కరువు మండలాలు, ప్యాకేజీ ప్రకటించాలి సిఎం, డిప్యూటీ సిఎంకు కరువు ప్రాంతాల్లో పర్యటించే తీరికలేదా ?

ఈరోజు (20 సెప్టెంబర్) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

కరువు మండలాలు, ప్యాకేజీ ప్రకటించాలి
సిఎం, డిప్యూటీ సిఎంకు కరువు ప్రాంతాల్లో పర్యటించే తీరికలేదా ?
జాతీయ విపత్తుగా కరువు - కేంద్రం లక్షకోట్లు ప్యాకేజీ ఇవ్వాలి
రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆందోళనకు మద్దతు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
బడా పెట్టుబడిదారుల లాభాపేక్షతోనే ఎల్‌నినో
22ఏపై పబ్లిక్ స్క్రూటినీకి డిమాండు
అసైన్‌మెంట్ కమిటీలు పునరుద్దరించాలి

రాష్ట్రం తీవ్ర కరువులోకి వెళ్లిపోతోందని, వెంటనే కరువు మండలాలు ప్రకటించడంతోపాటు, ప్యాకేజీ కూడా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఆదివారం బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాంతో కలిసి ఆయన మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను తీర్మానాలను మీడియాకు వెల్లడించారు. కరువు విజృంభిస్తోందని, తీవ్ర ఎల్‌నినో ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకపోడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు పర్యటించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. రైతు, వ్యవసాయ కార్మిక, కౌలురైతు సంఘాలు 21వ తేదీన ధర్నాలకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలు ప్రకటిస్తామని తెలిపిందన్నారు. పరిస్థితులు తీవ్రంగా మారుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందని అన్నారు. పెట్టుబడిదారుల కోసం దేశదేశాలు తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్, లోకేష్‌బాబుకు కరువు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల బాధలు తెలుసుకుని, రైతులను పరామర్శించే తీరికలేదా అని ప్రశ్నించారు. మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయమని అన్నారు. ఈ నేపథ్యంలో కరువు ప్రభావిత మండలాలు ప్రకటించి ఆదుకునేందుకు ప్యాకేజీ కూడా ఇవ్వాలన్నారు.
బడా పెట్టుబడిదారులు లాభాపేక్ష కోసం పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వచ్చే ఏడాది తీవ్ర ఎల్‌నినో ఉండే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని,  కేంద్రం స్పందించి నివారణకు లక్ష కోట్లు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండు చేశారు. ఇదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బతీసే డేటా సెంటర్లను విశాఖలో పెడుతున్నారని, దీనికి నీరు, విద్యుత్ పెద్ద ఎత్తున అవసరం ఉంటుందని అన్నారు. ఇది ఉష్ణోగ్రతలను మరింత పెంచుతుందని వివరించారు. కనీసం పర్యావరణ ప్రభావ అంచనా కూడా లేకుండా నేరుగా అనుమతులు ఇచ్చేస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసేలా పెట్టే పర్రిశమలకు అనుమతులు ఇవ్వకూడదన్నారు. 50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తే 20 లక్షల ఎకరాల్లో కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. అలాగే రుణాలు రద్దు చేయాలని, ఉపాధిహామీ పనులు 200 రోజులు కల్పించి ప్రభుత్వం నిర్ణయించిన మేరకై కనీసం వేతనం రూ.310కి తగ్గకుండా చూడాలని కోరారు. ఈనెల 21వ తేదీ నుండి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు చేసే ఆందోళనలకు పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు ఒక్కో కుటుంబానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే పశువులకు మేత కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.
అందరికీ ఇంటి స్థలం- 22ఏపై పబ్లిక్ స్క్రూటినీకి డిమాండు
రాష్ట్రంలో ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇళ్లస్థలం ఇవ్వాలని శ్రీనివాసరావు కోరారు. ఎన్నికల  ముందు అందరికీ ఇళ్లస్థలం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 22ఏ కింద  12 లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగాయని చెప్పి ఆపేసి ఇప్పుడు లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేశారని అన్నారు. అసైన్డ్ భూములను పెత్తందారులు, శతకోటీశ్వరులు దురాక్రమణ చేశారని విమర్శించారు. అసైన్డ్  కమిటీలను పునరుద్దరించి ఈ భూముల ఫ్రీ హోల్డ్‌పై స్క్రూటినీ చేయాలని, పేదలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తున్న భూములన్నీ పెద్దల చేతుల్లో ఉన్నవేనని తెలిపారు.  సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం మాట్లాడుతూ ఎపిలో 54 శాతం పంటలు దెబ్బతిన్నాయని, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రజలను ఆదుకోవాలని కోరారు.