“స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స” ఛానల్‌పైన ఇతర సోషల్ మీడియాపైన నిషేదం ఎత్తివేయాలి - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 సెప్టెంబర్, 2026.
“స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స” ఛానల్‌పైన
ఇతర సోషల్ మీడియాపైన నిషేదం ఎత్తివేయాలి - సిపిఐ(యం)
విశాఖ నగరంలో గూగుల్ అదానీ డేటా సెంటర్‌లు మరియు వివిధ డేటా సెంటర్‌ల ఏర్పాట్లపై వస్తున్న ప్రశ్నలకు, విమర్శలకు సమాధానం ఇవ్వకుండా “స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స” అనే ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుపై నిషేధించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణమే నిషేధం ఎత్తివేయాలని రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు కాబోతున్న డేటా సెంటర్‌లపై మేధావులు, విద్యావంతులతోపాటు నగర ప్రజలలో రకరకాల సందేహాలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి భూసేకరణ మొదలుకొని నీరు, విద్యుత్‌శ్చక్తి, పర్యావరణం అంశాలపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరు లేవనెత్తుతున్న సందేహాలకు సమాధానం ఇవ్వకుండా ఆ సమస్యలపై పనిచేస్తూ విస్తృత ఆదరణ పొందుతున్న సోషల్ మీడియా ఛానెల్‌ను నిషేధించడం గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలను వివిధ రూపాలలో వ్యక్తం చేయడం ప్రజల ప్రాథమిక హక్కు. అటువంటి హక్కులను కాలరాచే విధంగా మెటా ద్వారా నిషేధించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం తగదు.
సోషల్ మీడియాలో డేటా సెంటర్‌లపై వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వారి పోస్టులు తీసివేసి ప్రభుత్వ అనుకూల మరియు కార్పొరేట్ కంటెంట్‌ను మాత్రమే సోషల్ మీడియాలో ఛలామణి చేసే ప్రయత్నాలు ప్రభుత్వ నిరంకుశ స్వభావాన్ని తెలియజేస్తున్నాయి.
ప్రజల చేతిలో సాధనంగా ఉన్న సోషల్ మీడియాను కూడా మెటా, గూగుల్ వంటి కంపెనీలు ప్రభుత్వాలతో చేయి కలిపి సెన్సార్ చేసే విధంగా తెచ్చిన చట్టాల ఫలితమే ఈ నిషేధం. ఈ చట్టాలను అడ్డుపెట్టుకొని నిమిషాల్లో నిరసన గళాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నొక్కివేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ డేటాపై విదేశీ కంపెనీల గుత్తాధిపత్యం, నిరంకుశత్వ సాధనంగా మారే ప్రమాదాన్ని త్రోసిపుచ్చలేము.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలు, వాటికి తోడ్పడుతున్న మెటా, గూగుల్ విధానాలకు వ్యతిరేకంగా  ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు నిరసించాలి. స్టాప్ వైజాగ్ డేటా సెంటర్‌పైన, వ్యక్తుల పోస్టింగులు మరియు వీడియోలపైన ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి