మోహన్‌భగవత్ వ్యాఖ్యలు యువత మనసులను కలుషితం చేసే కుట్ర

(ఈరోజు (19 సెప్టెంబర్) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

మోహన్‌భగవత్ వ్యాఖ్యలు
యువత మనసులను కలుషితం చేసే కుట్ర
రాజ్యాంగ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
అమెరికా దుందుడుకు చర్యలను ఖండించాలి
ఇళ్ల పట్టాల పేరుతో పేదలకు శఠగోపం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ఆరఎసఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలు యువత మనసులను కలుషితం చేసేవిగా ఉన్నాయని, దేశంలో  ఉన్న ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ధర్మం ప్రకారం నడుచుకోవాల్సిందేనని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. శనివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు. మోహన్ భగవత్ ఉజ్జయినిలో జరిగిన యువత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, అమెరికా దుందుడుకు చర్యలు, ఎసఐఆర్, ఇళ్ల పట్టాలు, 22ఏ భూములు తదితర అంశాలపై మాట్లాడారు. మోహన్ భగవత్ ఇహలోకం, పరలోకమంటూ ధర్మం ప్రాతిపదికన పాలన సాగాలని చెబుతున్నారని విమర్శించారు. మన దేశంలో రెండూ కలిసే ఉంటాయని, అందువల్ల లౌకికవాదం పనికిరాదని చెప్పడం రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని తెలిపారు. ఆయన చెప్పే ధర్మం అంటే మనుధర్మమా ?  వర్ణ ధర్మమా ?  ఆశ్రమ ధర్మమా దేని ప్రతిపాదికన పనిచేయాలో చెప్పాలన్నారు. రాజ్యాంగ ప్రకారం పౌరధర్మం ప్రాతిపదికన పాలన చేయాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు రాజ్యాంగాన్ని నిర్మించారని దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని తెలిపారు. మోహన్‌భగవత్ వ్యాఖ్యలను సిపిఎం ఖండిస్తుందని తెలిపారు. అమెరికా సెనెట్ ఆమోదించిన విధంగా 100 శాతం టారిఫ్ వేస్తే అయిల్ దిగుమతులపై ఆధారపడిన దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. మోడీ అమెరికా చెప్పుచేతల్లో ఉన్నా ట్రంప్ భారతదేశానికి సానులకూలంగా లేరని అన్నారు. అమెరికా దుందుడుకు చర్యలను నిర్థ్వంధంగా ఖండించాలని, అమెరికా అనుకూల విదేశాంగ విధానం పనికి రాదని తెలిపారు. అమెరికా అయిల్‌పై ఆధారపడకుండా మన అవసరాలు తీర్చుకునే పద్దతుల్లో విదేశాంగ విధానం ఉండాలని అన్నారు. ఇరాన్‌లో అమెరికా చేస్తున్న దుర్మార్గాలను ఆపాలని కోరారు. క్రూడ్ అయిల్ ధర బ్యారెల్ 100 డాలర్లపైకి పెరిగిందని, దానివల్ల దేశంపై భారం పడుతుందని, అది అంతిమంగా ప్రజలపైనే వేస్తారని పేర్కొన్నారు. ఎసఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్నికలను దెబ్బతీసే విధంగా ఉందని తెలిపారు. అనర్హులుగా లక్షల మందికి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చట్ట ప్రకారం ఉండాల్సిన వ్యవస్థని కానీ రిగ్గింగ్ చేసేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా గెలవాలని బిజెపి చూస్తోందని పేర్కొన్నారు.

ఎన్నికల కోసం ప్రజలను మోగిస్తున్నారు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
రాష్ట్రంలో పేదలు రెండేళ్ల తరువాత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వానికి గుర్తొచ్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.  స్థానిక ఎన్నికలు కోసమే పట్టాల పంపిణీ అని విమర్శించారు. రాష్ట్రంలో 26 లక్షల మంది ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకుని ఉంటున్నారని వారికి న్యాయం జరగలేదని, పశ్చిమగోదావరిలో 2000 ఇళ్లు కూలగొడితే సిఎం మాట్లాడలేదని అన్నారు. విశాఖలో 1.26 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే 66 వేలమందికి పట్టాలు ఇవ్వొచ్చని తేల్చారని, ప్రస్తుతం 28 వేలమందికి మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఇది పేదలకు శఠగోపం పెట్టడమేనని అన్నారు. గత ఎన్నికల్లో పట్టణాల్లో రెండుసెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్లులేని పేదలకు ఇస్తామన్నారని, ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. విశాఖలో పేదలకు పట్టాభిషేకం పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. నిజంగా పేదలకు స్థలాలకు ఇవ్వాలంటే భూములు తీసుకుని పంచాలని అన్నారు. ఉన్న భూములు, ప్రజల ఆస్తులు, రైతుల భూములను ఇష్టానుసారంగా కంపెనీలకు ఇచ్చేస్తున్నారని అన్నారు. 22ఎ కింద 12 లక్షల ఎకరాలకు క్లియరెన్స్ ఇస్తే అవన్నీ అక్రమాలని ఆపేసి ఇప్పుడు తొమ్మిది లక్షల మందికి క్లియరెన్స్ ఇచ్చారని తెలిపారు. దీనిలో పేదలకు ఏమిస్తున్నారో చెప్పాలన్నారు. కృష్ణాజిల్లాలో హంసలదీవి ప్రాంతంలో ఊళ్లకు ఊళ్లను 22ఏ కింద పెట్టేశారని, విశాఖలో పంచగ్రామాల సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. అదే దేవస్థానం భూమి 120 ఎకరాలను అదానీకి డేటా సెంటర్‌కు కేటాయించారని అన్నారు. ఇది పూర్తిగా మోసకారితనమని పేర్కొన్నారు. పెన్షన్లలో నిబంధనలు చూస్తే అసలు ఇస్తారా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోందని తెలిపారు. బిసిలను, పేదలను మోసం చేసేందుకు రిజర్వేషన్ల అంశం తెచ్చారని విమర్శించారు.
కూటమిని ఓడించడమే లక్ష్యం
కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విదాధానాలు అనుసరిస్తోందని, కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ మత కల్లోలాన్ని రెచ్చగొట్టే బిజెపికి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే క్రిస్టియన్లకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఇటువంటి కూటమిని ఓడించడంమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వామపక్షపార్టీలు, ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలు కలిసొచ్చేవారిని కలుపుకుని ముందుకు వెళతామని. వామపక్ష ప్రజాతంత్ర లౌకికశక్తులతో కలిసి పోటీచేస్తామని చెప్పారు. ఇప్పటికే సిపిఐతో చర్చలు జరిపామని వివరించారు.