
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,
తేది : 21 సెప్టెంబర్ , 2026.
వెలిగొండ నిర్వాసితులపై నిర్బంధానికి ఖండన - సిపిఐ(యం)
పెండింగులో ఉన్న వెలిగొండ నిర్వాసితులకు న్యాయం చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితులపైన, వారికి మద్దతు ఇచ్చిన సిపిఐ(యం) నాయకత్వంపైన నిర్బంధం ప్రయోగించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. సిపిఐ(యం) జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య ఫోన్ లాక్కొని దౌర్జన్యంగా అరెస్టు చేయడం అమానుషం. వెలిగొండ ప్రాజెక్టుకోసం త్యాగం చేసిన రైతులు, కూలీలు, వృత్తిదారులను రోడ్డునపడేసి దాన్నే ఘనకార్యంగా చెప్పుకోవడం అన్యాయం. వెలిగిండ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రయోజనం నిర్వాసితులకు సైతం దక్కాలి. అప్పుడే ఇలాంటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయి అభివృద్ధికి దోహదపడతాయి.
వెలిగొండ నిర్వాసితుల మిస్సింగ్ జాబితా ప్రకటించాలని, పరిహారం అందని నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వాలని, పునరావాస కాలనీలలో సౌకర్యాలు కల్పించాలని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు వాగ్దానం చేసిన రూ. 2 లక్షలు వెంటనే ఇవ్వాలని, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఐ(యం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాంతియుతంగా మార్కాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ(యం) నాయకత్వాన్ని పోలీసులు ఆకారణంగా అరెస్టు చేయడం గర్హనీయం.
ఆందోళన చేస్తున్న వారిని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి నిర్బంధం ప్రయోగించడం ద్వారా అణిచివేయాలని చూడడం దుర్మార్గం. నిర్వాసితుల సమస్యలపై ఎలాంటి ఉద్యమం లేకుండా చేయాలన్న స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి కారణంగా నిర్వాసితులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. సోమయ్యను అరెస్టు చేయడమేగాకుండా గాయాలైనా వైద్యం చేయించలేదు.
దాడికి పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, జిల్లా కార్యదర్శి సోమయ్యకు వెంటనే చికిత్స అందించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వాసితుల పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
