స్వాధీనం చేసుకునే ముందు పరిహారం మరియు R&R హక్కుల అమలుకు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా, పునరావాస ప్రక్రియ అన్ని అంశాలలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ పై ఉందని Section 38(2) పేర్కొంటుంది. సాగునీటి/హైడెల్ ప్రాజెక్టులకు సంబంధించి submergenceకు ఆరు నెలల ముందు R& పూర్తి చేయాలనే ప్రత్యేక నిబంధన కూడా Section 38(1)లో ఉంది. కానీ ఇదేమీ అమలు చేయలేదు.
పరిహారం రావల్సిన వారు ప్రతిరోజూ  అధికారులు చుట్టూ తిండి, నీళ్ళు లేకుండా తిరుగుతున్నారు. వారి బాధను తెలిపేందుకు నిరసన తెలియచేయడాన్ని కూడా అనుమతించకుండా నిరంకుశంగా అధికారులు అడ్డుకున్నారు.
కలెక్టర్  కార్యాలయం వద్ద నిరసన  ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు మా జిల్లా పార్టీ కార్యదర్శి డి.సోమయ్యతో పాటు మరికొందరిని నిర్బంధించారు.సోమయ్యను కక్ష పట్టినట్లు కొట్టారు. నిర్వాసితుల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరించారు. వంటావార్పు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఆహారాన్ని పారబోశారు. పాత్రలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు ప్రెస్‌క్లబ్‌లో సమావేశం జరుపుకోడాన్ని అడ్డుకుంటూ ప్రెస్ క్లబ్ వారిపై ఒత్తిడి చేశారు. ఈ  అక్రమ చర్యలకు బాధ్యులైన వారి పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.  
ప్రజలు తమ సమస్యలను శాంతియుతంగా వ్యక్తం చేసుకునే ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
మీరు స్వయంగా తక్షణం జోక్యం చేసుకోని ఈ క్రింది సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను.
1. నిర్వాసితుల కాలనీలలో సదుపాయాలు కల్పించాలి. గృహనిర్మాణం చేసుకునేందుకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలి. ఇతర మెటీరియల్  హోల్ సేల్ రేట్లకు సరఫరా చేయాలి.
2. పెండింగ్‌లో ఉన్న మొత్తం పరిహారం మరియు R&R ప్యాకేజీ నిధులను వెంటనే విడుదల చేయాలి. మిస్సింగ్ జాబితా, గెజిట్ లో పేర్లకు, 18 సంవత్సరాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చెల్లింపులు పూర్తి చేయాలి.
3. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, ముఖ్యంగా పెళ్లయిన యువతుల అర్హతపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, అర్హులైన వారందరికీ R&R ప్రయోజనాలు కల్పించాలి.
4. గుండంచర్ల తదితర గ్రామాల నిర్వాసితుల ఇంటి స్థలాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.
5. మిగిలిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు మరియు R&R ప్రక్రియలను ప్రత్యేక కాలపట్టికతో పూర్తి చేయాలి.
6. నిర్వాసితులను భయపెట్టడం,  నిర్వాసితుల సంఘం నాయకుల పై దౌర్జన్యం చేయడం ,క్రిమినల్ కేసుల పేరుతో బెదిరించడం వంటి చర్యలు జరగకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.
7. నిర్వాసితులు, ప్రజా ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులతో  ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రతి సమస్యకు లిఖితపూర్వక పరిష్కార కాలపట్టిక ప్రకటించాలి.
ప్రాజెక్టు ప్రయోజనాల కోసం నిర్వాసితుల హక్కులు, గౌరవం, జీవనోపాధి  వదులుకున్నారు. వారి త్యాగం మరువలేనిదని శిలాఫలకం వేశారు. “ప్రాజెక్టు అభివృద్ధి - నిర్వాసితుల పునరావాసం” రెండూ సమాంతరంగా పూర్తయ్యే విధానాన్ని అమలు చేయాలి.
ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా ఆదేశించాలని, నిర్వాసితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నాము.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి